Skip to main content

భారత కుబేరుల సంపద రోజుకు 2200 కోట్లు

భారత కుబేరుల సంపద 2018లో రోజుకు రూ.2,200 కోట్లు చొప్పున పెరిగిందని అంతర్జాతీయ హక్కుల సంఘం ఆక్స్‌ఫామ్ వెల్లడించింది.
ఈ మేరకు జనవరి 21న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధి చెందగా, జనాభాలో సగ భాగం సంపద 3 శాతమే పెరిగింది. అలాగే ప్రపంచ కుబేరుల సంపద 12 శాతం లేదా రోజుకు 250 కోట్ల డాలర్ల మేర ఎగసింది. ప్రపంచంలోని పేదల సంపద మాత్రం 11 శాతం క్షీణించింది.

ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదికలోని అంశాలు...
  • భారత జాతీయ సంపదలో 77.4 శాతం 10 శాతం అత్యంత ధనికుల చేతుల్లోనే ఉంది. 1 శాతం కుబేరుల చేతుల్లోనే 52 శాతం జాతీయ సంపద ఉంది.
  • జనాభాలోని 60 శాతం మంది చేతిలో కేవలం 4.8 శాతం సంపద మాత్రమే ఉంది.
  • 9 మంది అత్యంత సంపన్నుల సంపద దేశ జనాభాలోని సగం మంది సంపదతో సమానం.
  • 2022 నాటికి భారత్‌లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తారని అంచనా.
  • గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 119కు పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది 40,000 కోట్ల డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు పెరిగింది.
  • 2017లో 32,550 కోట్లుగా ఉన్న బిలియనీర్ల సంపద గత ఏడాది 44,010 కోట్ల డాలర్లకు పెరిగింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత బిలియనీర్ల సంపద ఒక్క ఏడాది ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.
  • డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ జండర్ గ్యాప్‌ఇండెక్స్‌లో భారత ర్యాంక్ 108గాఉంది. 2006తో పోల్చితే ఇది పది స్థానాలు పడిపోయింది.
  • సంపన్న భారతీయుల విషయంలో కూడా స్త్రీలు బాగానే వెనకబడి ఉన్నారు. భారత్‌లో మొత్తం 119 మంది కుబేరులుండగా, వీరిలో కేవలం 9 మంది మాత్రమే సంపన్న మహిళలు ఉన్నారు.
భారత్‌లో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నాయి. దీనిని నివారించకపోతే భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత కుబేరుల సంపద రోజుకు 2200 కోట్లు
ఎప్పుడు : జనవ 21
ఎవరు : ఆక్స్‌ఫామ్ సంస్థ
Published date : 22 Jan 2019 05:29PM

Photo Stories