అనంతపురం జిల్లాలో మూడు జలాశయాలకు శంకుస్థాపన
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి వద్ద వర్చువల్ విధానంలో డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా రాయలసీమలో దాదాపు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.
మూడు ప్రాజెక్టులు ఇవే...
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నీటి ఆధారంగా ఎగువ పెన్నా జలాశయానికి(అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు) సంబంధించిన ప్రధాన కాలువ(53.45 కి.మీ.)తోపాటు... ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి నాలుగు జలాశయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ జలాశయాల నిర్మాణ పనులకు తాజాగా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. రూ.592 కోట్ల వ్యయంతో వీటి నిర్మాణ పనులను చేపట్టారు.
డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం...
ప్రస్తుతం ఉన్న 1.81 టీఎంసీల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు అదనంగా 2.024 టీఎంసీలతో ముట్టాల, 0.992 టీఎంసీలతో తోపుదుర్తి, 0.89 టీఎంసీలతో దేవరకొండ, 1.50 టీఎంసీలతో సోమరవాండ్లపల్లి జలాశయాల్ని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఈ పథకం వల్ల రాప్తాడు నియోజకవర్గంలోని వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.