Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 23rd కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 23rd 2022
Current Affairs in Telugu July 23rd 2022

AP School Education : ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన - ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆధునిక బోధన విధా నాలను అనుసరిస్తూ విద్యార్థులకు అత్యు త్తమ రీతిలో అత్యు న్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.  జూలై 22న ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులు చూపించిన ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు, ప్రొజెక్టర్స్‌ పనితీరు, నాణ్యత, మోడల్స్‌ను పరిశీలించారు. వాటి వివరాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. నాణ్యమైన డిజిటల్‌ పరికరాల ఏర్పా టుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదని స్పష్టం చేశారు. స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకు, అటు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు. 

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: సశాస్త్ర సీమ బల్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?


National Film Awards 2022 : ఉత్తమ చిత్రంగా సూరారై పోట్రు 

2020 గాను 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం జూలై 22న ప్రకటించింది. ఇందులో దక్షిణాది సినిమాదే పైచేయిగా నిలిచింది. తమిళ చిత్రపరిశ్రమకు పది, మలయాళంకి తొమ్మిది, తెలుగుకి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ చిత్రం (సూరరై పోట్రు), నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్‌ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌కుమార్‌).. ఇలా మొత్తం ఐదు అవార్డులు ‘సూరరై పోట్రు’కి దక్కాయి. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్‌ దేవగన్‌ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. తెలుగులో జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్‌ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్‌ అవార్డులు దక్కాయి.  

Also read: Central Sahitya Akademi Award: సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

జాతీయ సినిమా అవార్డులు

  • ఉత్తమ చిత్రం : సూరరై పోట్రు 
  • ఉత్తమ నటులు : సూర్య (సూరరై పోట్రు) , అజయ్‌ దేవగన్‌ (తానాజీ)
  • ఉత్తమ నటి : అపర్ణ (సూరరై పోట్రు)
  • ఉత్తమ దర్శకుడు : సచ్చిదానందన్‌ (అయ్యప్పన్ కోషియమ్ ) 
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే:  షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం)
  • ఉత్తమ సంగీత దర్శకుడు : తమన్‌ ( అల వైకుంఠపురములో)
  • ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం : కలర్‌ ఫొటో 
  • ఉత్తమ నేపథ్య సంగీతం  : జీవీ ప్రకాశ్‌కుమార్‌( సూరరై పోట్రు)
  • ఉత్తమ కొరియోగ్రఫీ  :  సంధ్యారాజు ( నాట్యం )
  • ఉత్తమ సహాయ నటుడు :  బీజూ మీనన్‌  (అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌) 
  • ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌) 
  • ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ : అనిశ్‌ మంగేశ్‌ గోస్వామి (టక్‌టక్‌), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్‌ తెందుల్కర్‌ (సుమీ) 
  • ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌ 
  • ఉత్తమ కన్నడ చిత్రం: డోలు 
  • ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్‌ 
  • ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్‌ జూనియర్‌ 
  • ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) 
  • ఇందిరాగాందీ అవార్డు ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం డైరెక్టర్‌: మండోన్నా  అశ్వన్‌ (మండేలా తమిళ ఫిల్మ్‌) 
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌ 
  • పర్యావరణ పరిరక్షణపై ఉత్తమ చిత్రం: తలెండా (కన్నడ) 
  • బెస్ట్‌ ఫిల్మ్‌ ఆన్‌ సోషల్‌ ఇష్యూ: ఫ్యూర్నల్‌ (మరాఠి) 
  • ఉత్తమ మేకప్‌ -  టీవీ రాంబాబు ( నాట్యం )
  • ఉత్తమ కాస్ట్యూమ్స్‌: నచికేత్‌ బార్వే, మహేశ్‌ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌) 
  • ఉత్తమ గీత రచన : మనోజ్‌ ముంతిషిర్‌ (సైనా – హిందీ) 
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: అనీష్‌ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్‌) 
  • ఉత్తమ సౌండ్‌ డిజైనర్‌: అనుమోల్‌ భవే (ఎమ్‌ఐ వసంతరావు – మరాఠి) 
  • ఉత్తమ ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ (శివరంజనీయుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌– తమిళం) 
  • ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్‌ జయాన్‌ (డోలు– కన్నడ) 
  • ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌ (ఫైనల్‌ మిక్స్‌): విష్ణు గోవింద్, శ్రీశంకర్‌ (మాలిక్‌ –మలయాళం) 
  • ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్వన్‌ (మండేలా– తమిళం) 
  • ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ –మలయాళం) 
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్‌ దేశ్‌ పాండే (మీ వసంతరావు– మరాఠి) 
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్‌ భోల్‌ (అవిజాత్రిక్‌– బెంగాలీ)
  • మోస్ట్‌ ఫ్రెండ్లీ ఫిల్మ్‌ స్టేట్‌ - మధ్యప్రదేశ్ 
  • ది బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా : ‘ద లాంగెస్ట్‌ కిస్‌’

