Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 19th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 19th 2022
Current Affairs in Telugu July 19th 2022

AP Rajya Sabha సభ్యుల ప్రమాణస్వీకారం

రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్‌ అయిన పలువురు జూలై 18న ప్రమాణస్వీకారం చేశారు. వారితో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్య సభకు ఎన్నికైన వి.విజయసాయిరెడ్డి తెలుగులో, బీద మస్తానరావు ఇంగ్లిషులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. వీరితోపాటు రాజ్య సభకు రాష్ట్రపతి నామినేట్‌ చేసిన తెలుగు సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 18th కరెంట్‌ అఫైర్స్‌

పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 16th కరెంట్‌ అఫైర్స్‌

August 15న హర్‌ ఘర్‌ తిరంగా 


‘హర్‌ ఘర్‌ తిరంగా’ను విజయవంతంగా అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జూలై 18న లోక్ సభకు  తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలి త ప్రాంతాల్లో ఆగస్టు 15న అన్ని నివాసాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీఆర్‌ఎస్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.  

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

Presidential polls: రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం ఓటింగ్‌ 

దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న పోలింగ్ జరిగింది. నామినేటెడ్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు మినహా ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు రాష్ట్రాల అసెంబ్లీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 31 కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు హౌస్‌లోని 63వ నంబరు గదిలో ఉదయం పోలింగ్‌ మొదలవగానే ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, పార్టీ నేత రాహుల్‌గాంధీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99 శాతం ఓటింగ్‌ నమోదైనట్టు రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. 727 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటు హౌస్‌లో ఓటింగ్‌కు అనుమతి ఉండగా 8 మంది ఎంపీలు ఓటేయలేదని వివరించారు.

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 18th కరెంట్‌ అఫైర్స్‌

776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 4,809 మందికి గాను 4,786 మంది ఓటేశారు. అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఇప్పటికే 60 శాతానికి పైగా మద్దతు సమకూరిన నేపథ్యంలో ఆమె గెలుపు లాంఛనమే కానుంది. విపక్షాల తరఫున సీనియర్‌ నాయకుడు యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే.  

also read: Weekly Current Affairs (International) Bitbank: మంకీపాక్స్ క్వారంటైన్‌ను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది

పీపీఈ కిట్‌లో నిర్మల ఓటు 
కరోనాతో బాధపడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తిస్థాయి పీపీఈ కిట్‌ ధరించి ఓటేశారు. ఇండొనేసియాలోని బాలిలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల భేటీలో పాల్గొన్న సందర్భంగా ఆమె కరోనా బారిన పడ్డట్టు అధికారులు చెప్పారు. మరో కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ కూడా పీపీఈ కిట్‌ ధరించి వచ్చి ఓటేశారు.  

Sri Lankaలో మరోసారి ఎమర్జెన్సీ 

శ్రీలంకలో మరోసారి దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధిస్తూ తాత్కాలిక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె (73) జూలై 18న నిర్ణయం తీసుకున్నారు. పాలక శ్రీలంక పీపుల్స్‌ పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ)కి ఆయన తొత్తుగా మారారంటూ జనాల్లో ఆగ్రహావేశాలు రాజుకుంటున్నాయి. తాజా మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాదిరిగానే రణిల్‌ కూడా తప్పుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు నానాటికీ ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రణిల్‌ ఈ చర్యకు దిగారు. దాంతో 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరిగే వేళ రణిల్‌కు విశేషాధికారాలు దఖలు పడ్డాయి. ఇది అప్రజాస్వామికమైన క్రూర చర్య అంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ‘‘గొటబయకు, రణిల్‌కు తేడా లేదు. ఆయన రణిల్‌ ‘రాజపక్స’ విక్రమసింఘె మాదిరిగా వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డాయి. బార్‌ అసోసియేషన్‌ కూడా ఎమర్జెన్సీని తీవ్రంగా తప్పుబట్టింది. తక్షణం ఎత్తేయాలని డిమాండ్‌ చేసింది. అధ్యక్ష రేసులో రణిల్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. పాలక ఎస్‌ఎల్‌పీపీ కూడా ఆయనకు మద్దతు ప్రకటించడం జనాల్లో ఆయన పట్ల వ్యతిరేకతను మరింతగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో వారి ఆగ్రహావేశాలను తగ్గించే దిశగా పలు చర్యలకు రణిల్‌ తెర తీశారు. ‘‘21వ తేదీ నుంచి పౌరులకు పెట్రోల్‌ పంపిణీ పునఃప్రారంభమవుతుంది. పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా తగ్గిస్తున్నాం. రెండుకరాల కంటే తక్కువున్న రైతుల రుణాలను రద్దు చేస్తున్నాం’’ అని చెప్పారు.

