Skip to main content

భారత అటవీ నివేదిక-2019 ఆవిష్కరణ

16వ భారత అటవీ నివేదిక (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు-ఐఎస్‌ఎఫ్‌ఆర్)-2019ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.
Current Affairsదేశంలో అటవీ విస్తీర్ణం.. వనరుల వినియోగంపై భారత అటవీ సర్వే (ఎఫ్‌ఎస్‌ఐ) రెండేళ్లకోసారి ఈ నివేదిక రూపొందిస్తుంది. దీని ప్రకారం గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5,188 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఆధారంగా తాజా నివేదికను రూపొందించారు.

కర్ణాటక మొదటి స్థానం, ఏపీ రెండో స్థానం...
ఐఎస్‌ఎఫ్‌ఆర్-2019 నివేదిక ప్రకారం... దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 1,025 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా.. 990 చ.కి.మీ.ల విస్తీర్ణం పెరుగుదలతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 823 చదరపు కి.మీ. విస్తీర్ణం పెరుగుదలతో కేరళ తృతీయ స్థానంలో నిలవగా.. 163 చదరపు కి.మీ. పెరుగుదలతో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఐఎస్‌ఎఫ్‌ఆర్-2019 నివేదిక ముఖ్యాంశాలు..
  • దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం 7,12,249 చదరపు కి.మీ.. అంటే దేశ భౌగోళిక ప్రాంతంలో 21.7 శాతం మేర అడవులు ఉన్నాయి. ఇక అడవుల వెలుపల ఉన్న వృక్షాలు 95,027 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇది 2.89 శాతం. రెండూ కలిపితే దేశ విస్తీర్ణంలో 24.56 శాతం మేర ఉన్నాయి.
  • ప్రస్తుత నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం 3,976 చదరపు కి.మీ. పెరగగా.. వృక్షాల విస్తీర్ణం 1,212 చ.కి.మీ. మేర పెరిగింది.
  • నమోదిత అటవీ ప్రాంతం (రిజిస్టర్డ్ ఫారెస్ట్ ఏరియా-ఆర్‌ఎఫ్‌ఏ), దట్టమైన పచ్చదనం ఉన్న ప్రాంతాల్లో 330 చదరపు కి.మీ. మేర విస్తీర్ణం తగ్గింది.
  • దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ 77,482 చ.కి.మీటర్లతో మొదటిస్థానంలో ఉంది. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • ఏపీలో ఏడాదికి 2,789 మిలియన్ టన్నుల మేర వంట చెరుకుగా కలపను వినియోగిస్తున్నారు. తలసరి వినియోగం 0.165 టన్నులుగా ఉంది. అదే తెలంగాణలో 1,969 మిలియన్ టన్నుల కలప వినియోగిస్తున్నారు. తలసరి వినియోగం 0.186 టన్నులుగా ఉంది.
  • 2017కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 7,578 చ.కి.మీ. పరిధిలో వెదురు విస్తీర్ణం ఉండగా.. ఇప్పుడు 575 చ.కి.మీ. మేర తగ్గి 7,003 చ.కి.మీ.కు చేరింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత అటవీ నివేదిక-2019 ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 31 Dec 2019 05:27PM

Photo Stories