Skip to main content

ఆర్‌బీఐ కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు

ఆర్థిక మందగమనంతో అతలాకుతలం అయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తాజాగా కరోనా కాటుకు గురవుతున్న నేపథ్యంలో... పరిస్థితిని చక్కదిద్దడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది.
Current Affairsఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ మధ్య జరగాల్సిన 2020-21 మొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్షను అర్ధంతరంగా మార్చి 27కు మార్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే...

రెపో, రివర్స్ రెపో రేటు తగ్గింపు
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చింది. 2019 ఫిబ్రవరి నుంచి (చివరిసారి రెండు సార్లు మినహా) వరుసగా ఐదుసార్లు రెపో రేటును 135 బేసిస్ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గించింది.

ఇక బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆర్‌బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు రివర్స్ రెపోను ఏకంగా 90 బేసిస్ పాయింట్లు ఆర్‌బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 4.90 శాతం నుంచి 4 శాతానికి దిగివచ్చింది.

సీఆర్‌ఆర్ ఒకశాతం శాతం
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని ఆర్‌బీఐ ఏకంగా ఒకశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 4 శాతం నుంచి 3 శాతానికి దిగివచ్చింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొత్త మొత్తాన్ని తప్పనిసరిగా నగదు రూపంలో ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. దీనిపై ఆర్‌బీఐ ఎటువంటి వడ్డీ ఇవ్వదు. ఈ రేటు తగ్గింపు వల్ల బ్యాంకుల వద్ద అదనపు నిధుల లభ్యత ఉంటుంది. ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను తగ్గించడం ఏడు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.

వ్యవస్థలోకి నిధులు ఎలా..
ఆర్‌బీఐ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు రూ.3.74 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత- లిక్విడిటీ (2019-20 జీడీపీ అంచనాల్లో దాదాపు 2 శాతం) అందుబాటులోకి రానుంది. ఇందులో రెపో ఆపరేషన్ వల్ల రూ. లక్ష కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. సీఆర్‌ఆర్ ద్వారా ఫైనాన్షియల్ సిస్టమ్‌లోకి వచ్చే మొత్తం రూ.1.37 లక్షల కోట్లు.

వృద్ధి రేటు 5 శాతం
2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ రేటు 4.7 శాతంగా నమోదవుతుందని పేర్కొంది.

రుణ చెల్లింపులపై మారటోరియం
క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సహా టర్మ్ లోన్లపై (వ్యవసాయ, గృహ, విద్య, వ్యక్తిగత, వాహన) నెలవారీ చెల్లింపు(ఈఎంఐ)లకు సంబంధించి కస్టమర్లకు పెద్ద వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. ఈ రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం నిర్ణయం తీసుకోడానికి ఆర్థిక సంస్థలకు వెసులుబాటు ఇచ్చింది. మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిగా పరిగణించడానికి వీలు పడదు. మార్చి నుంచి మే మధ్య అన్ని రుణ చెల్లింపులపై మారటోరియం అమల్లో ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. మారటోరియం తర్వాత టర్మ్ లోన్లకు సంబంధించి రుణ చెల్లింపుల షెడ్యూల్ మూడు నెలలు పెరుగుతుంది.
Published date : 28 Mar 2020 06:21PM

Photo Stories