Skip to main content

ఆర్యసభ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన ఆధ్యాత్మిక వేత్త?

ప్రముఖ సంఘ సేవకుడు, ఆధ్యాత్మిక వేత్త స్వామి అగ్నివేశ్(80) కన్నుమూశారు.
Current Affairs
కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సెన్సైస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 11న ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించిన అగ్నివేశ్ అసలు పేరు వేప శ్యామ్ రావు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు.

హరియాణా విద్యా శాఖ మంత్రిగా...
సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందిన అగ్నివేశ్ బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ సంఘ సేవకుడు, ఆధ్యాత్మిక వేత్త కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : స్వామి అగ్నివేశ్(80)
ఎక్కడ : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సెన్సైస్ ఆస్పత్రి, ఢిల్లీ
ఎందుకు : లివర్ సిర్రోసిస్ వ్యాధితో
Published date : 12 Sep 2020 05:17PM

Photo Stories