Skip to main content

డిసెంబరు 2018 అవార్డ్స్

తెలంగాణకు 18 స్కోచ్ పురస్కారాలు Current Affairs
పౌర సేవలు, అభివృద్ధి, వినూత్న పథకాల అమలు వంటి అంశాల ప్రాతిపదికన అందించే స్కోచ్ పురస్కారాల్లో తెలంగాణకు 18, ఆంధ్రప్రదేశ్‌కు 9 లభించాయి. న్యూఢిల్లీలో డిసెంబర్ 22న జరిగిన స్కోచ్ 55వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేశారు. పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు సిరిసిల్ల మున్సిపాలిటీకి 5, మెదక్‌కు 2, పీర్జాదిగూడకు 1, బోడుప్పల్‌కు 3, సూర్యాపేటకు 1, మెప్మాకు 6 అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణకు 18 స్కోచ్ పురస్కారాలు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎక్కడ : న్యూఢిల్లీ

ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్‌కు జ్ఞాన్‌పీఠ్
ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్‌కు 54వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారం లభించింది. ఈ మేరకు డిసెంబర్ 14న భారతీయ జ్ఞాన్‌పీఠ్ బోర్డు ప్రకటించింది. వినూత్న రచనలకు పేరొందిన ఘోష్ చారిత్రక విషయాలతో పాటు ఆధునిక యుగంలోని పరిస్థితుల్ని సృ్పశించాడని, గతాన్ని వర్తమానంతో అనుసంధానించాడని జ్ఞాన్‌పీఠ్ అకాడమీ కొనియాడింది.
1956లో కోల్‌కతాలో జన్మించిన అమితవ్ ఘోష్ దిల్లీ, ఆక్స్‌ఫర్డ్, అలెగ్జాండ్రియాల్లో చదువుకున్నారు. షాడోలైన్స్, ది గ్లాస్ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్, సీ ఆఫ్ పపీస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ వంటి నవలలు రాశారు. ఘోష్ రాసిన తాజా నవల ‘ది గ్రేట్ డిరేంజ్‌మెంట్’ 2016లో విడుదలైంది. ఇప్పటికే పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులను ఆయన అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 54వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : అమితవ్ ఘోష్
ఎక్కడ : భారత్

సీఆర్‌ఐ పంప్స్‌కు కేంద్రప్రభుత్వ అవార్డు
సీఆర్‌ఐ పంప్స్‌కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2018’ లభించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ డిసెంబర్ 18న ఈ అవార్డును అందజేశారు. విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్ ఐకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2018
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : సీఆర్‌ఐ పంప్స్
ఎందుకు : విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్‌ను ఉత్పత్తి చేస్తున్నందుకు

పాకిస్థాన్ మహిళకు ఐరాస పురస్కారం
పాకిస్థాన్ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66)కు మరణానంతరం ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవహక్కుల పురస్కారం-2018 లభించింది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 19న జరిగిన కార్యక్రమంలో అస్మా కుమార్తె మునైజే జహంగీర్‌కు ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్నాండా ఈ అవార్డును అందజేశారు. పాకిస్థాన్‌లో సైనిక జోక్యానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అస్మా 2018 ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నూమూశారు.
అస్మాతో పాటు టాంజానియాలో బాలికా విద్య కోసం ఉద్యమిస్తున్న రెబెకా గ్యుమీ, బ్రెజిల్‌లో తొలి ఆదివాసీ మహిళా న్యాయవాది జోనియా బటిస్టా, ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ డిఫెండర్స్(ఐర్లాండ్)కు మానవహక్కుల పురస్కారం-2018 లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
పాకిస్థాన్ మహిళకు మానవహక్కుల పురస్కారం-2018
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : అస్మా జహంగీర్(66)

సైంటిస్ట్ నరసింహారావుకు భారత్ వికాస్ అవార్డు
Current Affairs గుంటూరు జిల్లాకి చెందిన సైంటిస్ట్ గుడికందుల నరసింహారావుకు ‘భారత్ వికాస్ అవార్డు’ లభించింది. ఈ మేరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో డిసెంబర్ 1న జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జియో ఇంజనీరింగ్ పరిశోధన విధ్యార్థి అయిన నరసింహారావుకు ‘ఇంటలెక్చువల్ సోషల్ రెస్పాన్సబిలిటీస్’ విభాగంలో ఈ అవార్డు దక్కింది. దేశంలో పరిశోధన, విద్యారంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు భారత్ వికాస్ అవార్డును ప్రకటిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వికాస్ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : గుడికందుల నరసింహారావు
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : పరిశోధన, విద్యారంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు

