Skip to main content

50% ఓబీసీ కోటాకు నో..:సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీలకు ఈ విద్యా సంవత్సరం నుంచే 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Current Affairsతమ రాష్ట్రంలోని వైద్య విద్యా సంస్థల గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డెంటల్ కోర్సులకు ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్‌ను 2020-21 విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం, అక్కడి అధికార పార్టీ ఏఐఏడీఎంకే పెట్టుకున్న అర్జీలపై అక్టోబర్ 26వ తేదీన జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు జూలై 27వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే, రిజర్వేషన్ల అమలు విధానపరమైన అంశం అయినందున కేంద్రానికి తగు ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఓబీసీ కోటా అమలు చేయాలనే విషయంలో కూడా మద్రాస్ హైకోర్టు ఒక స్పష్టత ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 50 శాతం కోటా అమలు ఆచరణలో సాధ్యం కాదని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం తమిళనాడు పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది.
Published date : 27 Oct 2020 05:45PM

Photo Stories