Skip to main content

అమెరికా- తాలిబన్ మధ్య శాంతి ఒప్పందం

అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకు దారులు తెరుచుకున్నాయి.
Current Affairsఅగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఫిబ్రవరి 29న ఖతార్ రాజధాని దోహాలోని ఓ హోటల్‌లో ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్‌జాద్, తాలిబన్ నేత ముల్లా బరాదర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమానికి భారత్, పాక్ సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

భారత్ నంచి కుమరన్...
అఫ్గాన్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న భారత్, మొదటిసారిగా దోహా చర్చలకు తన రాయబారి పి.కుమరన్‌ను పంపింది. శాంతి ఒప్పందం నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా కూడా అఫ్గాన్‌లో రెండు రోజులు(ఫిబ్రవరి 28,29) పర్యటించారు.

శాంతి ఒప్పందం ప్రకారం..
  • ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న 13 వేల మంది తమ సైనికులను వచ్చే 3-4 నెలల్లో 8,600కు అమెరికా తగ్గించుకోనుంది. మిగతా బలగాలను కూడా 14 నెలల్లో దఫాలుగా ఉపసంహరించు కుంటుంది. అయితే, ఒప్పందంలో అంగీకరించిన షరతులను తాలిబన్లు అమలు చేసే తీరును బట్టి మాత్రమే ఈ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.
  • తాలిబన్లు అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలపై అఫ్గాన్ కేంద్రంగా చేసుకుని ఎలాంటి దాడులకు ప్రయత్నించరాదు.
  • అఫ్గాన్ ప్రభుత్వ జైళ్లలో ఉన్న సుమారు 5 వేల మంది తాలిబన్లను విడుదల చేయాలి.
  • తాలిబన్, అఫ్గాన్ ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా దోహాలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఒప్పందంలోని అంశాల అమలుకు ఈ విభాగమే జవాబుదారీగా ఉంటుంది.

మార్చి 10న ఓస్లో చర్చలు..
2020, మార్చి 10వ తేదీ నుంచి నార్వే రాజధాని ఓస్లోలో జరిగే చర్చల్లో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్, ఇతర గ్రూపులు, మహిళా ప్రతినిధులు ముఖాముఖి పాల్గొననున్నారు. 2001 తర్వాత తాలిబన్లతో అఫ్గాన్‌లోని ఎన్నికై న ప్రభుత్వం చర్చలు జరపడం ఇదే ప్రథమం కానుంది. చర్చల్లో అమెరికా ప్రతినిధులు ఉన్నప్పటికీ అఫ్గాన్ పక్షాల మధ్య చర్చలు సాగేందుకు సాయపడటమే వారి లక్ష్యంగా ఉండనుంది.

తాలిబన్లను విడుదల చేయం: ఘనీ
అమెరికా-తాలిబన్ల శాంతి ఒప్పందంపై మార్చి 1న అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ స్పందించారు. జైళ్లలో ఉన్న తాలిబన్లను తక్షణమే విడుదల చేయడం కుదిరే పని కాదని తేల్చి చెప్పారు. ఓస్లో చర్చల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని స్పష్టం చేశారు. అఫ్గాన్ అధికార యంత్రాంగంతో చర్చలు జరగకుండా తాము తాలిబన్లను జైళ్ల నుంచి ఎందుకు విడుదల చేయాలని ప్రశ్నించారు.
Published date : 02 Mar 2020 05:47PM

Photo Stories