టీ రేషన్ యాప్‌కు ఈ గవర్నెన్స్ అవార్డు
రేషన్ లావాదేవీలను సామాన్య ప్రజలు తెలుసుకునేలా తెలంగాణ పౌరసరఫరాల శాఖ రూపొందించిన ‘టీ రేషన్’యాప్‌కు సీఎస్‌ఐ (కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా) ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. ప్రభుత్వ సేవలు, సరుకుల సరఫరా నుండి పంపిణీ వరకు జరిగే అన్ని వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లబ్ధిదారుడికి సమీపంలో ఉన్న రేషన్‌షాపు లొకేషన్ సహా మొత్తం 13 అప్లికేషన్స్ తో ఈ యాప్‌ను రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎస్‌ఐ (కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా) ఈ గవర్నెన్స్ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : తెలంగాణ పౌరసరఫరాల శాఖ (టీ రేషన్ యాప్)

దివ్యాంగుల సంక్షేమ శాఖకు జాతీయ అవార్డు

తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖకు ‘బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజెబిలిటీస్’ అవార్డు లభించింది. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును అందజేశారు. దివ్యాంగుల సాధికారత, పునరావాసం కోసం చేపట్టిన కార్యక్రమాలకుగాను రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. వ్యక్తిగత విభాగంలో దివ్యాంగుల సాధికారతకు విశేష కృషి చేసినందుకు సికింద్రాబాద్‌కు చెందిన మంజులా కల్యాణ్ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజెబిలిటీస్ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ
ఎందుకు : దివ్యాంగుల సాధికారతలో చేపట్టిన కార్యక్రమాలకు

కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం
ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2018 లభించింది. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ డిసెంబర్ 5న ప్రకటించాడు. తెలుగు భాష నుంచి ఇనాక్ రచించిన ‘విమర్శిని’ వ్యాస రచనకు ఈ పురస్కారం లభించింది.
2018 సంవత్సరానికిగాను మొత్తం గుర్తింపు పొందిన 24 భాషల్లో ఉత్తమ రచన, కవితా సంపుటి, చిన్న కథల విభాగాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఎంపికై న వాటిలో ఆరు నవలలు, ఆరు చిన్న కథలు, ఏడు కవిత్వం, మూడు సాహిత్య విమర్శలకు అవార్డులు దక్కాయి.
సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన నవలలు

భాష

నవల

రచయిత

తెలుగు

విమర్శిని

ఆచార్య కొలకలూరి ఇనాక్

తమిళం

సంచారం

ఎస్.రామకృష్ణన్

సంస్కృతం

మమా జనని

రమాకాంత్ శుక్లా

కన్నడ

అనుస్త్రేని-యజమానికె

కేజీ నాగరాజప్ప

హిందీ

పోస్ట్ బాక్స్ నం.203-నాళ సొపరా

చిత్రా ముడ్గల్

ఉర్దూ

రోహిణ్

రెహమాన్ అబ్బాస్

మరోవైపు ప్రాచీన, మధ్యయుగ సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా పలువురికి భాషా సమ్మాన్ పురస్కారాల్ని ప్రకటించారు. దక్షిణ భారతం నుంచి కన్నడ రచయిత జి.వెంకటసుబ్బయ్యకు ఈ పురస్కారం లభించింది. ఇతర ప్రాంతాలనుంచి యోగేంద్రనాథ్ శర్మ, గగనేంద్రనాథ్ దాస్, శైలజకు ఈ అవార్డు దక్కింది. గుర్తింపు పొందని భాషల నుంచి ఐదుగురికి పురస్కారాలు లభించాయి. పురస్కారగ్రహీతలకు 2019, జనవరి 29న ఢిల్లీలోని అకాడమీలో జరిగే కార్యక్రమంలో అవార్డుతోపాటు లక్ష నగదు బహుమతి, కాంస్య జ్ఞాపిక ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2018 (తెలుగు)
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : ఆచార్య కొలకలూరి ఇనాక్
ఎందుకు : విమర్శిని వ్యాస రచనకు

Published date : 15 Dec 2018 11:57AM

Photo Stories