Skip to main content

India UK FTA: భారత్‌–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-యునైటెడ్ కింగ్‌డమ్(UK) మధ్య గత మూడేళ్లుగా కొనసాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు ఫలవంతమయ్యాయి.
India and UK Seal Historic Free Trade Agreement Amid Global Tensions

మే 6వ తేదీ ఈ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. అంతేకాకుండా డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అనే మరో కీలక ఒప్పందం కూడా కుదిరింది. ఈ రెండు ఒప్పందాలు వాణిజ్య మరియు కార్మిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచేలా ఉన్నాయి.

ట్రంప్ విధానాల నేపథ్యంలో కొత్త మార్గం
ప్రపంచవ్యాప్తంగా సరుకు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాల నేపథ్యంలో, భారత్–యూకే ఒప్పందం ఒక శుభసూచక పరిణామంగా నిలిచింది. విదేశీ ఉత్పత్తులపై అమెరికా కఠిన నీతులు తీసుకుంటున్న సమయంలో, భారత్–యూకే మధ్య తక్కువ సుంకాలు, సులభ లావాదేవీలకు అవకాశం కలిగే ఈ ఒప్పందం రెండు దేశాలకు వ్యాపారంగా మరియు ఆర్థికంగా లాభదాయకం కావచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చారిత్రక ఒప్పందంగా మోదీ అభివర్ణన
ఈ ఒప్పందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఆవిష్కరణలు, ఆర్థిక అభివృద్ధి వంటి విభాగాల్లో ఇది ఎంతో మేలు చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటీవల యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ, ఈ ఒప్పందాలపై చర్చించి పరస్పర సహకారానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు.

ప్రజల మధ్య సంబంధాలకు బలమైన తోడ్పాటు
ఈ ఒప్పందాలు కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా, ప్రజల మధ్య సంబంధాలను, సంస్కృతి పరస్పర మార్పిడులను కూడా ప్రోత్సహించనున్నాయి. విద్య, టెక్నాలజీ, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో సహకారం పెరిగే అవకాశముంది. దీని ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు వెలికి రానుండగా, ఉద్యోగ కల్పనకూ ఇది దోహదం చేస్తుందని ఇరుదేశాల నేతలు భావిస్తున్నారు.

Critical Minerals: ఉక్రెయిన్‌–అమెరికా మధ్య కుదిరిన ఖనిజ ఒప్పందం

ఏమిటీ ఒప్పందం? 
➤ భారత్‌–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలాఏళ్లుగా చర్చల్లో నలుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టడం, విదేశీ ఉత్పత్తులపై సుంకాల బాంబు పేల్చడంతో భారత్‌–యూకే మధ్య చర్చల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. 2022 జనవరిలో మొదలైన ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అదే సమయంలో ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. 

➤స్వేచ్ఛా వాణిప్య ఒప్పందంతో విస్కీ, అడ్వాన్స్‌డ్‌ తయారీ భాగాలు, వైద్య పరికరాలు, అడ్వాన్స్‌డ్‌ మెషినరీ, ఆహార ఉత్పత్తులపై టారిఫ్‌లు భారీగా తగ్గుతాయి.  
➤ అంతర్జాతీయ మార్కెట్ల కోసం రెండు దేశాలు ఉమ్మడిగా వస్తువులు, సేవలను అభివృద్ధి చేయడానికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. 
➤ యూకే ఉత్పత్తులను ఇండియా అనుమతించనుంది. అలాగే ఇండియా తమ ఉత్పత్తులను యూకేలో విక్రయించుకోవచ్చు. 
➤ భారత్‌లో బ్రిటిష్‌ స్కాచ్‌ విస్కీ, బ్రిటిష్‌ కార్ల ధరలు తగ్గిపోతాయి. అలాగే బ్రిటన్‌లో ఇండియా వస్త్రాలు, తోలు ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. 

Rafale-M Jets: రఫేల్‌ ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్‌ సంతకాలు

➤ ఒప్పందం ప్రకారం... యూకే విస్కీ, జిన్‌పై సుంకాన్ని 150 నుంచి 75 శాతానికి భారత్‌ తగ్గిస్తుంది. పదేళ్లలో 40 శాతానికి తగ్గించనుంది. 
➤ బ్రిటిష్‌ ఆటోమొబైల్స్‌పై ఇండియాలో టారిఫ్‌ ప్రస్తుతం 100 శాతం ఉండగా, ఇది 10 శాతానికి తగ్గిపోనుంది. ప్రతిఫలంగా భారత్‌ నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లను యూకే ప్రభుత్వం భారీగా తగ్గిస్తుంది. 
➤ యూకే మార్కెట్లలో 99 శాతం భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి.  పాదరక్షలు, బంగారు అభరణాలు, రత్నాలు, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బర్, కలప, కాగితం, గాజు, సెరామిక్, బేస్‌ మెటల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ మెషినరీ, ఫర్నీచర్, క్రీడా సామగ్రి, శుద్ధి చేసిన ఆహారం, పాడి ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. అంతేకాకుండా భారతీయులకు యూకేలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

➤ ఎఫ్‌టీఏతో ఇండియా–యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెండు రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. 2040 నాటికి బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థ ప్రతిఏటా అదనంగా 4.8 బిలియన్‌ పౌండ్ల మేర లాభపడుతుందని చెబుతున్నారు. 
➤ భారత్, యూకే మద్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 41 బిలియన్‌ పౌండ్లుగా ఉంది. ఎఫ్‌టీఏతో ఇది 56 బిలియన్‌ పౌండ్లకు చేరుకోనుంది. 

➤ డబుల్‌ కంట్రిబ్యూషన్స్‌ కన్వెన్షన్‌(సామాజిక భద్రత ఒప్పందం) ప్రకారం.. భారత్‌ ఉద్యోగాలు యూకేలో లేదా యూకే ఉద్యోగులు భారత్‌లో పనిచేస్తే నేషనల్‌ ఇన్సూరెన్స్‌ లేదా సోషల్‌ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. 
➤ ఎఫ్‌టీఏకు ఇరుదేశాల పార్లమెంట్‌ ఆమోదం లభించి, సంతకాలు జరగాల్సి ఉంది. ఏడాది లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Rafale Fighter Jets: ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం చేసుకోనున్న భారత్

Published date : 07 May 2025 01:12PM

Photo Stories