Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 5th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 5th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu July 5th 2022
Current Affairs in Telugu July 5th 2022

State Startup –2021 ర్యాంకులు - తెలంగాణ టాప్ 

వర్ధమాన పారిశ్రామికవేత్తల కోసం స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో అత్యున్నత పనితీరు (టాప్‌ పెర్ఫార్మర్‌) కనబరిచిన జాబితాలో తెలంగాణ నిలిచింది. విహబ్‌ ద్వారా స్టార్టప్‌లలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందంటూ కేంద్రం నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. స్టార్టప్‌లలోని ఏడు సంస్కరణల విభాగంలో అత్యధిక స్కోరింగ్‌ సాధించిన నాయకత్వ రాష్ట్రాల్లోనూ తెలంగాణ సత్తా చాటింది. ఇన్‌స్టిట్యూషనల్‌ చాంపియన్, ఇన్నోవేటివ్‌ లీడర్, ఇంక్యుబేషన్‌ హబ్, కెపాసిటీ బిల్డింగ్‌ పయనీర్‌ విభాగాల్లో తెలంగాణ లీడర్‌గా నిలిచింది. జూలై 4న ఢిల్లీలో డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) నిర్వహించిన సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకింగ్‌–2021 నివేదికను విడుదల చేశారు. ఆయా రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, అత్యుత్తమ రాష్ట్రాలు, నాయకత్వం వహించే రాష్ట్రాలు, ఔత్సాహిక నాయకత్వ రాష్ట్రాలు, అభివృధ్ధి చెందుతున్న స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రాష్ట్రాలు అనే ఐదు విభాగాల కింద రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. 
 

Also read: Alluri Sitarama Raju: వైరాగ్యం నుంచి విప్లవం వైపు...

24 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యున్నత పనితీరు కనబరిచిన జాబితాలో తెలంగాణతోపాటు కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూకశ్మీర్‌  నిలిచాయి. అత్యుత్తమ పనితీరు జాబితాలో గుజరాత్, కర్ణాటకతోపాటు చిన్న రాష్ట్రాల జాబితాలో మేఘాలయ నిలిచాయి. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్  పర్యావరణ వ్యవస్థల  విభాగంలో ఆంధ్రప్రదేశ్, బిహార్, మిజోరాం, లద్దాఖ్‌ స్థానం దక్కించుకున్నాయి.

Also read: Central Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసే అధికారం ఇవ్వండి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 70,809 స్టార్టప్‌లు ఉన్నాయని, వీటిని ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు . ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌గా భారత్‌ అవతరించిందన్నారు. 


Hotels and Restaurantsలో సర్వీస్‌ చార్జీలపై నిషేధం

హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జీల వడ్డింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇకపై సర్వీస్‌ చార్జీలను విధించడాన్ని, బిల్లుల్లో ఆటోమేటిక్‌గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. సర్వీస్‌ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ  జూలై 4న ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

Also read: NITI Aayog report: ఇండియాస్‌ బూమింగ్‌ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌

‘సర్వీస్‌ చార్జీ అనేది స్వచ్ఛందమేనని కస్టమర్లకు చెప్పకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లు దాన్ని బిల్లులో ఆటోమేటిక్‌గా చేరుస్తున్నాయని ఫిర్యాదులు మా దృష్టికొచ్చాయి. మెనూ లో చూపే ఆహార ఉత్పత్తుల ధరలు, వాటికి వర్తించే పన్నులకు అదనంగా ఏదో ఒక ఫీజు లేదా చార్జీ ముసుగులో అవి దీన్ని విధిస్తున్నాయి. ఏ హోటలూ లేదా రెస్టారెంటూ బిల్లులో సర్వీస్‌ చార్జీని ఆటోమేటిక్‌గా చేర్చకూడదు. దాన్ని చెల్లించాలంటూ కస్టమరును బలవంతపెట్టకూడదు. ఇది స్వచ్ఛందమైనది, ఐచ్ఛికమైనది మాత్రమేనని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలి’ అని పేర్కొంది. 

Also read: PSEB 10th Result 2022: How to check?

అలాగే, సర్వీస్‌ చార్జీ వసూలు ప్రాతిపదికన లోపలికి ప్రవేశం విషయంలో గానీ సేవలు అందించడంలో గానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది. ఆహారం బిల్లులో సర్వీస్‌ చార్జీని చేర్చడం, ఆ తర్వాత మొత్తంపై జీఎస్‌టీని వసూలు చేయడం వంటివి సరికాదని సీసీపీఏ స్పష్టం చేసింది. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఫుడ్‌ బిల్లు మొత్తంపై 10 శాతం సర్వీస్‌ చార్జీని వసూలు చేస్తున్న నేపథ్యంలో సీసీపీఏ మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Also read: All About Rakesh Jhunjhunwala!

