Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 28th కరెంట్ అఫైర్స్
Cricketer Wages : మహిళ క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు
భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చే చారిత్రక నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకుంది. మ్యాచ్ ఫీజుల విషయంలో టీమిండియా పురుష క్రికెటర్లు, మహిళా క్రికెటర్ల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అంతరాన్ని తొలగించింది. ఇకపై భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఇక నుంచి మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇప్పటి వరకు మహిళా క్రికెటర్లకు వన్డే, టి20లకు రూ.1 లక్ష లభిస్తుండగా, టెస్టు మ్యాచ్‌కు రూ. 2 లక్షల 50 వేలు ఇస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెట్‌లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, వివక్షను దూరం చేసే దిశగా తొలి అడుగు అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొనగా... తాజా నిర్ణయం మహిళల క్రికెట్ అభివృద్ధికి మరింతగా దోహదం చేస్తుందని అధ్యక్షుడు రోజర్ బిన్నీ వ్యాఖ్యానించారు.
Also read: Qutb Shahi History Bitbank in Telugu: మక్కా మసీదుకు పునాది వేసిన రాజు ఎవరు?
- ∙ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రమే ఇలా పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. భారత్ రెండో జట్టు కాగా...ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతోంది.
- ∙2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన నాటి నుంచి భారత మహిళల జట్టు ప్రదర్శన మరింతగా మెరుగవుతూ వస్తోంది. దీనిని మరింత ప్రోత్సాహించే దిశగా తాజా ప్రకటన వెలువడింది. అయితే బోర్డు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు చొప్పున బోర్డు ఇస్తోంది. అదే పురుష క్రికెటర్లకు మాత్రం ఎ, బి, సి గ్రేడ్‌లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు లభిస్తాయి.
- ∙బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తమైంది. ఈ రోజును అతి ప్రత్యేకమైన ‘రెడ్ లెటర్ డే’గా కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభివర్ణించగా... ఇదో చారిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా మహిళల క్రికెట్‌లో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నామని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Godwit Bird Record : 11 రోజుల్లో నాన్–స్టాప్‌గా 13,558 కిలోమీటర్ల ప్రయాణం
పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్‌విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆ్రస్టేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది.
Also read: T20 World Cup 2022 : పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఇదే..
ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్‌విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్‌లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్‌గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్‌లోని పుకొరోకొరో మిరండా షోర్‌బర్డ్ సెంటర్ ప్రకటించింది.
Also read: Flying saucer : గుట్టు తేల్చేందుకు నాసా కమిటీ
నీటిపై వాలితే మృత్యువాతే
గాడ్‌విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్‌డబ్ల్యూ అనే గాడ్‌విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్‌గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 52వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడతారు?
గాట్‌విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్‌విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్‌విట్, హడ్సోనియన్ గాడ్‌విట్, మార్బ్‌ల్డ్ గాడ్‌విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి.
Also read: Supreme Court: ఐటీ చట్టం సెక్షన్ 66-ఏ కింద ప్రాసిక్యూట్ చేయరాదు
Modi Congratulates Sunank : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై అంగీకారం
ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ గురువారం ఫోన్‌లో రిషి సునాక్‌తో మాట్లాడి, అభినందించారు. ‘‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రిషి సునాక్ ట్విట్టర్‌లో స్పందించారు. కొత్త పాత్రలో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, బ్రిటన్–భారత్ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌తో మోదీ మాట్లాడడం ఇదే మొదటిసారి.
Vladimir Putin : అణ్వాయుధాలు ప్రయోగించం
ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేనేలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. రాజకీయంగా, సైనికపరంగా కూడా తమకు అలాంటి అవసరం లేదన్నారు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని అన్నారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయంటూ అమెరికా, మిత్ర పక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. కాగా, ఖేర్సన్‌ను తిరిగి తమ వశం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకొస్తున్న ఉక్రెయిన్ సేనల ధాటికి ఖేర్సన్‌లోని రష్యా అనుకూల ఉన్నతాధికారులు పారిపోయారు. వీరితోపాటు వేలాది మంది స్థానికులు దాడుల భయంతో స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ‘తాజాగా అమెరికా, పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య ఉపగ్రహాలను యుద్ధంకోసం ఉక్రెయిన్ వాడుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం’ అని ఐరాసలో ఆయుధాల నియంత్రణ ప్యానెల్‌లో రష్యా ప్రతినిధి కాన్‌స్టాంటిన్ ఆరోపించారు. యుద్ధం కారణంగా శిలాజ ఇంధనాలకు ఎవరూ ఊహించనంతగా డిమాండ్ పెరిగే ప్రమాదముందని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ తన నివేదికలో హెచ్చరించింది.
ECB Bank : వడ్డీ రేట్లు 0.75 శాతం పెంపు
మాంద్యం భయాలకన్నా, ద్రవ్యోల్బణం కట్టడికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీరేటును 0.75% పెంచుతూ 25 మంది సభ్యుల గవర్నింగ్ కౌన్సిల్ అక్టోబర్ 27న కీలక నిర్ణయం తీసుకుంది. యూరో కరెన్సీ చరిత్రలోనే ఒకేసారి ఈ స్థాయి రేటు పెంపు ఇదే తొలిసారి. ఈ ఏడాది మూడవ రేటు పెంపు నిర్ణయమిది. 19 దేశాల యూరోజోన్ ఆర్థిక వ్యవస్థపై పొంచి ఉన్న మాంద్యం ముప్పు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. అమెరికాసహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం స్పీడ్ కట్టడికి వడ్డీరేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. యూరోజోన్‌లో 2% లక్ష్యానికి మించి, ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.9%కి ఎగసింది.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీ ఏది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP