Skip to main content

Hybiz Media Award: సాగుబడి రాంబాబుకు హైబిజ్ పురస్కారం

సాక్షి, హైదరాబాద్‌: ‘సాక్షి సాగుబడి’ డెస్క్‌ ఇన్‌చార్జ్‌ పంతంగి రాంబాబు మే 3న‌ హైటెక్స్‌లో జరిగిన హైబిజ్‌ టీవీ మీడియా అవార్డ్స్‌ ఫంక్షన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్‌ అగ్రికల్చరల్ జర్నలిస్ట్‌ పురస్కారాన్ని అందుకున్నారు.
Panthangi Rambabu
సాగుబడి రాంబాబుకు హైబిజ్ పురస్కారం

37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్‌ సెట్టర్‌గా పేరుగాంచారు. ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. 
పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్‌డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్‌ అగ్రికల్చర్‌ పోకడలపై కాలమ్‌ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్‌ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు. 
అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌.ఐ.ఎఫ్‌.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ చానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు.
హెచ్.ఎం.ఎ-2023 కార్య‌క్ర‌మానికి డాక్ట‌ర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ మార్కెటింగ్ కేఆర్పీ రెడ్డి, ఈవీ న‌ర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), న‌రేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చ‌క్ర‌ధ‌ర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. ర‌వీంద‌ర్ రెడ్డి (డైరెక్ట‌ర్ మార్కెటింగ్ - భార‌తి సిమెంట్స్), వి. రాజ‌శేఖ‌ర్ రెడ్డి (జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్ట‌ర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Published date : 03 May 2023 05:55PM

Photo Stories