బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యేక హబ్
అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, బ్యాంకింగ్ సేవల పటిష్టత లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేషన్ హబ్) ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ఆగస్టు 6న గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి.
ఓడీఆర్ ఏర్పాటు...
కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణాన్ని పెంచడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకోనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రతా చర్యలే ధ్యేయంగా ఈ దిశలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఒక పైలట్ స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఓడీఆర్) ఏర్పాటు ప్రతిపాదన కూడా ఈ విభాగంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒకటి.
స్టార్టప్స్‌కు ప్రాధాన్యత..
ఇక స్టార్టప్స్ విషయానికి వస్తే, వీటికి ప్రాధాన్యతా రంగం హోదాను కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. తద్వారా ఈ తరహా యూనిట్లు తగిన రుణ సౌలభ్యతను సకాలంలో అందుకోగలుగుతాయి.
పీఎస్‌ఎల్ పరిమితి పెంపు..
ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్‌ఎల్) పరిధిలో చిన్న, సన్నకారు రైతులకు, అలాగే బలహీన వర్గాలకు కూడా రుణ పరిమితులను పెంచాలని ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్‌ఎల్) పునరుత్పాదకత ఇంధన రంగాలకు రుణ పరిమితులను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. సోలార్ పవర్, కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు:బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం కోసం