Skip to main content

జూలై 2018 ద్వైపాక్షిక సంబంధాలు

వరద సాయంపై నిర్ణయం కాలేదు: యూఏఈ
Current Affairs వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఎంత మేర ఆర్థిక సాయం చేయాలన్నదానిపై అధికారికంగా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆగస్టు 24న స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ వరద బాధితుల సాయం కోసం జాతీయ అత్యవసర కమిటీని మాత్రమే యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని యూఏఈ రాయబారి అహ్మద్ అల్బనమ్ చెప్పారు.
కేరళ వరద బాధితుల కోసం యూఏఈ రూ. 700 కోట్ల సాయం ప్రకటించిందని, ఆ సాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేరళ వరద బాధితుల సాయంపై నిర్ణయం కాలేదు
ఎప్పుడు : ఆగస్టు 24
ఎవరు : యూఏఈ ప్రభుత్వం

భారత్, ఆఫ్రికా దేశాల బంధానికి పది సూత్రాలు
Current Affairs భారత్, ఆఫ్రికా దేశాల బంధం బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ పది మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ సవాళ్లు, ఉగ్ర ముప్పు ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయన్నారు. ఉగాండా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ పార్లమెంటులో జూలై 25న ఈ మేరకు ప్రసంగించారు. దీంతో ఉగాండా పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. రక్షణ, పర్యావరణం, సైబర్ భద్రత, వ్యవసాయం, సముద్ర వనరుల సద్వినియోగం వంటి అంశాలకు సంబంధించి ఈ సూత్రాలను వివరించారు. అలాగే సమానత్వం, గౌరవం, పారదర్శకత కోసం ఆఫ్రికా చేస్తున్న ప్రయత్నాల్లో భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పర్యటన సందర్భంగా ఉగాండా రాజధాని కంపాలాకు 85 కి.మీ దూరంలోని జింజా అనే గ్రామంలో భారత జాతిపిత గాంధీ జ్ఞాపకార్థం వారసత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, ఆఫ్రికా దేశాల బంధానికి పది సూత్రాలు
ఎప్పుడు : జూలై 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉగాండా

డిజిటల్‌తో అవకాశాల వెల్లువ: మోదీ
డిజిటల్ విప్లవంతో బ్రిక్స్, ఇతర వర్ధమాన దేశాలకు కొత్త అవకాశాలు వెల్లువెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కృత్రిమ మేధ, బిగ్‌డేటా అనలిటిక్స్ వల్ల వచ్చే మార్పునకు ఈ దేశాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 10వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చివరి రోజు నిర్వహించిన ‘ఔట్‌రీచ్ సెషన్’లో మోదీ ప్రసంగించారు. అలాగే భారత్-ఆఫ్రికా దేశాల మధ్య ఆర్థిక, అభివృద్ధి సహకారం మరింత బలోపేతం అయ్యిందని, గత నాలుగేళ్లలో ఇరు వర్గాల మధ్య దేశాధినేతలు, ఉన్నతాధికారుల స్థాయిలో 100కు పైగా ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలు జరిగాయని మోదీ చెప్పారు. 40 ఆఫ్రికా దేశాలకు సుమారు రూ.75 వేల కోట్లకు పైగా రుణ సాయంను భారత్ కల్పించింది.
మరోవైపు బ్రిక్స్ సదస్సుకు హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ సమావేశమై వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, పర్యాటకం వంటి వాటిపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే టర్కీ, అంగోలా, అర్జెంటీనా అధ్యక్షులతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్, ఇతర వర్ధమాన దేశాలకు డిజిటల్‌తో అవకాశాల వెల్లువ
ఎప్పుడు : జూలై 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బ్రిక్స్ సదస్సులో

