Skip to main content

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?

భారత ఎన్నికల కమిషన్‌ 24వ ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌చంద్ర ఏప్రిల్‌ 13న బాధ్యతలు చేపట్టారు.
Current Affairs
ఇప్పటివరకు సీఈసీగా ఉన్న సునీల్‌ అరోరా ఏప్రిల్‌ 12న పదవీ విరమణ చేశారు. ఎలక్షన్‌ కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. 1980 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన సుశీల్‌ చంద్ర 2019, ఫిబ్రవరి 14న ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌గా 2022 మే 14వ తేదీ వరకు కొనసాగనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం
భారత రాజ్యాంగం 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులకు సంబంధించి సమగ్ర వివరణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. అందువల్ల జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. దీన్ని 2011 నుంచి పాటిస్తున్నారు. దేశ తొలి చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌గా సుకుమార్‌ సేన్‌(కాలం 1950, మార్చి 21–1958, డిసెంబర్‌ 19) పనిచేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం – బహుళ సభ్యత్వం
రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థ. 1950 జనవరి 25 నుంచి 1989 అక్టోబర్‌ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏక సభ్య సంస్థగా, అంటే చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌తో మాత్రమే పనిచేసింది. 1989లో మొట్టమొదటిసారిగా బహుళ సభ్య సంస్థగా మార్పు చేస్తూ ఇద్దరు ఇతర కమిషనర్లను నియమించారు. కానీ 1990లో తిరిగి ఏక సభ్య సంస్థగా మారింది. తిరిగి 1993లో బహుళ సభ్య సంస్థగా మారుస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేశారు. దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. 1993 నుంచి ఒక చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇద్దరు సభ్యులతో కొనసాగుతోంది.

ప్రత్యేక వివరణ: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇతర కమిషనర్లకు అధికారాలు, హోదాలు, జీతభత్యాల్లో వ్యత్యాసం లేదు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు. లేకుంటే మెజార్టీ ప్రాతిపదికపై నిర్ణయాలను అమలుచేస్తారు.

నియామకం–అర్హతలు–పదవీకాలం
చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజనల్‌ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉంటుంది. నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలేమీ లేవు. ప్రకరణ 324(5) ప్రకారం ఎలక్షన్‌ కమిషనర్ల పదవీకాలం, ఇతర సర్వీసు నిబంధనలను పార్లమెంటు చట్టం ప్రకారం నిర్ణయిస్తుంది. సాధారణంగా సీనియర్‌ బ్యూరోక్రాట్లను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమిస్తారు. వీరి పదవీ కాలం ఆరేళ్లు, పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. పదవిలో కొనసాగే కాలంలో ఈ రెండింటిలో ఏది ముందువస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రత్యేక వివరణ: ప్రస్తుతానికి రీజనల్‌ కమిషనర్ల నియామకం చేపట్టలేదు.

జీతభత్యాలు
వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి జీతాలు చెల్లిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వాటిని తగ్గించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తుల వేతనాలతో సమానంగా వీరి వేతనాలుంటాయి.

తొలగింపు
ప్రకరణ 324(5) ప్రకారం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే పార్లమెంటు తొలగిస్తుంది. కానీ, ఇతర కమిషనర్లను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు : సుశీల్‌చంద్ర
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు సీఈసీగా ఉన్న సునీల్‌ అరోరా ఏప్రిల్‌ 12న పదవీ విరమణ చేయడంతో...
Published date : 16 Apr 2021 04:16PM

Photo Stories