Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 17th కరెంట్ అఫైర్స్
G20 summit 2022 : ఇది యుద్ధాల శకం కాదు.. జీ–20 సదస్సులో నాయకులు
ఇండోనేషియాలోని బాలిలో నవబంర్ 15, 16 తేదీల్లో జీ–20 సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ–20 సదస్సు నాయకులు పిలుపునిచ్చారు. ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదని నినదించారు. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలే జీ–20 సదస్సులో కూడా ప్రతిధ్వనించాయి. ఇది యుద్ధాల శకం కాదంటూ నాడు పుతిన్‌తో మోదీ చెప్పిన హితవచనాలనే జీ–20 సదస్సు ముగింపు రోజు నవంబర్ 16 (బుధవారం) సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, ప్రపంచ దేశాలపై దాని ప్రభావంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ‘‘శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ–20 దేశాలు పిలుపునిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలి. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది’’ అని ఆ డిక్లరేషన్ పేర్కొంది. ‘‘ఘర్షణల శాంతియుత పరిష్కారం, సంక్షోభ నివారణకు కృషి, దౌత్యం, చర్చలు ఇవన్నీ ఇప్పుడు కీలకమే. ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదు’’ అని ఆ డిక్లరేషన్‌లో సభ్యదేశాలు మూకుమ్మడిగా నినదించాయి.
ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై జీ–20 సదస్సులో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అంతర్జాతీయ చట్టాలను అందరూ కట్టుబడి ఉండాలని సదస్సు గట్టిగా చెప్పింది. సంక్షోభంలో చిక్కుకున్న పౌరుల రక్షణ కూడా అత్యంత ముఖ్యమైనదేనని స్పష్టం చేసింది. సదస్సులో పాల్గొన్న అత్యధిక సభ్య దేశాలు రష్యా యుద్ధాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తూ రష్యా చట్టవిరుద్ధంగా అన్యాయంగా చేస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచం ఆర్థికంగా కోలుకోలేకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతి, స్థిరత్వాలను పరిరక్షించే అంతర్జాతీయ చట్టాలను అన్ని దేశాలు పాటించేలా చూడాలని పేర్కొన్నాయి. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని రష్యా చేస్తున్న బెదిరింపులు ఆమోద యోగ్యం కాదని, ఈ యుద్ధంతో మానవీయ సంక్షోభంతో పాటు ఆర్థిక భారం కూడా ప్రపంచ దేశాలు మోయాల్సి ఉంటుందని వీలైనంత త్వరంగా యుద్ధానికి ముగింపు పలకాలని పేర్కొన్నాయి. కొన్ని దేశాలు మాత్రం అన్ని అంశాలను తులనాత్మకంగా బేరిజు వేసుకోవాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.
భారత్‌ది కీలక పాత్ర
డిక్లరేషన్ రచనలో భారత్ ఇతర వర్ధమాన దేశాలతో కలిసి కీలకంగా వ్యవహరించింది. అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడానికి , ఒకే తాటిపై నిలబడడానికి భారత దౌత్య బృందానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ప్రధాని మోదీ ప్రముఖ పాత్ర పోషించారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ‘‘భారత్ తనకున్న , సానుకూల, నిర్మాణాత్మక వైఖరితో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న దేశంగా ఎదిగింది. పరిష్కార మార్గాలను చూపించడంలోనూ, అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయాలను సాధించడంలోనూ ముందుంది’’ అని జీ–20 డిక్లరేషన్ భారత్‌ను కొనియాడింది.
ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడాలి..
ఉగ్రవాదానికి నిధులందించే కార్యకలాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని జీ 20 సభ్య దేశాలు పిలుపునిచ్చాయి. మనీ లాండరింగ్‌ని నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకి నిధులు అందకుండా వ్యూహాత్మక వ్యవహరించడంతో చిత్తశుద్ధి ప్రదర్శించాలని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉగ్రవాద ముప్పు లేకుండా అన్ని దేశాలు కృషి చేయాలని ఆ ప్రకటన స్పష్టం చేసింది. మరోవైపు కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలపై కూడా సమావేశం దృష్టి సారించింది.