Also read: Chukka Ramaiahకు జీవిత సాఫల్య పురస్కారం

సేమ్‌ సీన్‌! 
67వ జాతీయ అవార్డుల్లోని సీన్‌ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్‌ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్‌ (‘అసురన్‌’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (భోన్‌స్లే)లు షేర్‌ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్‌ దేవగన్‌ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ చిత్రానికిగాను..) బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును షేర్‌ చేసుకున్నారు. ఇక కెరీర్‌లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్‌ దేవగన్‌కు  మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్‌’ (1998), ‘ది లెజండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్‌ దేవగన్‌ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.  

Also read: NITI Aayog's: భారత ఆవిష్కరణల సూచీ– 2021

దివంగత దర్శకుడికి అవార్డు
మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కిగాను దర్శకుడు కేఆర్‌ సచ్చిదానందన్‌ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రయూనిట్‌కు ఓ లోటు ఉండిపోయింది.  ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్‌ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి. 

also read: Oscars Winners 2022: 94వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా

ఓటీటీ చిత్రాల హవా! 
68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్‌ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ  స్ట్రీమింగ్‌కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి.

Also read: Oscar Award Winners 2022: ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే.. భార‌త్‌కు..

తొమ్మిదో అవార్డు 
కెరీర్‌లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్‌ ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌’కిగాను ఎడిటింగ్‌ విభాగంలో శ్రీకర్‌ ప్రసాద్‌కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్‌’ (1989), ‘రాగ్‌ బైరాగ్‌’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్‌’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్‌’ (2002), ‘ఫిరాక్‌’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్‌’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్‌ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు.

Also read: Padma Awards 2022: పద్మ పురస్కారాల ప్రదానం

Driverless Robo Taxi ఆవిష్కరించిన చైనా 

చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ ‘అపోలో ఆర్‌టీ6’ పేరుతో సెల్ఫ్‌–డ్రైవింగ్‌ ట్యాక్సీని  ఆవిష్కరించింది. ఇది ‘అపోలో గో’ యాప్‌ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీ తయారీకి అయిన ఖర్చు రూ.29,54,635 (37 వేల డాలర్లు). ఇందులో స్టీరింగ్‌ చక్రం ఉండదు. అంటే వాహనం మరింత విశాలంగా మారుతుంది. ప్రయాణికులకు అదనపు స్థలం లభిస్తుంది. డ్రైవింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి వాహనాన్ని ఎలా నడిపిస్తోడో అదే తరహాలో ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ నడుస్తుందని బైడూ వెల్లడించింది. ఇందులో 38 రకాల సెన్సార్లు ఉంటాయి. యాప్‌ నుంచి అందే ఆదేశాల మేరకు నడుచుకుంటుంది. 2023 నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ చెబుతోంది.

also read: E-bandage: గాయాలను మాన్పే ఈ–బ్యాండేజ్‌ల అభివృద్ధి

‘అపోలో ఆర్‌టీ6’లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. డోర్లను చేత్తో తెరవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్‌ కనెక్షన్‌ లేదా యాప్‌ ద్వారా తెరవొచ్చు. చుట్టుపక్కల పరిసరాలను అనుక్షణం గమనించడానికి సెల్ఫ్‌–డ్రైవింగ్‌ కార్లలో 2డీ కెమెరాలు, డెప్త్‌–సెన్సింగ్‌ లైట్‌ డిటెక్షన్, రేంజింగ్‌(లిడార్‌) యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఎదురుగా వచ్చే మనుషులు, సిగ్నళ్లు, ప్రమాదాలను కచ్చితంగా గుర్తించడానికి కృత్రిమ మేధ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో సాధారణ ట్యాక్సీ ధరలో సగం ధరకే రోబో ట్యాక్సీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బైడూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్‌ లీ చెప్పారు. 2025 నాటికి 65 నగరాల్లో, 2030 నాటికి 100 నగరాల్లో రోబో ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని బైడూ యోచిస్తోంది. 

