అస్సాంలో ‘ఎన్‌ఆర్‌సీ’ తుదిజాబితా విడుదల
Sakshi Education
గువాహటి: వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తుది జాబితా ఆగస్టు 31న విడుదలైంది. అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌ఆర్‌సీ జాబితాలో 19 లక్షల మంది చోటు దక్కించుకోలేకపోయారు.
అసోం పౌరులైన తమను ఈ జాబితాలో చేర్చాలని 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా... పలు మార్పులు, చేర్పులు, సవరణల తరువాత 3.11 కోట్ల మందికి చోటు లభించినట్లు ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కార్యాలయం ఆగస్టు 31న ఒక ప్రకటన విడుదల చేసింది. జాబితాలో చోటు దక్కనివారు 120 రోజుల్లోపు ఫారినర్స్ ట్రైబ్యునళ్లలో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపింది. ట్రిబ్యునళ్లు విదేశీయులుగా ప్రకటించేంత వరకూ జాబితాలో లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్బంధించేది లేదని అసోం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.
ఎన్నార్సీ పూర్వాపరాలివీ..
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎన్‌ఆర్‌సీతుదిజాబితా విడుదల
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎందుకు: అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు
ఎక్కడ: అస్సాం
ఎన్నార్సీ పూర్వాపరాలివీ..
- 1951: స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన తొలి జనాభా లెక్కల్లో భాగంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) తయారైంది.
- 1955: భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావాల్సిన నిబంధనలన్నీ ఇందులో పొందుపరిచారు.
- 1951 -1966: తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చిన పలువురు ఈ కాలంలో నిర్బంధంగా అసోం వదిలి వెళ్లాల్సి వచ్చింది.
- 1965: భారత పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో అసోంలోకి మళ్లీ పెరిగిన చొరబాట్లు.
- 1971: మరోసారి వెల్లువలా చొరబాట్లు.
- 1979: అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా అసోంలో ఉద్యమం మొదలు
- 1983: నైలేలీ మారణకాండ. సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్రమ వలసదారుల వ్యతిరేక చట్టానికి ఆమోదం. ట్రిబ్యునళ్ల ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలు.
- 1985: భారత ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం. మార్చి 25, 1971రి అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్ తేదీగా నిర్ణయం.
- 1997: అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో ‘డీ’అక్షరం ద్వారా గుర్తించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం.
- 2003: పౌర చట్టంలో మార్పులకు ప్రయత్నాలు మొదలు.
- 2005-1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్‌ల మధ్య త్రైపాక్షిక చర్చలు. 1951 నాటి ఎన్‌ఆర్‌సీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం.
- 2010: బార్‌పేటలోని ఛాయాగావ్‌లో ఎన్‌ఆర్‌సీ జాబితా సవరణ తాలూకూ పైలట్ ప్రాజెక్టు మొదలు.హింసాత్మక ఘటనల్లో నలుగురి మృతి. ప్రాజెక్టు నిలిపివేత.
- 2016: ఎన్‌ఆర్‌సీ సవరణకు సుప్రీంకోర్టు పిలుపు
- 2017: డిసెంబరు 31న ఎన్‌ఆర్‌సీ తొలి ముసాయిదా జాబితా విడుదల
- 2019 జూలై 31న ఎన్‌ఆర్‌సీ రెండో ముసాయిదా జాబితా విడుదల. సుమారు 41 లక్షల మందికి దక్కని చోటు
- 2019 ఆగస్టు 31. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల. జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య 19 లక్షలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎన్‌ఆర్‌సీతుదిజాబితా విడుదల
ఎప్పుడు: ఆగస్టు 31, 2019
ఎందుకు: అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు
ఎక్కడ: అస్సాం
Published date : 03 Sep 2019 06:19PM