Skip to main content

అలా అయితే...ఈ కోటా తప్పే

102వ రాజ్యాంగ సవరణ ప్రకారం, పార్లమెంటు మాత్రమే సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులకు(ఎస్ఈబీసీ) కేంద్ర జాబితాను రూపొందించాలన్న వాదనను అంగీకరిస్తే.. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Current Affairs

మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆ రాష్ట్ర శాసన పరిధిని మించినట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొంది. మరాఠాలకు ఉద్యోగాలు, విద్యలో 16% రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ హేమంత్‌గుప్తా, జస్టిస్‌ రవీంద్రభట్‌ల ధర్మాసనం మార్చి 16వ తేదీన విచారణ జరిపింది. ఈ సందర్భంగా, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ 1992లో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును పునఃపరిశీలించే అంశాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. 102వ రాజ్యాంగ సవరణ తరువాత రాష్ట్రపతి మాత్రమే ఎస్‌ఈబీసీని నిర్ధారించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ రాజ్యాంగ సవరణ తరువాతనే, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఎస్‌ఈబీసీ జాబితాలో మరాఠాలను చేర్చిందని తెలిపారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఒక ఏకరూపత సాధించాలనేదే 102వ రాజ్యాంగ సవరణ ఉద్దేశమన్నారు. ఈ సమయంలో, ధర్మాసనం కల్పించుకుని.. ‘మీ వాదనే సరైనదనుకుంటే, మహారాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం చేయకూడదు. అలా చేయడం తన శాసన పరిధిని అతిక్రమించడమే అవుతుంది’అని పేర్కొంది. 102వ రాజ్యాంగ సవరణతో వెనుకబడిన వర్గాల రాష్ట్ర కమిషన్‌లను కొనసాగించడమా? లేక వాటిని జాతీయ కమిషన్‌లో విలీనం చేయడమా? ఆ కమిషన్‌ల విధులు, బాధ్యతలు ఏమిటి? అనే అంశాలు కూడా తెరపైకి వచ్చాయన్నారు. 102వ రాజ్యాంగ సవరణ అనంతరం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గుర్తించడానికి ప్రత్యేకమైన విధానం రూపొందిందని పిటిషనర్ల తరఫు మరో సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్‌ 342 ఏ ప్రకారం గవర్నర్‌తో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి సంబంధిత నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో మరాఠాలకు రిజర్వేషన్లు పెంచే క్రమంలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ లేదని, గవర్నర్‌తో సంప్రదింపులు లేవని, జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌తో చర్చలు లేవని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనల అనంతరం, విచారణ మార్చి 17వ తేదీన కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.


క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని..
ఎప్పుడు : మార్చి 16
ఎక్కడ : మహారాష్ట్ర
Published date : 17 Mar 2021 05:07PM

Photo Stories