Skip to main content

బహుభాషా నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 10న బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
1938 మే 19న మహారాష్ట్రలోని మాథెరన్ (ముంబైకి సమీపంలో ఉండే హిల్‌స్టేషన్)లో జన్మించిన కర్నాడ్ బాల్యం పూణెలో కౌమారం కర్నాటకలోని ధార్వాడ్‌లో గడిచింది. మరాఠి, కన్నడ మాట్లాడే ఆయన బిఎస్సీ మేధమేటిక్స్ చదివారు. పైచదువులకు ఇంగ్లండ్ వెళ్లి అక్కడ రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, ఫిలాసఫీలో పీజీ పూర్తిచేశారు.
1962-63లో ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు.

1963-70 మధ్యకాలంలో చెన్నైలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పనిచేసిన కర్నాడ్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో నాటకరచనపై దృష్టిసారించారు. 1974-75 లో పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెరైక్టర్‌గా వ్యవహరించారు. 1987-88లో యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 1988-93 నడుమ సంగీత్ నాటక్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 2000-03లో లండన్‌లోని ఇండియన్ హైకమిషన్‌లో మినిస్టర్ ఆఫ్ కల్చర్‌గా, నెహ్రూ సెంటర్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.

రచయితగా..
తన మాతృభాష అయిన కన్నడలో రచనలు చేసిన గిరీశ్ ఎన్నో నాటకాలు, సినిమాలకు కథలు రాసి, వాటికి దర్శకత్వం వహించి, నటించారు. 1961లో ఆయన తన తొలి నాటకం.. ‘యయాతి’ రాశారు. తర్వాత తుగ్లక్, హయవదన, అంగుమల్లిగె, హిట్టిన హుంజ, నాగమండల, తేల్‌దండా, అగ్ని మట్టు మేల్, ద డ్రీమ్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్ వంటి రచనలు చేశారు. 2011లో ‘హాడాడతా ఆయుష్య’ పేరిట ఆయన తన ఆత్మకథను రచించారు.

నటుడిగా..
గిరీశ్‌కర్నాడ్ నటించిన తొలిసినిమా.. ‘సంస్కార’. 1970లో విడుదలైన ఆ సినిమా రాష్ట్రపతి స్వర్ణకమలం అందుకుంది. ఆ తర్వాత నిశాంత్, మంథన్, స్వామి సినిమాల్లో నటించారు. దర్శకుడుగా వంశవృక్ష, గోధూళి, ఉత్సవ్ వంటి చిత్రాలు తీశారు. టైగర్ జిందాహై, శివాయ్, ఆనందభైరవి, ధర్మచక్రం, శంకర్‌దాదా ఎంబీబీఎస్, కొమరం పులి వంటి చిత్రాల్లో నటించారు.

అవార్డులు...
కర్నాడ్‌ను ఎన్నో అవార్డుల వరించాయి. 1972లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, అదే ఏడాది సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ పురస్కారం, 1998లో కాళిదాస సమ్మాన్, రాజ్యోత్సవ పురస్కారాలు ఆయనకు లభించాయి. కన్నడ, హిందీ భాషల్లో ఏడు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కర్నాడ్‌కే దక్కుతుంది. పురాణాలు, చరిత్ర, వర్తమాన అంశాలను సాహిత్య వస్తువుగా ఆయన ఎంచుకునేవారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బహుభాషా నటుడు, రచయిత, సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : గిరీష్ కర్నాడ్ (81)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 11 Jun 2019 06:26PM

Photo Stories