భారత్‌కు ఎస్‌టీఏ -1 హోదా
భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా కల్పిస్తూ ‘స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్-1 (ఎస్‌టీఏ -1)’ ప్రతిపత్తిని అమెరికా మంజూరు చేసింది. ఈ మేరకు యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరంలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ జూలై 31న ప్రకటించారు. దీంతో ఎస్‌టీఏ-1 కేటగిరీలో చేరిన ఏకైక దక్షిణాసియా దేశంగా భారత్ నిలిచింది. ఈ హోదాతో అధునాతన టెక్నాలజీని ఆ దేశం నుంచి కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. 2016లో భారత్‌ను తన కీలక రక్షణ భాగస్వామిగా గుర్తించిన అమెరికా తదనంతర చర్యగా ఎస్‌టీఏ -1 హోదాను ఇచ్చింది.
ఎస్‌టీఏ -1 జాబితాలో ప్రస్తుతం 36 దేశాలుండగా తాజాగా భారత్‌తో పాటు, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలకు కూడా అమెరికా ఎస్‌టీఏ -1 హోదాను కల్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు అమెరికా స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్-1 మంజూరు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : అమెరికా

బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న మోదీ
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న పదో బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 26న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, బహుముఖ సహకారంతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించొచ్చని మోదీ అన్నారు. ఈ తరంలో ‘అత్యుత్తమ నైపుణ్యం-కొద్ది పని’ కొత్త విధానంగా మారిందని వ్యాఖ్యానించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం పారిశ్రామిక తయారీ, డిజైన్, ఉత్పాదకతల్లో మౌలిక మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాటానికి సమగ్ర విధానం అవలంబించాలని బ్రిక్స్ దేశాలు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. జూలై 25 నుంచి 27 వరకు జరిగిన ఈ సదస్సులో మోదీతో పాటు దక్షిణాఫ్రికా, చైనా, రష్యా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు ిసిరిల్ రామఫోసా, షి జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, మైకెల్ టేమర్‌లు పాల్గొన్నారు. ఈ సదస్సుకు అతిథిలుగా అర్జెంటీనా అధ్యక్షుడు మార్షియో మాక్రి తోపాటు జమైకా, టర్కీ దేశాధినేతలు హాజరయ్యారు.
జిన్‌పింగ్‌తో మోదీ భేటీ
బిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలు, సహకారాం వంటి అంశాలపై చర్చలు జరిపారు. అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని
ఎప్పుడు : జూలై 26
ఎవరు : నరేంద్ర మోదీ
ఎక్కడ : జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా

బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్న మోదీ
Current Affairs దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జూలై 25 నుంచి 27 వరకు జరగనున్న 10వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో అంతర్జాతీయ శాంతి, రక్షణ, పరిపాలన, వాణిజ్యం వంటి అంశాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించనున్నారు. జూలై 23 నుంచి 27 వరకు రువాండా, ఉగాండా దేశాలలో మోదీ పర్యటించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10వ బ్రిక్స్ దేశాధినేతల సదస్సు
ఎప్పుడు : జూలై 25 నుంచి 27 వరకు
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా

ప్రధాని మోదీ రువాండా పర్యటన
ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జూలై 23న రువాండా రాజధాని కిగాలీకి చేరుకున్నారు. దీంతో రువాండాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు. పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పాల్ కగమేతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తోళ్ల అనుబంధ పరిశ్రమ, వ్యవసాయ పరిశోధనకు సంబంధించి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రువాండాలో పారిశ్రామిక పార్కులు, కిగాలీ సెజ్ అభివృద్ధికి రూ.1,379.10 కోట్లు, వ్యవసాయం, నీటివనరుల అభివృద్ధికి రూ.689.55 కోట్ల సాయాన్ని భారత్ అందజేయనున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది.
పర్యటనలో భాగంగా మోదీ ఓ గ్రామానికి 200 ఆవుల్ని బహుమతిగా ఇవ్వనున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపంతో పాటు పేద కుటుంబాలకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా రువాండా ప్రారంభించిన ‘గిరికా’ కార్యక్రమం కింద ఒక్కో పేద కుటుంబానికి ఒక్కో ఆవు ఇవ్వనున్నారు. ఇందుకోసం స్థానిక ఆవుల్ని సేకరించారు. రువాండాలో త్వరలో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభిస్తామని మోదీ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రువాండా చేరుకున్న భారత ప్రధాని
ఎప్పుడు : జూలై 23
ఎవరు : నరేంద్ర మోదీ
ఎక్కడ : కిగాలీ
ఎందుకు : ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా

