2026 నాటికి తొలి ట్రిలియనీర్‌గా అమెజాన్ బెజోస్

వివిధ వ్యాపారాలపై తులనాత్మక అధ్యయనం చేసే కంపేరిజన్ సంస్థ రూపొందించిన నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం 2026 నాటికి అమెరికన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తొలి ట్రిలియనీర్ హోదా అందుకోనున్నారు. 145 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చలామణీ అవుతున్నారు. గడిచిన అయిదేళ్లలో ఆయన సంపద సగటున 34 శాతం మేర పెరిగింది.
రెండో ట్రిలియనీర్‌గా చైనా రియల్టర్..
జెఫ్ బెజోస్ తర్వాత చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం జు జియాయిన్ 2027 నాటికి ప్రపంచంలోనే రెండో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. అప్పటికాయన వయసు 75 ఏళ్లు ఉంటుంది. ఇక చైనాకే చెందిన మరో దిగ్గజ సంస్థ ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తదితరులు కూడా వచ్చే దశాబ్దం, దశాబ్దన్నర కాలంలో ట్రిలియనీర్ల లిస్టులో చోటు దక్కించుకోనున్నారు.
2033 నాటికి ముకేశ్
కంపేరిజన్ అధ్యయనం ప్రకారం... పారిశ్రామిక దిగ్గజం, దేశీ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో దశాబ్ద కాలంలో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. 2033 నాటికి 75 ఏళ్ల వయసులో.. ఏకంగా 1 లక్ష కోట్ల (ట్రిలియన్) డాలర్ల సంపదతో ట్రిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ సంపద ప్రస్తుతం సుమారు 53.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
25 మంది కుబేరులపై అధ్యయనం
కంపేరిజన్ మొత్తం 25 మంది కుబేరులపై అధ్యయనం చేయగా, ఇటీవలి కాలంలో వారి సంపద వృద్ధి రేటును బట్టి చూస్తే.. కేవలం 11 మందే తమ జీవితకాలంలో ట్రిలియనీర్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గల 25 లిస్టెడ్ కంపెనీలు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 25 మంది వ్యక్తులకు సంబంధించి గత అయిదేళ్ల డేటాను కంపేరిజన్ పరిగణనలోకి తీసుకుంది. గత అయిదేళ్లలో సంపద వృద్ధి చెందిన తీరు ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో పెరుగుదలను లెక్కగట్టడం ద్వారా .. ట్రిలియనీర్ల జాబితాపై ఒక అంచనా రూపొందించే ప్రయత్నం చేసింది.
ట్రిలియనీర్ల ఆవిర్భావం ఇలా
ట్రిలియనీర్ | కంపెనీ | ఎప్పటికి | అప్పటికి వయస్సు |
జెఫ్ బెజోస్ | అమెజాన్ | 2026 | 62 |
జు జియాయిన్ | ఎవర్‌గ్రాండ్ | 2027 | 68 |
జాక్ మా | ఆలీబాబా | 2030 | 65 |
మా హుటెంగ్ | టెన్సెంట్ | 2033 | 61 |
ముకేశ్ అంబానీ | రిలయన్స్ | 2033 | 75 |
బెర్నార్డ్ ఆర్నాల్ట్ | ఎల్‌వీఎంహెచ్ | 2033 | 84 |
మార్క్ జకర్‌బర్గ్ | ఫేస్‌బుక్ | 2036 | 51 |
స్టీవ్ బామర్ | మైక్రోసాఫ్ట్ (మాజీ) | 2040 | 83 |
మైఖేల్ డెల్ | డెల్ టెక్నాలజీస్ | 2043 | 78 |
ల్యారీ పేజ్ | గూగుల్ | 2051 | 77 |
సెర్గీ బ్రిన్ | గూగుల్ | 2051 | 77 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2026 నాటికి తొలి ట్రిలియనీర్‌గా అమెజాన్ బెజోస్
ఎప్పుడు : మే 15
ఎవరు : కంపేరిజన్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో