Skip to main content

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తొలి తరం నటుడు ఇకలేరు

ప్ర‌ముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు.
Current Affairs
అనారోగ్యం కారణంగా కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నవంబర్ 15న తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కరోనా బారిన పడిన ఛటర్జీ అక్టోబర్ 14న కరోనా నుంచి కోలుకున్నారు. అయితే మరోసారి ఆరోగ్యం విషమించి నవంబర్ 15న కన్నుమూశారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో సౌమిత్ర ఛటర్జీ జన్మించారు. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన ‘అపుర్ సంసార్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

2012లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు...
సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో నటించిన ఛటర్జీ.. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందారు. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన. బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ బెంగాలీ నటుడు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : సౌమిత్ర ఛటర్జీ (85)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 16 Nov 2020 05:45PM

Photo Stories