Also read: UBS CEOగా భారత–అమెరికన్‌ నౌరీన్‌(Naureen Hassan)

సింగపూర్లోనూ ‘గో గొటా గో’... 
మాల్దీవుల నుంచి సింగపూర్‌ వెళ్లిన గొటబయకు అక్కడా నిరసనల సెగ తప్పడం లేదు. సింగపూర్‌ పౌరులు గొటబయకు వ్యతిరేకంగా మౌన ప్రదర్శనలు చేశారు. ఆయనకు సింగపూర్‌ ఆశ్రయమివ్వడం పట్ల శ్రీలంక పౌరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్‌ ప్రభుత్వ ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ నిరసనలు తెలిపారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 18th కరెంట్‌ అఫైర్స్‌

2022 World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో షెల్లీకి 5వ స్వర్ణం 

అమెరికాలోని యుజీన్‌ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో 35 ఏళ్ల జమైకా మేటి అథ్లెట్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌ నిరూపించింది. మహిళల 100 మీటర్ల విభాగంలో షెల్లీ రికార్డుస్థాయిలో ఐదోసారి పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఒకే ఈవెంట్‌లో ఐదు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా షెల్లీ కొత్త చరిత్ర లిఖించింది. జూలై 18న జరిగిన మహిళల 100 మీటర్ల ఫైనల్లో షెల్లీ 10.67 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి జగజ్జేతగా నిలిచింది. జమైకాకే చెందిన షెరికా జాక్సన్‌ (10.73 సెకన్లు) రజతం, ఎలైని థాంప్సన్‌ హెరా (10.81 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. దాంతో ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో తొలిసారి మహిళల 100 మీటర్ల విభాగంలో ఒకే దేశానికి చెందిన ముగ్గురు అథ్లెట్స్‌ ఖాతాలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు చేరాయి. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలోనూ జమైకా క్లీన్‌స్వీప్‌ చేసింది. ‘టోక్యో’లో షెరికా స్వర్ణం, షెల్లీ రజతం, ఎలైని థాంప్సన్‌ కాంస్యం సాధించారు. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: రెడ్ బుల్‌లో స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌ను ఎవరు గెలుచుకున్నారు?

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 100 మీటర్ల విభాగంలో 2009 (బెర్లిన్‌), 2013 (మాస్కో), 2015 (బీజింగ్‌), 2019 (దోహా) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ షెల్లీకి పసిడి పతకాలు లభించాయి.  ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో అత్యధిక పతకాలు నెగ్గిన అథ్లెట్స్‌ జాబితాలో షెల్లీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అలీసన్‌ ఫెలిక్స్‌ (అమెరికా; 19 పతకాలు), మెర్లీన్‌ ఒట్టి (జమైకా; 14 పతకాలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Also read: International Shooting Federation: ఐశ్వరి ప్రతాప్‌కు స్వర్ణం

IDF Masters Chessలో  రన్నరప్‌ గా హర్ష భరతకోటి 


పారిస్‌ ఐడీఎఫ్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హర్ష, ఆండ్రీ షెచకచెవ్‌ (ఫ్రాన్స్‌) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా షెచకచెవ్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కగా... హర్షకు రెండో స్థానం ఖరారైంది. ఈ టోర్నీలో హర్ష నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. రన్నరప్‌ హర్షకు 1,200 యూరోలు (రూ. 97 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 18th కరెంట్‌ అఫైర్స్‌

World Cup Shooting Tournament: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ - స్కిట్ లో  భారత్‌కు తొలి స్వర్ణం 
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ చరిత్రలో పురుషుల స్కీట్‌ విభాగంలో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించాడు. దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ లో జరుగుతున్న టోర్నీలో జూలై 18న జరిగిన పురుషుల స్కీట్‌ ఈవెంట్‌ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల మేరాజ్‌ 40 పాయింట్లకుగాను 37 పాయింట్లు స్కోరు చేశాడు. నలుగురు పాల్గొన్న ఫైనల్లో ‘డబుల్‌ ఒలింపియన్‌’ మేరాజ్‌ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. మిన్సు కిమ్‌ (కొరియా; 36 పాయింట్లు) రజతం, బెన్‌ లెలెవెలిన్‌ (బ్రిటన్‌; 26 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. 35 మంది షూటర్ల మధ్య రెండు రోజులపాటు జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మేరాజ్‌ 119 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించాడు. నలుగురు షూటర్ల మధ్య జరిగిన రెండో ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో మేరాజ్‌ 27 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2016 రియో డి జనీరో ప్రపంచకప్‌ టోరీ్నలో మేరాజ్‌ రజత పతకం సాధించాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో అంజుమ్‌ మౌద్గిల్, ఆశీ చౌక్సీ, సిఫ్ట్‌కౌర్‌ సామ్రాలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్‌ 16–6తో ఆ్రస్టేలియాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