G20 presidency to India : భారత్‌కు జీ 20 అధ్యక్ష బాధ్యతలు.. అందరినీ కలుపుకొనిపోతామన్న మోదీ
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి జీ 20 అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. బాలిలో జరిగిన నవంబర్ 16న జరిగిన ముగింపు సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి ఇండొనేసియా అధ్యక్షుడు జోకో విడోడో లాంఛనంగా అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు.
వచ్చే ఏడాది సదస్సు భారత్ ఆధ్వర్యంలో జరగనుంది. జీ 20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని మోదీ అన్నారు.
‘‘ఇవి అత్యంత ప్రతిష్మాత్మక బాధ్యతలు. సభ్య దేశాల సహాయ సహకారాలతో ప్రపంచ సంక్షేమానికి జీ 20 సదస్సును వేదికగా మారుస్తాం. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం, ఆహారం, ఇంధన ధరల పెరుగుదల వంటి సమస్యల నేపథ్యంలో కూటమి సారథ్య బాధ్యతలు స్వీకరిస్తున్నాం. అన్ని దేశాలు జీ 20 వైపే ఆశగా చూస్తాయి. భారత్ ఆధ్వర్యంలో జీ 20 అందరినీ కలుపుకొని పోతూ నిర్ణయాత్మకంగా, చర్యలు తీసుకునేలా ఉంటుంది. వచ్చే ఏడాదిలోగా జీ 20 కొత్త కొత్త ఆలోచనలు చేసి, సమష్టి నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు. 2024లో బ్రెజిల్లోనూ, ఆ తర్వాత ఏడాది 2025లో దక్షిణాఫ్రికాలోనూ జీ 20 సదస్సు జరగనుంది.
Superstar Krishna :ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు నవంబర్ 16(బుధవారం) హైదరాబాద్లోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు.
Rishi Sunak : ప్రతి ఏటా 3,000 ప్రొఫెషనల్ వీసాలు!
18–30 ఏళ్ల మధ్య వయస్కులైన యువ నిపుణులకు ఉద్యోగాలు, ఉన్నత చదువుల నిమిత్తం ఏటా అదనంగా 3,000 వీసాలివ్వాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ యూకే–ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద చదువుకోవడంతో పాటు రెండేళ్ల దాకా పని చేసేందుకు కూడా వారికి వెసులుబాటు కల్పించనుంది. జీ 20 సదస్సు సందర్భంగా ప్రధానులు నరేంద్ర మోదీ, రిషి సునాక్ నవంబర్ 16(బుధవారం) అధికారికంగా సమావేశమయ్యాక బ్రిటన్ ఈ మేరకు ప్రకటించింది.
ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై మోదీ, సునాక్ లోతుగా చర్చించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ముఖ్యంగా చర్చ జరిగింది. 2030 కల్లా ద్వైపాక్షిక సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. తాను ప్రధాని అవడం పట్ల భారత్ నుంచి లభించిన అపూర్వ స్పందనను రిషి ప్రస్తావించారు. ఇందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. బ్రిటన్‌తో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చర్చల అనంతరం మోదీ వెల్లడించారు. ‘‘రిషితో భేటీ గొప్పగా సాగింది. వర్తకం, రక్షణ, భద్రత సహా పలు కీలక రంగాల్లో మరింత సన్నిహిత సంబంధాల దిశగా లోతుగా చర్చించాం’’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ సహా పలువురు దేశాధినేతలతో కూడా మోదీ వరుసగా భేటీ అయ్యారు.
Donald Trump : అమెరికా అధ్యక్ష బరిలో మళ్లీ ట్రంప్..!
