అయోధ్య భూ వివాదంపై తుది తీర్పు
2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదంది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రంప్రభత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని సూచింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం
మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇందుకోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించింది.
షియా బోర్డు పిటిషన్‌ను కొట్టివేత
వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు లేదని తేల్చిచెప్పింది.
ఏకగ్రీవ తీర్పు
జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. అయిదుగురూ న్యాయమూర్తులు ఈ తీర్పుకు ఆమోదం తెలిపారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు జస్టిస్ గొగోయ్ స్పష్టం చేశారు.
జస్టిస్ గొగోయ్ తీర్పు వెలువరిస్తూ... ‘‘ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు. మసీదు ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది. పురావస్తుశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రస్తుత కట్టడంలోని నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని పురావస్తు శాఖ తెలిపింది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. అయితే మందిరాన్ని కూల్చివేశారన్న ఆధారాలు మాత్రం లేవని పురావస్తు శాఖ నివేదిక పేర్కొంది. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం.’ అని వ్యాఖ్యానించారు.
రామజన్మభూమిగా అయోధ్య
‘‘అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారు. రెండు మతాల ప్రజలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవారు. రాముడు అయోధ్యలోనే జన్మించారని ముస్లిం వర్గాలు కూడా అంగీకరిస్తాయి. మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది. ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించింది.’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుదీర్ఘంగా విచారణ
అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ 2010లో తీర్పును ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల 2019, ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ మొదలుపెట్టింది. ఏకబిగిన 40 రోజుల పాటు విచారణ జరిపి, అక్టోబర్ 16న తీర్పును వాయిదా వేసింది. భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన కేశవానంద భారతి కేసు విచారణ (68 రోజులు) తర్వాత అత్యంత సుదీర్ఘంగా విచారణ జరిగిన వ్యాజ్యంగా అయోధ్య కేసు రికార్డులకెక్కింది.
అయోధ్య భూ వివాదం కేసుకు సంబంధించిన మరిన్ని కథనాల కోసం క్రింది లింక్‌లపై క్లిక్ చేయండి.
www.sakshieducation.com/ListST.aspx?cid=0&search=Ayodhya%20Case
www.sakshieducation.com/ListST.aspx?cid=0&search=Ayodhya%20dispute