Skip to main content

డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడిన తొలి వ్యాక్సిన్‌?

పన్నెండేళ్లు దాటిన పిల్లలకూ ఇవ్వగలిగిన సరికొత్త కరోనా టీకా ‘జైకోవ్‌–డి’ను గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది.
ఈ టీకా అత్యవసర వాడకానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆగస్టు 20న అనుమతి ఇచ్చింది. దీంతో పిల్లలతోపాటు పెద్దవారిలోనూ ప్రభావవంతంగా పనిచేసే ‘జైకోవ్‌–డి’ టీకా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అత్యంత ఆధునికమైన డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీతో ఈ టీకాను రూపొందించారు. ఈ తరహా వ్యాక్సిన్లలో ప్రపంచంలోనే ఇదే మొదటిది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో కరోనా వ్యాక్సిన్‌ కూడా ఇదే.

డీబీటీ, ఐసీఎంఆర్‌ సహకారంతో..:
‘మిషన్‌ కోవిడ్‌ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా.. జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)ల సహకారంతో జైడస్‌ క్యాడిలా సంస్థ ‘జైకోవ్‌–డి’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జైకోవ్‌–డి టీకా అన్నిరకాల కరోనా వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని జైడస్‌ క్యాడిలా తెలిపింది. పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా తమ టీకా సురక్షితమని ప్రకటించింది. ఏటా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ ఎండీ షర్విల్‌ పటేల్‌ వెల్లడించారు. రెండు నెలల్లోనే టీకాను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు.

దేశంలో ఆరో టీకా..:
దేశంలో ఇప్పటివరకు సీరం ఇనిస్టిట్యూట్‌–ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కోవి షీల్డ్, భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్‌–వి, అమెరికాకు చెందిన మొడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లకు అనుమతి ఉంది. తాజాగా అందుబాటులోకి వస్తున్న జైకోవ్‌–డి టీకా ఆరోది కానుంది.

అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్స్‌తో...
  • జైకోవ్‌–డి ప్రపంచంలోనే తొలి ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ వ్యాక్సిన్‌. పూర్తిగా మన దేశంలోనే అభివృద్ధి చేసి, అందుబాటులోకి వస్తున్న రెండో వ్యాక్సిన్‌.
  • 50కిపైగా కేంద్రాల్లో 28వేల మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపారు. దేశంలో చేపట్టిన కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇదే అతిపెద్దది.

డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టీకా అంటే?

వ్యాక్సిన్లకు సంబంధించి అత్యంత అధునాతనమైన కొత్త విధానమే డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీ. కణాల్లో కేంద్రకానికి బయట ఉండే డీఎన్‌ఏను ప్లాస్మిడ్స్‌ అంటారు. ఈ ప్లాస్మిడ్స్‌ను జన్యుపరంగా మార్పిడి చేసి, టీకా ఉత్పత్తిలో వాడుతారు. టీకా ఇచ్చినప్పుడు జన్యుమార్పిడి ప్లాస్మిడ్లు.. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ సిస్టమ్‌)ను ప్రేరేపిస్తాయి. దీంతో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. భవిష్యత్‌లో కరోనా సోకితే.. వెంటనే హతమారుస్తాయి.

మూడు డోసుల టీకా..
ఇప్పటివరకు ఉన్న అన్ని టీకాలు రెండు డోసులు ఇస్తుండగా.. జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ మూడు డోసులు ఉంటుంది. మొదటిరోజుతోపాటు 28వ రోజున, 56వ రోజున ఈ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.

సూదిలేని మందు..
ప్రస్తుతమున్న కరోనా టీకాలన్నీ ఇంట్రామస్క్యులర్‌ (కండరాల లోపల ఇచ్చేవి) కాగా.. జైకోవ్‌–డి టీకాను ఇంట్రాడెర్మల్‌ (చర్మానికి, కండరాలకు మధ్య) రూపంలో ఇస్తారు. దీనిలో సూది ఉండదు. ఫార్మాజెట్‌గా పిలిచే ప్రత్యేక ఇంజెక్టర్‌ను వాడుతారు.

కొత్త వేరియెంట్లకు తగ్గట్టు
డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీతో రూపొందించిన టీకాల్లో మార్పులు చేయడం సులభమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనాలో ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు వస్తే.. దానికి తగినట్టుగా వెంటనే వ్యాక్సిన్‌లో మార్పులు చేసి వినియోగించవచ్చని అంటున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీతో జైకోవ్‌–డి అనే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : జెడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ
ఎందుకు : పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా టీకా ఇచ్చేందుకు...
Published date : 21 Aug 2021 05:57PM

Photo Stories