2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేయనున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నవంబర్ 15న ప్రకటించారు. డెమొక్రాట్ల నాయకుడు బైడెన్ నేతృత్వంలో అమెరికా పతనావస్థలోకి దిగజారిందని, దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు మళ్లీ అధ్యక్షుడిగా వస్తానన్నారు. ‘‘గ్రేట్ అమెరికా కోసం మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నా. మీ గొంతుకగా ఉంటా. బైడెన్ మళ్లీ ప్రెసిడెంట్ కాలేరు! ఆయన హయాంలో అన్నీ వైఫల్యాలే. అసలైన అభివృద్ధిని నేను చేసి చూపిస్తా. అందుకే వస్తున్నా. నేను సిద్ధం. మీరూ సిద్ధమేగా!’’ అని ఫ్లోరిడాలోని మార్–ఏ–లాగో ఎస్టేట్‌లో నవంబర్ 15న మంగళవారం దాదాపు 400 మంది అతిథుల సమక్షంలో తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. 2016లో హిల్లరీ క్లింటన్‌ను ఓడించి అధ్యక్షుడయ్యాక నాలుగేళ్లు తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
Technology Events : భారత్‌లో 75 కోట్ల స్మార్ట్‌ఫోన్లు..!
పేదరిక నిర్మూలనకు సాంకేతికతను తిరుగులేని అస్త్రంగా భారత్ ఉపయోగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆసియాలో అతి పెద్ద టెక్నాలజీ ఈవెంట్ అయిన 25వ బెంగళూరు టెక్ సమిట్ (బీటీఎస్)ను ఉద్దేశించి ఇండొనేసియాలోని బాలి నుంచి నవంబర్ 16న (బుధవారం) ఆయన వీడియో సందేశమిచ్చారు. భారత్‌లో చిరకాలం పాటు వేళ్లూనుకుని పోయిన అధికార అలసత్వాన్ని తమ హయాంలో నిర్మూలించామన్నారు. ‘‘భారత ప్రగతి ప్రస్థానంలో కొన్నేళ్లుగా అన్ని అంశాలూ అద్భుతంగా కలిసొస్తున్నాయి. ఆరోగ్యం, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ వంటి అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయంగా భారతీయులు సారథ్య స్థానాల్లో రాణిస్తున్నారు. మాతో కలిసి పని చేసేకుందకు మీకిదే స్వాగతం’’ అని ఇన్వెస్టర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్‌లో 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 40 స్థానానికి ఎగబాకిందన్నారు. ‘భారత్‌లో గత ఎనిమిదేళ్లలో స్మార్ట్‌ఫోన్లు 15 కోట్ల నుంచి 75 కోట్లకు పెరిగాయి’ అని చెప్పుకొచ్చారు.
Sabarimala Temple : తెరుచుకున్న శబరిమలై ఆలయం
అయ్యప్ప భక్తుల కోసం కేరళలోని శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. మాలధారుల సందర్శనార్థం నవంబర్ 16న (బుధవారం) ఆలయాన్ని తెరిచారు. కరోనా నిబంధనలేవీ లేకపోవడంతో ఈ ఏడాది భక్తలు సంఖ్య 40 నుంచి 50 శాతం పెరగవచ్చునని అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా కరోనా భయాలు ఉండడంతో రోజుకి 30 వేల మంది భక్తులకి మాత్రమే దర్శనానికి అనుమతినిచ్చారు. ఈ ఏడాది అలాంటి ఆంక్షలేవీ లేవని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ తెలిపారు. భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
Sharath Kamal : శరత్ కమల్‌కు ఐటీటీఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో చోటు
భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డీ ఆచంట శరత్ కమల్‌ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీటీఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో శరత్ కమల్‌కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శరత్ కావడం విశేషం. 2022–2026 మధ్య నాలుగేళ్ల కాలానికిగాను వేర్వేరు ఖండాల నుంచి ఎనిమిది మందిని (నలుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఇందులోకి ఎంపిక చేశారు. మొత్తం 283 మంది అథ్లెట్లు ఓటింగ్‌లో పాల్గొనగా, ఆసియా ఖండం ప్రతినిధిగా శరత్‌కు 187 ఓట్లు లభించాయి. మహిళల కేటగిరీలో ఎంపికైన చైనా ప్యాడ్లర్ ల్యూ షీవెన్‌కు 153 ఓట్లు మాత్రమే వచ్చాయి. తనకు లభించిన ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శరత్ కమల్...ఆసియా ఖండం నుంచి తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ 3 స్వర్ణాలు నెగ్గాడు.
