అణుయుద్ధమే వస్తే 12.5 కోట్ల ప్రాణ నష్టం
Sakshi Education
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఒకవేళ 2025లో అణు యుద్ధం జరిగితే మానవాళి కనివినీ ఎరగని స్థాయిలో ప్రాణ, పర్యావరణ నష్టం ఉంటుందని వెల్లడైంది.
యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్, రట్జర్స్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. ఈ అధ్యయన విశేషాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ అనే జర్నల్‌లో అక్టోబర్ 3న ప్రచురించారు. భారత్, పాక్ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్‌లో ప్రొఫెసర్ అయిన బ్రయాన్ టూన్ పేర్కొన్నారు.
అధ్యయనంలోని విషయాలు
అధ్యయనంలోని విషయాలు
- భారత్-పాక్ మధ్య అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు. అది రెండో ప్రపంచయుద్ధం జరిగిన ఆరేళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువ.
- రెండు దేశాల మధ్య అపరిష్కృత కశ్మీర్ సమస్య ఉంది. అందువల్ల యుద్ధమే వస్తే భారీ ప్రాణ నష్టం తప్పదు.
- ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుంది.
- రెండు దేశాలు భారీగా ఆయుధాలను పెంచుకుంటున్నాయి.
- ప్రస్తుతం భారత్, పాక్‌ల వద్ద సుమారు 150 చొప్పున అణ్వాయుధాలు ఉన్నాయి. అవి 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరగగలవు.
- అణ్వాయుధ ప్రయోగం వల్ల వెలువడిన 16 నుంచి 36 మిలియన్ టన్నుల సూక్ష్మ కార్బన్ అణువులు(బూడిద) కొన్ని వారాల్లోపే ప్రపంచమంతా వ్యాపిస్తాయి. ఇవి సోలార్ రేడియేషన్‌ను గ్రహించి, గాలిని మరింత వేడెక్కిస్తాయి.
- సూక్ష్మ కార్బన్ అణువుల వల్ల సూర్యరశ్మి భూమిని చేరడం 20 శాతం నుంచి 35 శాతం తగ్గుతుంది. దానివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 2 నుంచి 5 సెల్సియస్ డిగ్రీలు తగ్గుతుంది.
- ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15 శాతం నుంచి 30 శాతం తగ్గుతుంది.
Published date : 04 Oct 2019 05:38PM