ఫిర్యాదులు ఇలా..
ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏదైనా హోటల్‌ లేదా రెస్టారెంటు సర్వీస్‌ చార్జి విధించిన పక్షంలో, బిల్లు మొత్తం నుంచి దాన్ని తొలగించాలంటూ సదరు సంస్థను కస్టమరు కోరవచ్చు. అయినప్పటికీ ఫలితం లేకపోతే నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) నంబరు 1915కి లేదా ఎన్‌సీహెచ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సత్వర పరిష్కారం కోసం ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలో ఈ–దాఖిల్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారుల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే విచారణ, చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టరును కూడా ఆశ్రయించవచ్చు. సీసీపీఏకి ఈ–మెయిల్‌ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చు. 

Malleswaram Cable Bridge: మల్లేశ్వరం వద్ద నదిపై రెండంతస్తుల కేబుల్‌ బ్రిడ్జి

నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల వద్ద కృష్ణా నదిపై గాజు వంతెన ఏర్పాటు కానుంది. దానిపైనే వాహనాలు వెళ్లేందుకు వీలుగా మరో వంతెన ఏర్పాటు చేయనున్నారు. అంటే రెండంతస్తుల వంతెన అన్నమాట. ఇందుకు సంబంధించిన డిజైన్లను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదించినట్టు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌ దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలో ఈ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఇందులో పైన నాలుగు వరసల రోడ్డు, దిగువున పర్యాటకుల కోసం చుట్టూ గాజు ప్యానెల్స్‌తో కూడిన వంతెన ఉంటుంది. దాదాపు 800 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మిస్తారు. ఇందుకు దాదాపు రూ.650 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ సంవత్సరమే పనులు మొదలు కానున్నాయి. 

Also read: Indian Economy Notes for Group 1&2: ఆర్థిక సర్వే 2021–22

కొల్లాపూర్‌ మీదుగా నంద్యాలకు..
తెలంగాణ నుంచి నంద్యాల, తిరుపతిలకు వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్‌ మీదుగా కృష్ణానదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గుతుంది. అందుకే గతంలో ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి, విస్తరించాలని ప్రతిపాదించా రు. కానీ రకరకాల కారణాలతో అటకెక్కిన ఈ ప్రా జెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌– శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్‌ నుంచి కల్వ కుర్తి, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌ మీదుగా కృష్ణాతీ రంలోని మల్లేశ్వరం (సోమశిల సమీపంలోని) వర కు ప్రస్తుతం రోడ్డు ఉంది. ఇందులో కొల్లాపూర్‌ వరకు డబుల్‌ రోడ్డు ఉండగా, అక్కడి నుంచి కృష్ణా తీరం వరకు సింగిల్‌ రోడ్డే ఉంది. ఇప్పుడు కోట్రా జంక్షన్‌ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల వరకు 173.73 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ జాతీయ రహదారికి 167 కె నంబరు కేటాయించారు. ఈ రోడ్డులో భాగంగానే కృష్ణా నది మీద వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతం అద్భుత సౌందర్యానికి ఆలవాలం కావ డంతో అక్కడ నిర్మించే వంతెనను సాధారణంగా కాకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా డిజైన్‌ చేయాలని నిర్ణయించారు.  
బ్రిడ్జి పొడవు    : 800 మీటర్లు
అంతస్తులు    : 2
వ్యయం    :  రూ.650 కోట్లు 
తగ్గనున్న దూరం    : 90 కి.మీ.
హైవే నంబర్‌    : 167 కె


OSC: తెలంగాణకు మరిన్ని సఖి కేంద్రాలు 

రాష్ట్రానికి మరిన్ని సఖి(ఒన్‌ స్టాప్‌ సెంటర్‌) కేంద్రాలను మంజూరు చేయనున్నట్లు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తాయన్నారు. ‘ఎనిమిదేళ్లలో కేంద్రం సాధించిన విజయాలు– మహిళలు, పిల్లలపై ప్రభావం’అనే అంశంపై జూలై 4న హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. తెలంగాణకు 36 సఖి కేంద్రాలను మంజూరు చేయగా, ఇప్పటికే 33 కేంద్రాలు సేవలందిస్తున్నాయని తెలిపారు. హింసకు గురైన మహిళలు, బాలికలకు సఖి పథకం ద్వారా వైద్య, న్యాయ సహాయం, మానసిక సలహాలు, తాత్కాలిక ఆశ్రయం కల్పించనున్నట్లు వెల్లడించారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా అనాథలైన దాదాపు 4 వేల మంది పిల్లలకు పీఎం కేర్స్‌ పథకం కింద ఆర్థికసాయం అందించినట్లు వివరించారు. 


