దేశంలో తొలి డ్రైవర్ రహిత రైలు ఎక్కడ ప్రారంభమైంది?
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 28న ఢిల్లీ మెట్రోలో ఈ రైలును వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)లో భాగమైన 37 కి.మీల మెజెంటా లైన్ మార్గంలో(జానక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు) ఈ డ్రైవర్‌లెస్ ట్రైన్ నడుస్తుంది. మరో ఆరు నెలల్లో పింక్ లైన్(మజ్లిస్ పార్క్ - శివ్ విహార్)లోనూ ఈ రైలును నడపనున్నారు.
మరోవైపు అన్ని ప్రజా రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించే ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ను కూడా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్డు వల్ల ప్రయాణికులు తమకు నచ్చిన ప్రాంతాలకు.. నచ్చిన ప్రజారవాణా వ్యవస్థను ఎంచుకుని ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనే ఇది పనిచేస్తుంది. డ్రైవర్‌లెస్ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- ప్రస్తుతం 18 నగరాలకు పరిమితమైన మెట్రో రైలు సేవలను... 2025 నాటికి 25 నగరాలకు విస్తరిస్తాం.
- 2014లో 5 నగరాల్లో, 248 కిలోమీటర్లకు మాత్రమే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం 700కు పైగా కిలోమీటర్లలో అందుబాటులోకి వచ్చాయి.
- 2025 నాటికి సుమారు 1,700 కి.మీ. పరిధిలో మెట్రో సేవలను విస్తరింపజేస్తాం.
- ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటే పట్టణాలో ‘మెట్రోలైట్’ విధానంలో తక్కువ ఖర్చుతో మెట్రో సేవలందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- జల మార్గాలకు అవకాశమున్న నగరాల్లో ‘వాటర్ మెట్రో’ విధానం ఒక వినూత్న ఆలోచన అవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి డ్రైవర్ రహిత, ఫుల్లీ ఆటోమేటెడ్ రైలుప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మెజెంటా లైన్ మార్గం(జానక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు), న్యూఢిల్లీ