ఉగాండా చేరుకున్న ప్రధాని మోదీ
ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జూలై 24న ఉగాండా చేరకున్నారు. ఈ సందర్భంగా ఉగాండా అధ్యక్షుడు యువేరి ముసెవేనితో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అలాగే రక్షణ సహకారం, దౌత్యవేత్తలు, ఇతర అధికారులకు వీసా మినహాయింపు, సాంస్కృతిక మార్పిడి, మెటీరియల్ టెస్టింగ్ లేబొరేటరీలపై నాలుగు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉగాండాకు భారత్ రూ.1377 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించింది.

రువాండాకు 200 ఆవులు కానుక

ఉగాండా పర్యటనకు ముందు రువాండాను సందర్శించిన మోదీ రువాండాలోని రువేరు అనే గ్రామంలోని నిరుపేదలకు 200 ఆవులను కానుకగా ఇచ్చారు. పేదరికం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు కుటుంబానికి ఒక ఆవును పంపిణీ చేయడం రువాండాలో 2006 నుంచి సంప్రదాయంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ‘గిరింకా’ అని పిలుస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉగాండా చేరుకున్న భారత ప్రధాని
ఎప్పుడు : జూలై 24
ఎవరు : నరేంద్ర మోదీ
ఎందుకు : ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా

ఢాకాలో అతిపెద్ద భారత వీసా కేంద్రం
Current Affairs ప్రపంచంలో అతిపెద్ద భారత వీసా కేంద్రాన్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్‌తో కలసి జూలై 14న ప్రారంభించారు. ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్(ఐవీఏసీ)గా పిలిచే ఈ కేంద్రం విస్తీర్ణం 18,500 చదరపు అడుగులు ఉంది. దీంతో ఢాకాలోని మోతిజీల్, ఉత్తర, గుల్షాన్, మీర్పూర్ రోడ్ వీసా కేంద్రాలను త్వరలో కొత్తదానిలో విలీనం చేయనున్నారు. ఈ సందర్భంగా వీసా దరఖాస్తుకు అపాయింట్‌మెంట్ విధానాన్ని త్వరలో రద్దుచేస్తామని బంగ్లాదేశ్‌లో భారత హైకమిషన్ కార్యాలయం పేర్కొంది.
మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రముప్పు వంటి అంశాలపై చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో అతిపెద్ద భారత వీసా కేంద్రం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : రాజ్‌నాథ్ సింగ్, అసదుజ్జమన్ ఖాన్
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్

మోదీతో భూటాన్ ప్రధాని టాబ్‌గే చర్చలు
Current Affairs ప్రధాని నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని త్సెరింగ్ టాబ్‌గే న్యూఢిల్లీలో జూలై 6న ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రక్షణ, భద్రత, వ్యూహాత్మక రంగాల్లో సహకారం బలోపేతం, డోక్లాం వంటి అంశాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా టాబ్‌గే భారత పర్యటనకు వచ్చారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మోదీతో భూటాన్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : త్సెరింగ్ టాబ్‌గే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా

మోదీతో దక్షిణ కొరియా అధ్యక్షుడు సమావేశం
భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ప్రధాని నరేంద్ర మోదీతో జూలై 10న సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు రక్షణ, భద్రత, కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ప్రాంతీయ శాంతి వంటి అంశాలపై పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) నవీకరణతో పాటు 10 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే ద్వెపాక్షిక సహకారం, సముద్ర వివాదాలకు సంబంధించి ఓ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత సభ్యత్వానికి దక్షిణకొరియా మద్ధతు తెలిపింది. మరోవైపు కొరియా ద్వీపకల్పంలో శాంతి కోసం జరిగిన ప్రయత్నాల్లో భారత్ కూడా ఓ భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీతో ద క్షిణ కొరియా అధ్యక్షుడు సమావేశం
ఎప్పుడు : జూలై 10
ఎవరు : మూన్ జే ఇన్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : భారత పర్యటనలో భాగంగా
Published date : 17 Aug 2018 04:07PM

Photo Stories