N95 Mask: కరోనా వైరస్‌ను ఖతం చేసే ఎన్‌95 మాస్క్‌  -  అభివృద్ధి చేసిన అమెరికా పరిశోధకులు  
n95
కోవిడ్‌–19 వ్యాప్తిని చాలావరకు తగ్గించడమే కాదు, తనతో కాంటాక్టు అయిన సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ను చంపేసే సరికొత్త ఎన్‌95 మాస్క్ ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మాస్క్‌ను ఎక్కువ కాలం ధరించవచ్చని, తరచుగా మార్చాల్సిన అవసరం లేదని, దీనితో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా తక్కువేనని పరిశోధకులు తెలియజేశారు. తనంతట తాను స్టెరిలైజ్‌ చేసుకొనే వ్యక్తిగత రక్షణ పరికరం తయారీలో ఇదొక మొదటి అడుగు అని భావిస్తున్నామని అమెరికాకు చెందిన రెన్‌సెలార్‌ పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధి ఎడ్మండ్‌ పాలెర్మో చెప్పారు. ఈ ఎన్‌95 మాస్క్ ను ధరిస్తే గాలిద్వారా వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని అన్నారు. తాజా పరిశోధన వివరాలను ఇటీవలే ‘అప్లయిడ్‌ ఏసీఎస్‌ మెటీరియల్స్, ఇంటర్‌ఫేసేస్‌’ పత్రికలో ప్రచురించారు. కరోనా వైరస్‌ను అంతం చేసే ఎన్‌95 మాస్క్‌ తయారీ కోసం యాంటీమైక్రోబియల్‌ పాలిమర్స్, పాలిప్రొపైలీన్‌ పిల్టర్లు ఉపయోగించారు. ఒకదానిపై ఒకటి పొరలుగా అమర్చారు. ఈ పరిశోధనలో ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. మాస్క్‌ పైభాగంలో వైరస్‌లను, బ్యాక్టీరియాను చంపేపే నాన్‌–లీచింగ్‌ పాలిమర్‌ కోటింగ్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం అతినీలలోహిత కాంతి, అసిటోన్‌ కూడా ఉపయోగించారు.   

Eknath Shinde: బలపరీక్ష నెగ్గిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే 

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే శాసనసభలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. శివసేన తిరుగుబాటువర్గం–బీజేపీ సర్కారుపై తన పట్టును మరింత పెంచుకున్నారు. జూలై 4న బల నిరూపణ(విశ్వాస) పరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. ప్రస్తుతం 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో షిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 164 మంది, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాదాపు 263 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పలువురు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జూలై 4న ముగిశాయి. షిండే ప్రభుత్వానికి వరుసగా రెండో రోజు రెండో విజయం దక్కింది. జూలై 3న నిర్వహించిన స్పీకర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్‌ నెగ్గారు. బలనిరూపణ కంటే ముందు ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి  పెద్ద షాక్‌ తగిలింది. ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యే సంతోష్‌ బంగార్‌ షిండే వర్గంలో చేరిపోయారు. దాంతో వారి సంఖ్యకు 40కి పెరిగింది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్‌ పవార్‌ వ్యవహరించనున్నారు.

Also read: Defence Minister Rajnath Singh introduces the 'Agnipath' scheme: రక్షణ నియామకాల్లో  అగ్నిపథ్‌

Sri Lanka crisis శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత 

శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్రోల్, డీజిల్‌ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్‌ బంకుల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పరిమితంగా అందుబాటులో ఉన్న చమురును కేవలం కొన్ని అవసరాలకే విక్రయిస్తున్నారు. ఆరోగ్య సేవలు, ఓడరేవుల కారి్మకులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రమే చమురు లభిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకకు క్రెడిట్‌పై చమురు విక్రయించేందుకు ఆయిల్‌ కంపెనీలు ఇష్టపడడం లేదు. నగదు లభించడం పెద్ద సవాలుగా మారిపోయిందని శ్రీలంక విద్యుత్, చమురు శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. ఏడు చమురు కంపెనీలకు 800 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. చమురు కొనేందుకు బ్యాంకుల ద్వారా నగదు పంపించాలని విదేశాల్లోని లంకేయులకు విజ్ఞప్తి చేశారు. చమురు కొరతతో గత నెలలో పట్టణ ప్రాంత స్కూళ్లు రెండు వారాలు మూతపడ్డాయి.

Also read: What happened in the National Herald scandal case: నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం కేసులో జరిగిందిదీ..

Elorda Boxing Cup 2022: గీతిక, అల్ఫియాలకు బాక్సింగ్ లో స్వర్ణం 

ఎలోర్డా కప్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్‌ (ప్లస్‌ 81 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. కజకిస్తాన్‌లో జూలై 4న ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు లభించాయి. 
ఫైనల్లో గీతిక 4–1తో కలైవాణి (భారత్‌)పై, అల్ఫియా 5–0తో లజత్‌ కుంగిబయెవా (కజకిస్తాన్‌)పై నెగ్గారు. గీతిక, అల్ఫియా 700 డాలర్ల (రూ. 55 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. రజతాలు నెగ్గిన కలైవాణి, జమునాలకు 400 డాలర్ల (రూ. 31 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.

Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

US Citizenship: అమెరికా పౌరసత్వాల్లో భారత్‌కు రెండో స్థానం

అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌ 15 వరకు 6,61,500 మందికి పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు.  12,928 మంది భారతీయులకి  పౌరసత్వం లభించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్‌ చేస్తున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది. 
 

Published date : 05 Jul 2022 06:49PM

Photo Stories