Ben Stokes: వన్డే క్రికెట్ కు బెన్‌ స్టోక్స్‌ గుడ్‌బై

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడైన ఇంగ్లండ్‌ స్టార్‌ బెన్‌ స్టోక్స్‌ మున్ముందు రెండు ఫార్మాట్‌లకే పరిమితం కానున్నాడు. వన్డేల నుంచి తాను రిటైర్‌ అవుతున్నట్లు స్టోక్స్‌ ప్రకటించాడు. జూలై 18న ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి వన్డే స్టోక్స్‌కు చివరిది కానుంది. టెస్టు క్రికెట్‌కు తన ప్రాధాన్యత అని, టి20ల్లో కూడా ఆడతానని స్టోక్స్‌ వెల్లడించాడు. 

Also read: IDF Masters Chessలో రన్నరప్‌ గా హర్ష భరతకోటి

104 వన్డేల్లో 39.44 సగటుతో 2,919 పరుగులు చేసిన స్టోక్స్‌ 3 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు సాధించాడు. 41.79 సగటుతో 74 వికెట్లు కూడా పడగొట్టాడు. స్టోక్స్‌ కెరీర్‌లో అత్యుత్తమ క్షణం 2019 వన్డే వరల్డ్‌కప్‌ గెలవడం. ఈ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అయిన స్టోక్స్‌ 98 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు ‘సూపర్‌ ఓవర్‌’లో 3 బంతుల్లో 8  పరుగులు సాధించాడు. 

Also read: 2022 World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో షెల్లీకి 5వ స్వర్ణం

FIH అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా 

గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్‌ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతో పాటు ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్‌ అడ్మినిస్ట్రేటర్ నరీందర్‌ బత్రా కథ ముగిసింది. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడిగా 2016లో తొలిసారి ఎంపికైన బత్రా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో సాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. జూలై 18న కూడా బత్రా ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించినా... కోర్టులో సవాల్‌ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా నియమించుకొని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు ఐఓఏ అధ్యక్షుడైన కారణంగానే లభించిన ఐఓసీ సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది.

Also read: World Cup Shooting Tournament: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ - స్కిట్ లో భారత్‌కు తొలి స్వర్ణం

GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి

జీఎస్టీ కౌన్సిల్‌ సిఫారసు మేరకు జీఎస్టీలో సంస్కరణల ఫలితంగా మొదటి త్రైమాసికంలో జీఎస్టీ ఆదాయం పుంజుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు 37% పెరిగి రూ.1.51 లక్షల కోట్లకు చేరుకున్నాయని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేతలు అడిగిన ప్రశ్నలకు జూలై 18న  కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జీఎస్టీ పరిహారం చెల్లింపును ఐదేళ్లకు మించి పొడిగించాలని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు కోరాయని తెలిపారు.  

Also read: FIH అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా

Cryptos: క్రిప్టోలను నిషేధించే యోచనలో రిజర్వ్ బ్యాంక్ 

దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య.. ఆర్థిక విధానాల స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీసే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాలు వెల్లడించారు. ‘దేశ ద్రవ్య, ఆర్థిక విధానాలను అస్థిరపర్చే అవకాశమున్నందున క్రిప్టోలపై చట్టాలను రూపొందించాలని ఆర్‌బీఐ సూచించింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నది ఆర్‌బీఐ అభిప్రాయం‘ అని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు.  ఏ కరెన్సీనైనా కేంద్రీయ బ్యాంకులు లేదా ప్రభుత్వాలే జారీ చేయాల్సి ఉంటుందని.. క్రిప్టోలు ఆ కోవకు చెందవు కాబట్టి వాటిని కరెన్సీగా పరిగణింపజాలమని ఆర్‌బీఐ పేర్కొంది. అధికారిక కరెన్సీల విలువకు ఒక చట్టబద్ధత ఉంటుందని, కానీ క్రిప్టోలన్నీ కూడా స్పెక్యులేషన్‌పైనే పనిచేస్తాయి కాబట్టి దేశ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. క్రిప్టోకరెన్సీలకు సరిహద్దులేమీ లేకపోవడంతో వీటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అప్పుడు మాత్రమే క్రిప్టోలపై నిషేధం సమర్థంగా అమలు కాగలదని పేర్కొన్నారు.

Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి

Spectrum వేలం కోసం రూ. 21,800 కోట్ల బయానా

త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు రూ. 21,800 కోట్లు బయానాగా (ఈఎండీ) చెల్లించాయి. వీటిలో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ అత్యధికంగా రూ. 14,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ. 100 కోట్లు డిపాజిట్‌ చేశాయి. టెలికం శాఖ పోర్టల్‌లో పొందుపర్చిన ప్రీ–క్వాలిఫైడ్‌ బిడ్డర్ల జాబితా ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం మీద 2021లో మూడు సంస్థలు బరిలో ఉన్నప్పుడు వచ్చిన రూ. 13,475 కోట్లతో పోలిస్తే తాజాగా మరింత ఎక్కువగా రావడం గమనార్హం. బిడ్డింగ్‌కు సంబంధించి డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని బట్టి జియోకి అత్యధికంగా 1,59,830 అర్హత పాయింట్లు, ఎయిర్‌టెల్‌కు 66,330, వొడాఫోన్‌కు 29,370, అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు 1,650 పాయింట్లు కేటాయించారు. జులై 26న ప్రారంభమయ్యే వేలంలో వివిధ ఫ్రీక్వెన్సీల్లో 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను కేంద్రం విక్రయించనుంది. బేస్‌ ధర ప్రకారం దీని విలువ రూ. 4.3 లక్షల కోట్లు.  కంపెనీలు డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని బట్టి స్పెక్ట్రం కొనుగోలు చేయడంలో వాటి ఆర్థిక స్థోమత, వ్యూహాలు మొదలైన వాటిపై అంచనాకు రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.|

Also read: Cryptos: క్రిప్టోలను నిషేధించే యోచనలో రిజర్వ్ బ్యాంక్

Rupee: చరిత్రాత్మక కనిష్టాన్ని తాకిన రూపాయి 

డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనమవుతూనే ఉంది. జూలై 18న  ఇంట్రాడేలో మొదటిసారి 80ని తాకి చరిత్రాత్మక కనిష్టాన్ని చూసింది. అయితే అటు తర్వాత తేరుకుని 79.98 వద్ద ముగిసింది. నిజానికి రూపాయి జూలై 14వ తేదీ 18 పైసలు క్షీణతతో 79.99 చరిత్రాత్మక గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. అయితే జూలై 15 రోజు రోజు ట్రేడింగ్‌ లో మళ్లీ 17 పైసలు బలపడి 79.82కు ఎగసింది. ఆ ఉత్సాహం నీరుకారుతూ, మూడో ట్రేడింగ్‌ సెషన్‌ అంటే జూలై 18వ తేదీన మళ్లీ క్షీణ బాట పట్టింది. 16 పైసలు పడి 79.98 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో 80ని తాకింది.

Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
 

భారత్‌ GDPని 7.3 శాతానికి తగ్గించిన Morgan Stanley

భారత్‌ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు అమెరికన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– మోర్గాన్‌ స్టాన్లీ 40 బేసిస్‌ పాయింట్ల మేర (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ రేటు 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. 2023–24 వృద్ధి అంచనాలను సైతం 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.7 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది. ప్రపంచ వృద్ధి మందగమన ధోరణి భారత్‌ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనుందని మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇక 2022 డిసెంబర్‌తో ముగిసే సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 1.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2021లో ఈ రేటు 4.7 శాతం. కాగా  ఆర్‌బీఐ రెపోరేటు ప్రస్తుత 4.9% నుంచి 2023 ఆగస్టు నాటికి 6.5%కి చేరుతుందని మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషించింది.  

Also read: Spectrum వేలం కోసం రూ. 21,800 కోట్ల బయానా

Submarine: జలాంతర్గామి ‘సింధుధ్వజ్‌’ నిష్క్రమణ

భారత నౌకాదళంలో మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ సింధుధ్వజ్‌ సబ్‌మెరైన్‌ సేవల నుంచి నిష్క్రమించింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా సీఎన్‌ఎస్‌ రోలింగ్‌ ట్రోఫీ అందుకున్న ఏకైక సబ్‌మెరైన్‌ ఇది. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో సింధుధ్వజ్‌కు జూలై 17న సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా ఆధ్వర్యంలో డీ కమిషనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింధుధ్వజ్‌లో విధులు నిర్వర్తించిన 15 మంది మాజీ కమాండింగ్‌ అధికారులు, 26 మంది క్రూ వెటరన్స్‌కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా తయారు చేసిన సింధుఘోష్‌ క్లాస్‌ సబ్‌మెరైన్ల నిర్మాణానికి సింధుధ్వజ్‌ దిక్సూచీగా నిలిచిందని వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా కొనియాడారు. 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా దేశ రక్షణ కోసం సేవలందించటం గర్వించదగిన విషయమన్నారు. ఈ డీకమిషనింగ్‌ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు.

Also read: P17A ‘దునగిరి’ యుద్ధనౌక జాతికి అంకితం

Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App
Published date : 20 Jul 2022 01:13PM

Photo Stories