Also read: Submarine Sindhu Dhwaj : విధుల నుంచి వీడ్కోలు

Srilanka New PM : దినేశ్ గుణవర్దనే నియామకం 

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సన్నిహితుడు దినేశ్‌ గుణవర్ధనే దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు. మరో 17 మంది మంత్రులను కూడా జూలై 22న అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే నియమించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకారం చేసింది. రాజకీయ అస్థిరతకు ముగింపు పలకడం, తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయటమే లక్ష్యంగా నియమించిన ఈ మంత్రివర్గంలో గత కేబినెట్‌లో ఆర్థిక శాఖను నిర్వహించిన అలీ సబ్రీకి విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రధాని గుణవర్ధనే అదనంగా ప్రభుత్వ పాలన, హోం వ్యవహారాలు, ప్రొవిన్షియల్‌ కౌన్సిళ్లు, స్థానిక సంస్థల బాధ్యతలను చూసుకుంటారు. మిగతా శాఖలను గత కేబినెట్‌లోని మంత్రులకే యథాతథంగా కేటాయించారు.  గుణవర్ధనే గతంలో విదేశాంగ, విద్య, హోం శాఖలను నిర్వహించారు.  

Also read: Italy's PM: ఇటలీ ప్రధాని మారియో రాజీనామా

Right to Abortion : సుప్రీంకోర్టు చారిత్రాక తీర్పు

కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉన్న 20 వారాల అబార్షన్‌ను 24 వారాలకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 20 వారాల గర్భవిచ్చత్తి అంటే శిశువును చంపేయడమేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవివాహిత అనే కారణం చూపుతూ పిటిషనర్‌ వినతిని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లైంగిక హింస వంటి కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్‌ చేయించుకునేందుకు ప్రస్తుతం చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. గర్భం దాల్చిన అనంతరం అందుకు కారకుడైన వ్యక్తితో సంబంధాల్లో మార్పు వచ్చినందున అబార్షన్‌కు అనుమతివ్వాలంటూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ దాఖలు చేసింది. పెళ్లవకుండానే గర్భం దాల్చిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ కొట్టివేశారు. అవివాహిత అయి, సమ్మతితోనే గర్భం దాల్చిందని, 20 వారాల పిండాన్ని తీసేయడమంటే శిశువును చంపేయడమేనని ఆయన అన్నారు. ‘‘ఒక మంచి ఆస్పత్రిలో చేరి, బిడ్డను కని వదిలేసి వెళ్లిపోవచ్చు. దత్తత తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా ప్రభుత్వం/ ఆస్పత్రి చూసుకుంటాయి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే నేనే భరిస్తా’అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం..హైకోర్టు తీర్పు మెడికల్‌ టెరి్మనేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌–1971కు విరుద్ధమని పేర్కొంది. 

Also read: Cancer: కేన్సర్‌ కణుతులను మాత్రమే చంపేసే థెరపీ

Forex Reserves : 573 బిలియన్‌ డాలర్లకు చేరిక 

భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు ఏ వారానికావారం భారీగా తగ్గుతున్నాయి. జూలై 8తో 8.062 బిలియన్‌ డాలర్లు తగ్గి, 580.252 బిలియన్‌ డాలర్లకు పడిపోయిన భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూలై 15వ తేదీతో ముగిసిన వారంలో మరో 7.541 బిలియన్‌ డాలర్లు తగ్గి 572.712 బిలియన్‌ డాలర్లకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలను వెల్లడించింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో అవసరాలకు సంబంధించి డాలర్ల లభ్యత తగిన విధంగా ఉండేలా చూడ్డం, ఎగుమతులకన్నా, దిగుమతులు పెరుగుదల వంటి అంశాలు ఫారెక్స్‌ నిల్వల తగ్గుదలకు కారణం అవుతోంది.  2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్‌ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. 

Also read: India's Growth Rate: భారత వృద్ధి అంచనాలకు ఏడీబీ, ఫిక్కీ కోత

అన్ని విభాగాల్లోనూ తగ్గుదలే... 
డాలర్‌ రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ సమీక్షా వారంలో 6.527 బిలియన్‌ డాలర్లు తగ్గి 511.562 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
పసిడి నిల్వలు 830 మిలియన్‌ డాలర్లు తగ్గి, 38.356 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి. 
ఐఎంఎఫ్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 155 మిలియన్‌ డాలర్ల తగ్గి 17.857 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల స్థాయి కూడా 29 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.937 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.  

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: RBI ప్రకారం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే బ్యాంక్ నోట్ ఏది?

