భారత మహిళా పైలట్ల రికార్డు
Sakshi Education
పూర్తిగా మహిళా పైలట్లతోనే ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి భారత మహిళా పైలట్లు సరికొత్త చరిత్ర లిఖించారు.
ఎయిర్ ఇండియాకి చెందిన ‘‘బోయింగ్ 777’’ విమానాన్ని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌లోని బెంగళూరు వరకు విజయవంతంగా నడిపారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన విమానం సుదీర్ఘ ప్రయాణం దాదాపు 16 గంటల తర్వాత జనవరి 11న బెంగళూరుకు చేరుకుంది. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరే, కెప్టెన్ శివానీ మన్హాస్ అనే నలుగురు పైలట్లు ఈ విమానాన్ని నడిపించారు.
విశేషాలు...
- అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం గుండా ఎక్కడా ఆగకుండా(నాన్‌స్టాప్) ప్రయాణించి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ఈ విమానం ల్యాండయింది.
- ఈ మార్గంలో ప్రయాణం ద్వారా 10 టన్నుల ఇంధనాన్ని పైలట్లు ఆదా చేశారు.
- మొత్తం 13,993 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 16 గంటల్లో అధిగమించింది.
- ఈ ఎయిర్‌ఇండియా (ఏఐ 176) విమానానికి జోయాఅగర్వాల్ ప్రధాన పైలట్‌గా వ్యవహరించారు.
Published date : 13 Jan 2021 01:04PM