New Rules From January 1st, 2022: వచ్చే ఏడాది అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్‌టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్:
2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి.
ఏటీఎం ఛార్జీలు:
క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్‌జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్‌జాక్షన్‌కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.
ఈపీఎఫ్ ఈ-నామినేషన్:
ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు.
ఎల్‌పీజీ గ్యాస్ ధర:
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్:
పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
జీఎస్‌టీ రూల్స్:
పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
హీరో మోటోకార్ప్:
వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్‌సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కార్ల ధరలు:
వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి.