Skip to main content

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ రాజీనామా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా డాక్టర్ విరాళ్ ఆచార్య జూన్ 23న రాజీనామా చేశారు.
తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన ఉర్జిత్‌పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉన్నారు. విరాళ్ రాజీనామాతో నూతన నియామకం జరిగేంతవరకూ డిప్యూటీ గవర్నర్లుగా ముగ్గురు మాత్రమే(ఎన్‌ఎస్ విశ్వనాథన్, బీపీ కనుంగో, ఎంకే జైన్) ఉంటారని ఆర్‌బీఐ తెలిపింది. 45 సంవత్సరాల విరాళ్ ఆచార్య.. ఆర్‌బీఐలోని డిప్యూటీ గవర్నర్లందరిలోకెల్లా పిన్న వయస్కుడు.

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ విరాళ్ ఆచార్యను ఆర్‌బీఐ డిప్యూటీ గరవ్నర్‌గా 2016 డిసెంబర్‌లో నియమించింది. 2017 జనవరిలో ఆయన మూడేళ్ల తన బాధ్యతలను చేపట్టారు. అప్పట్లో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ద్రవ్యఅంశాల విభాగాన్ని ఆయన ఆర్‌బీఐలో పర్యవేక్షించారు.

పాలసీపై విభేదాలు?
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాళ్ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్షా కమిటీ (ఎంపీసీ) సభ్యునిగా కూడా ఉన్నారు. జూన్‌లో ఆర్‌బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయాలతో విరాళ్ ఆచార్య కొంత విభేదించినట్లు సంబంధిత మినిట్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటుపై ఆయన తాజా పాలసీ సమీక్షలో ఆందోళన వెలిబుచ్చారు. గడచిన ఐదు బడ్జెట్‌లలో మూడుసార్లు ద్రవ్యలోటు కట్టుతప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 2013 నుంచీ ఇటు కేంద్రం, అటు రాష్ట్రాల ద్రవ్యలోటు పరిస్థితి దిగజారుతూ వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

రాకేష్ మోహన్ తరువాత...
‘ఫారిన్ ట్రైన్డ్’ ఎకనమిస్ట్‌గా రిజర్వ్ బ్యాంక్‌లో పనిచేసి బాధ్యత కాలం పూర్తికాకుండానే తప్పుకున్న రెండో డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య. ఇంతక్రితం 2009 మే నెలలో అప్పటి డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ తన బాధ్యతలకు ముందుగానే రాజీనామా చేశారు. అప్పట్లో జూలై 23తో ఆయన పదవీకాలం పూర్తికావాల్సి ఉంది.

వివాదాల్లో...
స్వతంత్ర నిర్ణయాలు, ఆలోచనలు కలిగిన ఆర్థికవేత్తగా విరాళ్ ఆచార్య పేరుంది. ఇది ఆయనను పలు దఫాలు వివాదాల్లోకీ నెట్టింది. పలు సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా కేంద్రంపై, ఆర్థిక మంత్రిత్వశాఖపై తన నిరసన గళం వినిపించారు. ప్రత్యేకించి సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి పరిరక్షణకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృషించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా రాజీనామా
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : డాక్టర్ విరాళ్ ఆచార్య
ఎందుకు : వ్యక్తిగత కారణాల కారణంగా
Published date : 25 Jun 2019 06:15PM

Photo Stories