Skip to main content

అబార్షన్‌కు 20 నుంచి 24 వారాల వరకు గడువు పెంపు

న్యూఢిల్లీ: అబార్షన్ చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 వారాల గరిష్ట కాలపరిమితి గడువును 24 వారాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
Current Affairsఅత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జనవరి 29న జరిగిన కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన బిల్లుకి ఆమోద ముద్ర వేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971కి సవరణలు చేస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ (సవరణ) బిల్లు, 2020ని కేంద్రం రూపొందించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీనిని ఒక ప్రగతిశీల సంస్కరణగా కేంద్ర మంత్రి జవదేకర్ అభివర్ణించారు. అయితే ఇన్నాళ్లూ ఒక వైద్యుడు అంగీకరిస్తే అబార్షన్ చేసేవారని, కానీ 24 వారాలు వచ్చాక అబార్షన్ చేస్తే ఇద్దరు వైద్యులు అంగీకరించాల్సిన అవసరం ఉందని, వారిలో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యుడు అయి ఉండి తీరాలని జవదేకర్ వివరించారు.
 
క్విక్ రివ్యూ:
ఏమిటి: అబార్షన్‌కు 20 నుంచి 24 వారాల వరకు గడువు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
ఎప్పుడు: జనవరి 29, 2020
ఎందుకు:  అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తింపు.
Published date : 30 Jan 2020 06:01PM

Photo Stories