2019 నాటికి భారతీయుల సగటు ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు?
Sakshi Education
భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా పెరిగిందని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అంచనా వేసి సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారు.ఈ అధ్యయనంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలిపాల్గొన్నారు.
లాన్సెట్ అధ్యయనం-ప్రధానాంశాలు
- 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న భారతీయుల సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది.
- 1990 నుంచి 2019 మధ్య భారతీయుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి.
- కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది.
- భారత్‌లోని వ్యాధుల్లో 58 శాతం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) ప్రబలుతున్నాయి.
- గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులు, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి.
- 2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు), పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి.
- దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10-20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.
Published date : 17 Oct 2020 05:05PM