Skip to main content

డెంగీ నియంత్రణ చర్యలకు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ శ్రీకారం

డెంగీ నియంత్రణ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం చుట్టింది. దోమల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది.
రేడియేషన్ ద్వారా పునరుత్పత్తి లేని మగ దోమలను ఉత్పత్తి చేసి, వాటిని ఆడ దోమలపైకి వదలడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ 15న కీలకమైన నివేదిక విడుదల చేసిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

దోమల స్టెరిలైజేషన్ ఎలా..?
మున్ముందు ప్రపంచ జనాభాలో సగం మందికి డెంగీ ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ‘డెంగీ నివారణకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నా, దోమల నియంత్రణకు చేపడుతున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడంలేదు. అందువల్ల కొత్త విధానాలు చాలా అవసరం. ఇందులో దోమల స్టెరిలైజేషన్ పద్ధతి ఆశాజనకంగా ఉంది’ అని ఆమె ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు. డెంగీ, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాల్లో భాగంగా రేడియేషన్ ఉపయోగించి మగ దోమలను పునరుత్పత్తి రహితంగా చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. స్టెరైల్ క్రిమి టెక్నిక్ మొదట అమెరికా వ్యవసాయశాఖ అభివృద్ధి చేసింది. పంటలు, పశువులపై దాడి చేసే కీటకాలు, తెగుళ్లను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ఉపయోగించారు. మానవ వ్యాధులపై పోరాడటానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆరోగ్య రంగానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

పట్టణీకరణ వల్లే...
వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 40 వేల మందికి పైగా డెంగీ పరీక్షలు చేస్తే, వారిలో పావు వంతు మందికి డెంగీ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. 2019లో భారతదేశంలో గణనీయంగా డెంగీ కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి: డెంగీ నియంత్రణ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం
ఎప్పుడు: నవంబర్ 15, 2019
ఎందుకు: డెంగీ నియంత్రణకు
Published date : 16 Nov 2019 05:51PM

Photo Stories