Skip to main content

భారత్-అమెరికా మధ్య అత్యంత కీలక ఒప్పందంపై సంతకాలు

సాక్షి, న్యూఢిల్లీ : భారత్-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో కీలక ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది.
Current Affairs

సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. హైదరాబాద్ హౌస్‌లో అక్టోబర్ 27వ తేదీన జరిగిన మూడవ 2+2 మంత్రిత్వ స్ధాయి చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బెకా ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్ పొందే వెసులుబాటు కలుగుతుంది.

చారిత్రక మైలురాయి..
తూర్పు లడఖ్‌లో చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఒప్పందం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సమావేశాల్లో సమగ్ర, ఫలవంతమైన చర్చలు జరిపామని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అమెరికాతో బెకా ఒప్పందంపై సంతకాలు జరగడం చారిత్రక మైలురాయి అని అన్నారు. రక్షణ సంబంధాలపై ఉపయుక్తమైన చర్చలు జరిగాయని, సైనిక సహకారంలోనూ ఇరుదేశాల మధ్య పురోగతి సాధ్యమయ్యేలా చర్చలు సాగాయని తెలిపారు. ఇక రెండు దశాబ్ధాలుగా భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో భాగస్వామ్య విస్తరణ స్వాగతించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు.

భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా...
భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఇక కరోనా వైరస్, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ భద్రత, సుస్థిరత కోసం భారత్-అమెరికా భాగస్వామ్యం అత్యంత కీలకమని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రపంచ భద్రత, ఇతర అంశాలపై పాంపియో, ఎస్సర్‌లతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు.

Published date : 27 Oct 2020 05:50PM

Photo Stories