Skip to main content

700 గోల్స్ పూర్తి పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రొనాల్డో

విఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) గొప్ప ఘనత సాధించాడు. తన కెరీర్‌లో 700 గోల్స్ పూర్తి చేసుకున్నాడు.
ఈ ఘనత సాధించిన ఆరో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. యూరో-2020 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భాగంగా అక్టోబర్ 15న ఉక్రెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 72వ నిమిషంలో లభించిన పెనాల్టీని రొనాల్డో లక్ష్యానికి చేర్చి ఈ మైలురాయిని అందుకున్నాడు. 2002లో స్పోర్టింగ్ లిస్బన్ క్లబ్ తరఫున సీనియర్ స్థాయిలో కెరీర్ మొదలుపెట్టిన 34 ఏళ్ల రొనాల్డో ప్రస్తుతం ప్రొఫెషనల్ లీగ్‌‌సలో ఇటలీకి చెందిన యువెంటాస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ జట్టు సభ్యుడిగా ఉన్న రొనాల్డో తన దేశం తరఫున 95 గోల్స్ చేశాడు. మిగతా అన్ని గోల్స్ ప్రొఫెషనల్ లీగ్‌‌సలో చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో (దేశం తరఫున) అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇరాన్ ప్లేయర్ అలీ దాయ్ (109 గోల్స్) పేరిట ఉంది. అలీ దాయ్ ఆరేళ్ల క్రితమే ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో కనీసం మూడేళ్లపాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కొనసాగే అవకాశమున్న రొనాల్డో ఈ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

ఏ జట్టు తరఫున ఎన్నెన్ని...

జట్టు

మ్యాచ్‌లు

గోల్స్

స్పోర్టింగ్ లిస్బన్ (2002-03)

31

5

మాంచెస్టర్ యునెటైడ్ (2003-09)

292

118

రియల్ మాడ్రిడ్ (2009-18)

438

450

యువెంటాస్ (2018 నుంచి)

51

32

పోర్చుగల్ (2003 నుంచి)

162

95


క్విక్ రివ్యూ:
ఏమిటి: తన కెరీర్‌లో 700 గోల్స్ పూర్తి చేసుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రొనాల్డో
ఎవరు: క్రిస్టియానో రొనాల్డో
ఎప్పుడు: అక్టోబర్ 15, 2019
ఎక్కడ : కీవ్ (ఉక్రెయిన్)
Published date : 16 Oct 2019 05:25PM

Photo Stories