Skip to main content

దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎవరి పేరును పెట్టారు?

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.
ఇప్పటి వరకు దీనిని మాజీ ప్రధాని పేరిట ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’ గా వ్యవహరిస్తున్నారు. అయితే రాజీవ్‌ గాంధీ పేరును తొలగించి ఈ అవార్డుకు హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ పేరును జోడిస్తున్నట్లు ఆగస్టు 6న ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై అవార్డును ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’గా పిలుస్తారు. భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన నేపథ్యంలో హాకీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళిగా అత్యున్నత పురస్కారానికి పేరు పెట్టినట్లు కేంద్రం పేర్కొంది.

రాజీవ్‌ గాంధీ మరణానంతరం ఖేల్‌రత్న అవార్డును 1991–92 నుంచి భారత అత్యుత్తమ క్రీడాకారులకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 43 మంది ఆటగాళ్లు ఈ అవార్డును అందుకున్నారు. విజేతకు అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు పురస్కారాన్ని అందజేస్తారు.

ఇప్పటికే ఒక అవార్డు...
హాకీకి పర్యాయపదంలాంటి ధ్యాన్‌చంద్‌ 1926 నుంచి 1949 మధ్య కాలంలో జాతీయ జట్టుకు ఆడారు. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో భారత్‌ స్వర్ణం గెలవడంలో కీలకపాత్ర పోషించారు. 185 మ్యాచ్‌లలో 570 గోల్స్‌ చేసిన ధ్యాన్‌ చంద్‌ జయంతి (ఆగస్టు 29)నే ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా వ్యవహరిస్తుండగా... జాతీయ వార్షిక క్రీడా అవార్డుల్లో ఇప్పటికే ధ్యాన్‌చంద్‌ అవార్డు పేరిట ‘లైఫ్‌ టైమ్‌’ పురస్కారాన్ని అందిస్తున్నారు. క్రీడాకారులుగా ఉన్నప్పుడు, రిటైర్‌ అయిన తర్వాత కూడా ఆటకు చేస్తున్న సేవకు గుర్తింపునిస్తూ 2002లో దీనిని ప్రవేశపెట్టారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుగా రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన నేపథ్యంలో హాకీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ద్యాన్‌చంద్‌ను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళిగా...
Published date : 07 Aug 2021 05:36PM

Photo Stories