గవర్నర్‌ భరోసా 
జూలై 22న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. దిగుమతులు,  రుణ సేవల అవసరాలు, పోర్ట్‌ఫోలియో అవుట్‌ఫ్లోల కారణంగా డిమాండ్‌కు సంబంధించి ఫారెక్స్‌ మార్కెట్‌లో విదేశీ మారకపు సరఫరాలకు సంబంధించి వాస్తవంగా కొరత ఉందని అన్నారు. తగినంత విదేశీ మారక ద్రవ్య లభ్యత ఉండేలా సెంట్రల్‌ బ్యాంకు మార్కెట్‌కు అమెరికా డాలర్లను సరఫరా చేస్తోందని చెప్పారు. ‘‘మూలధన ప్రవాహం బలంగా ఉన్నప్పుడు మనం ఫారెక్స్‌ నిల్వలను భారీగా కూడబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాం. వర్షం పడుతున్నప్పుడు ఉపయోగించేందుకు మీరు గొడుగును కొనుగోలు చేస్తారు’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.   

Also read: Weekly Current Affairs (National) Bitbank: దేశంలో అత్యధికంగా బంగారం నిల్వలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
 

RBI on Rupee : రూపాయే బలంగా నిలబడిందన్న శక్తికాంతదాస్ 

వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. డాలర్‌తో రూపాయి 80కు పడిపోవడం, రానున్న రోజుల్లో ఇంకొంత క్షీణించొచ్చంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏర్పాటు చేసినఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. రూపాయిలో అస్థిరతలు, ఎత్తు పల్లాలను ఆర్‌బీఐ చూస్తూ కూర్చోదని స్పష్టం చేశారు. సెంట్రల్‌ బ్యాంకు చర్యల వల్లే రూపాయి ప్రయాణం సాఫీగా ఉందన్నారు. రూపాయి ఈ స్థాయిలో ఉండాలనే ఎటువంటి లక్ష్యాన్ని ఆర్‌బీఐ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. మార్కెట్‌కు యూఎస్‌ డాలర్లను సరఫరా చేస్తూ తగినంత లిక్విడిటీ ఉండేలా చూస్తున్నట్టు చెప్పారు. విదేశీ రుణాలకు సంబంధించి హెడ్జింగ్‌ చేయకపోవడంపై ఎటువంటి హెచ్చరికలు అవసరం లేదన్నారు. విదేశీ రుణాల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ప్రభుత్వరంగ సంస్థలకే ఉందని చెబుతూ.. అవసరమైతే ప్రభుత్వం సాయంగా నిలుస్తుందన్నారు. 2016లో ద్రవ్యోల్బణం నియంత్రణకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ మంచి ఫలితాలను ఇచ్చిందంటూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ రంగ ప్రయోజనాల రీత్యా దీన్నే కొనసాగిస్తామని శక్తికాంతదాస్‌ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి పరిమితం చేయాలన్నది ఈ కార్యాచరణలో భాగం. ప్రతికూల సమయాల్లో దీనిని ప్లస్‌2, మైనస్‌2 దాటిపోకుండా చూడడం లక్ష్యం.   

also read: భారత్‌ GDPని 7.3 శాతానికి తగ్గించిన Morgan Stanley

ఆర్థిక వ్యవస్థ సాఫీగా.. 
‘‘నిర్ణీత కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ కుదురుకునేలా చూడాలన్నదే మా ప్రయత్నం. అదే సమయంలో వృద్ధిపై పరిమిత ప్రభావం ఉండేలా చూస్తాం’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ భరోసా ఇచ్చారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్టాలను తాకిందంటూ, ఆగస్ట్‌లో జరిగే ఎంపీసీ భేటీలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 6.7 శాతం ద్రవ్యోల్బణం అంచనాలను సమీక్షిస్తామని చెప్పారు. యూరోప్‌లో (ఉక్రెయిన్‌పై) యుద్ధం కారణంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు.  కమోడిటీ ధరలు, చమురు ధరలు పెరిగిపోయాయని.. వీటి ప్రభావం మనపై పడిందని వివరించారు. "అదే సమయంలో ఇతర సెంట్రల్‌ బ్యాంకులు మానిటరీ పాలసీని కఠినతరం చేయడం వల్ల ఆ ప్రభావాలు మననూ తాకాయి. పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం, కరెన్సీ విలువ క్షీణత ఇవన్నీ ఆర్‌బీఐ నియంత్రణలో లేనివి. లిక్విడిటీ, పాలసీ రేట్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, వాటి ప్రభావం వృద్ధిపై, ఆర్థిక వ్యవస్థ రివకరీపై ఏ మేరకు ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకునే చేస్తాం’’అని శక్తికాంతదాస్‌ వివరించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ ముందున్న ప్రాధాన్యం ద్రవ్యల్బణాన్ని నియంత్రించడం, తర్వాత వృద్ధికి మద్దతుగా నిలవడమేనని చెప్పారు 

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App
Published date : 23 Jul 2022 06:07PM

Photo Stories