Asian Airgun Championship 2022: స్వర్ణ పతకాల వేటలో భారత షూటర్లు
కొరియాలోని డేగులో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. నవంబర్ 16న జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్‌లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్‌లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి.
Media and Entertainment Industry : మీడియా@65 బిలియన్ డాలర్లు!
దేశీ మీడియా, వినోద (ఎంఅండ్‌ఈ) పరిశ్రమ 2030 నాటికి 55–65 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓటీటీ, గేమింగ్ విభాగాలు ఇందుకు ఊతంగా ఉండనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఎంఅండ్‌ఈ రంగం 2022లో 27–29 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ‘పటిష్టమైన వృద్ధి చోదకాలు ఉన్నందున 2030 నాటికి పరిశ్రమ 55–65 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 65–70 బిలియన్ డాలర్లకు కూడా చేరే సామర్థ్యాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్ విభాగాల వృద్ధి ఇందుకు తోడ్పడనుంది‘ అని నివేదిక పేర్కొంది.
టెక్నాలజీ పురోగతి, వినియోగదారుల ధోరణుల్లో మార్పులతో మీడియాలోని కొన్ని విభాగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. పరిశ్రమ ‘బూమ్‘కు డిజిటల్ వీడియో, గేమింగ్ సెగ్మెంట్‌లు దోహదపడుతున్నాయని ని వేదిక వివరించింది. దీని ప్రకారం ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల జోరుతో 2022లో మొత్తం మీడియా వినియోగంలో వీటి వాటా 40%గా ఉంది.
డిజిటల్.. డిజిటల్..
మిగతా సెగ్మెంట్ల కన్నా ఎక్కువగా డిజిటల్ వినియోగం వృద్ధి చెందుతోంది. 2020–2022 మధ్య కాలంలో భారత ఎంఅండ్‌ఈ పరిశ్రమ దాదాపు 6 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందగా, ఇందులో మూడింట రెండొంతుల వాటా డిజిటల్‌దే కావడం గమనార్హం. నివేదిక ప్రకారం సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్‌వీవోడీ) చందాలు 2022లో 8–9 కోట్ల మేర పెరగవచ్చు.
ప్రస్తుతం ప్రీమియం, ప్రత్యేకమైన కంటెంట్ కోసం చెల్లించడానికి యూజర్లలో మరింత సుముఖత పెరుగుతోంది. 2030 నాటికి మొత్తం ఓటీటీ ఆదాయంలో ఎస్‌వీవోడీ వాటా 55–60%గా ఉండనుంది. పరిశ్రమపై కొత్త ధోరణులు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనున్నాయి. మెటావర్స్ మొదలైన టెక్నాలజీల వినియోగం .. గేమింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా రంగాల్లోకి గణనీయంగా విస్తరించనుంది
Also read: Weekly Current Affairs (International) Bitbank: USA కరెన్సీలో కనిపించిన మొదటి ఆసియా అమెరికన్ ఎవరు?
Meltwater Champions Tour: చెస్ టోర్నీలో అర్జున్, ప్రజ్ఞానంద ఓటమి
మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్ ఫైనల్స్ చెస్ టోరీ్నలో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానందలకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఈ టోర్నీలో నవంబర్ 16న జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ అర్జున్ 0.5–2.5తో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) చేతిలో... చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 2.5–3.5తో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP