Skip to main content

అమెరికా దాడుల్లో ఇరాన్ జనరల్ సులేమాని మృతి

ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు.
Current Affairsబాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో జనవరి 3న సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించారు.

2018లో అమెరికా ఇరాన్‌తో అణుఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది.

ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్
విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్స్ చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడన్నారు.

ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్‌‌స బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు.

మరో యుద్ధం భరించలేం: ఐరాస
గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు.

ఎవరీ ఖాసీం సులేమాని?
1955లో ఇరాన్‌లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్ ఫోర్స్‌కి 1998 ఏడాది నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా సులేమానికి పేరుంది. విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట అయిన సులేమాన్‌ను ఇరాన్ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది. మరోవైపు ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ మృతి
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ఖాసీం సులేమాని
ఎక్కడ : బాగ్దాద్ విమానాశ్రయం, ఇరాక్
ఎందుకు : అమెరికా క్షిపణి దాడుల కారణంగా

మాదిరి ప్రశ్నలు
Published date : 04 Jan 2020 06:10PM

Photo Stories