Skip to main content

2015-17 మాతా మరణాల నివేదిక విడుదల

2015-17 మధ్య భారతదేశంలో సంభవించిన మాతా మరణాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో అత్యంత తక్కువగా కేరళలో ప్రతీ లక్ష మందిలో 42 మంది, మహారాష్ట్రలో 55, తమిళనాడులో 63, ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణ, జార్ఖండ్‌లలో 76 మంది చొప్పున బాలింతలు మరణిస్తున్నారు. జాతీయ స్థాయిలో మాతా మరణాల రేటు 122 ఉండగా, దేశంలో అత్యధికంగా అస్సాంలో 229గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మరణాల రేటు 216గా ఉంది.

నివేదికలోని ముఖ్యాంశాలు
  • 2014-16 మధ్య తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో 81 మంది బాలింతలు మరణించేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 76కు తగ్గింది.
  • దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రమే అత్యధికంగా 97 మరణాలు సంభవిస్తున్నాయి.
  • జార్ఖండ్‌లోనైతే 2014-16 మధ్య మాతా మరణాల రేటు 165 ఉంటే, ఈసారి ఏకంగా 76కు తగ్గడం విశేషం.
  • మధ్యప్రదేశ్‌లో గతంలో మాతృత్వపు మరణాల రేటు 173 ఉంటే, ఈసారి 188కు పెరిగింది.
  • ఉత్తరప్రదేశ్‌లో గతంలో మరణాల రేటు 201 ఉంటే, ఈసారి 216కు పెరిగింది.

ప్రతీ లక్ష మందిలో...
మాతా మరణాలను ప్రతీ లక్ష మందిలో ఎంతమంది బాలింతలు చనిపోయారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. మాతా మరణాలను మూడు దశల్లో లెక్కిస్తారు. 15 నుంచి 49 ఏళ్లలోపు గర్భిణులను లెక్కలోకి తీసుకుంటారు. గర్భిణీగా ఉన్నప్పుడు సరైన ఆరోగ్య రక్షణ లేకపోవడం వల్ల సంభవించే మరణాలు, ప్రసవ సమయంలో సంభవించే మరణాలు, ఆ తర్వాత నెల లోపు జరిగే మరణాలను మాతా మరణాలుగా పరిగణిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2015-17 మాతా మరణాల నివేదిక విడుదల
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్రప్రభుత్వం

మాదిరి ప్రశ్నలు
1. 2015-17 మాతా మరణాల నివేదిక ప్రకారం అత్యంత తక్కువ(42) మాతా మరణాలు ఏ రాష్ట్రంలో సంభవించాయి?
1. తమిళనాడు
2. కేరళ
3. కర్ణాటక
4. బిహార్
సమాధానం : 2

2. మాతా మరణాలను లెక్కించేందుకు ఎన్ని సంవత్సరాలలోపు గర్భిణులను పరిగణనలోకి తీసుకుంటారు.
1. 18 నుంచి 50 ఏళ్లలోపు
2. 16 నుంచి 49 ఏళ్లలోపు
3. 15 నుంచి 49 ఏళ్లలోపు
4. 13 నుంచి 48 ఏళ్లలోపు
సమాధానం : 3
Published date : 09 Nov 2019 05:54PM

Photo Stories