Skip to main content

11 జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల’ ఏర్పాటు నేపథ్యంలో విజ్ఞాన మార్పిడి, శిక్షణ కోసం దేశంలోని 11 జాతీయ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Current Affairsతాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్తమ పద్ధతులు పాటించినప్పుడే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, అధిక ఆదాయం వస్తుందని అన్నారు.

11,158 రైతు భరోసా కేంద్రాలు...
గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 2020 జూన్ నాటికి అందుబాటులోకి వస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. వీటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్‌లో రైతులకు శిక్షణ ఇచ్చి, ఉత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పంట వేసే ముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తాం’ అని సీఎం తెలిపారు.

ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 11 సంస్థలు
  1. ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై
    వ్యవసాయం, పర్యావరణం, పౌష్టికాహారం సహా వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు సూచనలు, సలహాలు ఇస్తుంది.

  2. ఐసీఏఆర్, వ్యవసాయ విస్తరణ విభాగం, న్యూఢిల్లీ
    భారతదేశంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను సమన్వయం చేసే బాధ్యతతో పని చేస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనలలో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది. విత్తనాల ఉత్పత్తి, భూసారం, నీటి నాణ్యత పరీక్ష, ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇస్తుంది.

  3. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ)
    న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తోంది. పూసా ఇన్‌స్టిట్యూట్‌గా పిలుస్తారు. అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లను గుర్తించే పరికరాలను రూపొందింస్తుంది. భూసార పరీక్షలు చేసి తదనుగుణంగా రైతులకు ఎరువుల వినియోగంలో తగిన సిఫార్సులు చేస్తుంది.

  4. సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
    ఫరీదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చేయడం. ఎరువుల నాణ్యతను నిర్ధారించి రైతులకు సిఫార్సు చేస్తుంది.

  5. జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ సంస్థ
    నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వారణాశి కేంద్రంగా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏడాదికి 20 వేల శాంపిళ్లను పరీక్షిస్తుంది. విత్తనాల నాణ్యతను నిర్ధారిస్తుంది. విత్తన రంగంలో రైతు భరోసా కేంద్రాలకు అండగా నిలుస్తుంది.

  6. సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రిడా)
    ఈ సంస్థను 1985లో స్థాపించారు. వర్షాధార వ్యవసాయంలో పరిశోధనలు దీని లక్ష్యం. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా చేపడుతుంది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ సంస్థ శాఖలు ఉన్నప్పటికీ ప్రధాన క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. అనూహ్య వాతావరణ మార్పుల వల్ల వస్తున్న విపరిణామాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. పరిశోధన, సాంకేతిక సహకారం అందిస్తుంది.

  7. జాతీయ పాడి పరిశోధన సంస్థ, కర్నాల్
    దేశంలోనే అతి ముఖ్యమైన పాల పరిశోధన సంస్థ. కర్నాల్ కేంద్రంగా పని చేస్తోంది. 50 ఏళ్లుగా పాల ఉత్పత్తి, శుద్ధి, నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి తదితర రంగాలలో గణనీయమైన నైపుణ్యం ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పాలలో విషపూరిత, రసాయన పదార్థాలను కనిపెట్టడానికి మంచి విధానాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తుంది. స్వచ్ఛమైన పాలను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. కొత్త జాతులను అభివృద్ధి చేస్తుంది.

  8. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)
    ఈ సంస్థ పూణే కేంద్రంగా పని చేస్తోంది. ‘ఇంపీరియల్ బాక్టీరియలాజికల్ లాబొరేటరీ’గా అవతరించి ఆ తర్వాత ఐవీఆర్‌ఐగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పశువులకు వచ్చే వ్యాధులను గుర్తించడానికి ఉత్తమ వైద్య విధానాలను ప్రవేశపెడుతుంది. ఈ వ్యాధులను గుర్తించడానికి క్షేత్ర స్థాయిలో ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. వీటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. పశువులకు టీకాల విషయంలోనూ సహకరిస్తుంది.

  9. సదరన్ రీజియన్ అనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్
    ఈ సంస్థ బెంగళూరులోని హెబ్బాళ్ కేంద్రంగా పని చేస్తోంది. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలలో సేవలు అందిస్తుంది. పశువుల వ్యాధులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తుంది.

  10. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్
    మంచినీటితో చేపల పెంపకంలో ఈ సంస్థ దిట్ట. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంది. మంచినీటి ఆక్వాకల్చర్‌లో ఇదో ఆధునిక పరిశోధనా సంస్థ. ఆక్వా రంగంలో శిక్షణ ఇస్తుంది. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు క్షేత్ర స్థాయిలో ఉండేలా పర్యవేక్షిస్తుంది. గంటల్లోనే పరీక్షా ఫలితాలు తేల్చుతుంది. ఆక్వాకల్చర్‌లో స్మార్ట్ లాబొరేటరీ సొల్యూషన్స్ ను ప్రవేశ పెడుతుంది. వీటి నిర్వహణకు కమిటీలు, వాటిపై తనిఖీ ఉండేలా చూస్తుంది.

  11. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్
    జాతీయ మొక్కల సంరక్షణ సంస్థ (ఎన్‌పీపీటీఐ) 1996 నుంచి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. పంటల తెగుళ్ల నివారణలో సమర్థవంతమైన సంస్థ. మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది. రైతులకు శిక్షణ ఇస్తుంది. మానవ వనరుల అభివృద్ధి కోసం శిక్షణా కోర్సులను నిర్వహిస్తుంది.
Published date : 11 Feb 2020 05:36PM

Photo Stories