Skip to main content

Telangana MLC: సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన జానపద గాయకుడు?

Goreti Venkanna

ప్రముఖ జానపద గాయకుడు, రచయిత, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు –2021 లభించింది. తెలుగు విభాగంలో వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం ఏడు కవితా సంపుటిలు, రెండు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒకటి చొప్పున బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, క్రిటిసిజం, ఎపిక్‌ పొయిట్రీలను 2021 సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గుజరాతీ, మైథిలి, మణిపురి, ఉర్దూ భాషల అవార్డులను త్వరలో ప్రకటిస్తామని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అయ్యర్, కార్యదర్శి కె.శ్రీనివాసరావులు 2021, డిసెంబర్‌ 30న ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ నుంచి ముగ్గురికి..

తెలంగాణకు చెందిన ముగ్గురు కవులను 2021 ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. ఈ ముగ్గురిలో గోరటి వెంకన్న ఒకరు కాగా,  కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తగుళ్ల గోపాల్‌ను వరించింది. ‘దండ కడియం’అనే కవితా సంపుటికి గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దేవరాజు మహారాజు రచించిన ‘నేను అంటే ఎవరు?’అనే నాటకానికి దక్కింది. గోరటి వెంకన్న తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వారు కాగా, తగుళ్ల గోపాల్‌ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామంలో జన్మించారు. ఇక దేవరాజు మహారాజు వరంగల్‌ జిల్లాకు చెందినవారు.

మరికొన్ని ముఖ్యాంశాలు..

  • కేంద్ర సాహిత్య అకాడమీ 2021కి గాను 20 భాషల్లో 2021, డిసెంబర్‌ 30న అవార్డులు ప్రకటించింది.
  • కవితల విభాగంలో గోరటి వెంకన్న(తెలుగు), మవాడీ గహాయి(బోడో), సంజీవ్‌ వెరెంకర్‌(కొంకణి), హృషీకేశ్‌ మాలిక్‌(ఒడియా), మీథేశ్‌ నిర్మొహీ(రాజస్థానీ), బిందేశ్వరీప్రసాద్‌ మిశ్ర్‌(సంస్కృతం), అర్జున్‌ చావ్లా(సింధి)లకు పురస్కారాలు దక్కాయి.
  • కథా రచయితలు రాజ్‌ రాహీ(డోగ్రీ), కిరణ్‌ గురవ్‌(మరాఠీ), ఖలీద్‌ హుసేన్‌(పంజాబీ), నిరంజన్‌ హంస్డా (సంతాలీ), అంబాయి(తమిళం)కి పురస్కారాలు వరించాయి.
  • నవలా రచయితలు అనురాధా శర్మ పుజారీ(అస్సామీ), నమితా గోఖలే(ఇంగ్లిష్‌)లకు అవార్డులు దక్కాయి.
  • జీవిత చరిత్రల విభాగంలో కన్నడ రచయిత డీఎస్‌ నాగభూషణకు, స్వీయచరిత్రల విభాగంలో జార్జ్‌ ఒనక్కూర్‌ మళయాలం, నాటక విభాగంలో బెంగాలీ రచయిత బ్రాత్య బసు, హిందీ రచయిత దయా ప్రకాశ్‌ సిన్హాలకు అవార్డులు ప్రకటించారు.
  • విమర్శ విభాగంలో వాలీ మొహ్మద్‌ అసీర్‌ కాస్తవారీ(కశ్మీరీ), ఐతిహాసిక కవిత్వంలో చబీలాల్‌ ఉపాధ్యాయ(నేపాలీ) పురస్కారాలు గెలుచుకున్నారు.

చ‌ద‌వండి: డబ్ల్యూఈవో లైఫ్‌ టైం అవార్డుకు ఎంపికైన భారతీయుడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు–2021కు ఎంపికైన తెలుగు జానపద గాయకుడు?
ఎప్పుడు : డిసెంబర్‌ 30, 2021
ఎవరు    : ప్రముఖ జానపద గాయకుడు, రచయిత, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న 
ఎందుకు : వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికిగాను..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Jan 2022 05:47PM

Photo Stories