Skip to main content

భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో మోదీ

రష్యాలోని వ్లాడివోస్టోక్ నగరంలో సెప్టెంబర్ 4న నిర్వహించిన ‘భారత్-రష్యా 20వ వార్షిక సదస్సు’లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజవాయువు, పెట్రోలియం, వాణిజ్యం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రం సందర్శన
భారత్-రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ఈ సదస్సు సందర్భంగా మోదీ తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధి చెంది 11 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. భారత్-యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు వ్లాడివోస్టోక్‌లోని జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు.

చెన్నై-వ్లాడివోస్టోక్ నౌకామార్గం..
ప్రధాని మోదీ-పుతిన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల ప్రతినిధి బృందాల భేటీ అనంతరం భారత్, రష్యాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ....‘తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వ్లాడివోస్టోక్ వరకూ పూర్తిస్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్-రష్యాల మధ్య రూ.79,247 కోట్లు(11 బిలియన్ డాలర్లు)గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు చేర్చాలని మోదీ-పుతిన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.

గగన్‌యాన్‌కు రష్యా సహకారం..
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇవ్వనుందని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ సన్నిహితంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
Published date : 05 Sep 2019 06:02PM

Photo Stories