Skip to main content

భారత్ సరిహద్దుల్లో బుల్లెట్ రైలుని ప్రారంభించిన దేశం?

భారత్‌ సరిహద్దుల్లోని అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలో ఉన్న టిబెట్‌ ప్రాంతానికి డ్రాగన్‌ దేశం చైనా విద్యుత్ తో న‌డిచే బుల్లెట్‌ రైలుని ప్రారంభించింది.
Current Affairs
టిబెట్‌ రాజధాని లాసా నుంచి నింగ్‌చి ప్రాంతం వరకు పూర్తి స్థాయిలో విద్యుదీకరించిన బుల్లెట్‌ రైలు సేవల్ని జూన్‌ 25న ప్రారంభించింది. టిబెట్‌ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైలు ఇది. ఈ బుల్లెట్‌ రైలు గంటకి 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. 2014లో హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనుల్ని హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రారంభించిన చైనా ఏడేళ్లలో పూర్తి చేసింది. లాసా, నింగ్‌చి మధ్య 435.5 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ నిర్మించింది. లాసా, షానన్, నింగ్‌చి సహా తొమ్మిది స్టేషన్లలో రైలు ఆగుతుంది.

భారత్‌కు సవాళ్లు సృష్టించడానికే...
అరుణాచల్‌ ప్రదేశ్‌కు కూతవేటు దూరంలో ఉన్న నింగ్‌చి ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకమైనది. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని వాదిస్తూ వస్తున్న చైనా ఇప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి ముసుగులో భారత్‌కు పెను సవాళ్లు సృష్టించడానికే ఈ బుల్లెట్‌ రైలుని ప్రారంభించింది. వాస్తవాధీన రేఖ వెంబడి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్న చైనా ఈ బుల్లెట్‌ రైలు ప్రారంభంతో వాస్తవాధీన రేఖ వెంబడి అరుణాచల్‌ సరిహద్దుల వరకు తన సైనిక బలగాలను అత్యంత వేగంగా చేర్చే అవకాశం ఉండడం ఆందోళనకరంగా మారింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : బుల్లెట్‌ రైలు ప్రారంభం
ఎప్పుడు : జూన్‌ 25
ఎవరు : చైనా
ఎక్కడ : టిబెట్‌ రాజధాని లాసా నుంచి నింగ్‌చి ప్రాంతం వరకు
Published date : 29 Jun 2021 06:23PM

Photo Stories