Skip to main content

Top Richest Women In India: ఇండియాలో అత్యంత సంపన్న మహిళ ఈమె..ఎలా అంటే..?

పురాణాల్లో సావిత్రి అంటే భర్తే లోకంగా బతికే ఓ మహిళ. భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ సావిత్రి ఏకంగా యముడితోనే పోరాటం చేసి విజయం సాధించింది.
Savitri Jindal
Savitri Jindal

కానీ ఈ సావిత్రి  భర్త ప్రాణాలతో సమానమైన అతని ఆశయాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. అంతేకాదు దేశంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన జిందాల్‌ గ్రూపుకి చుక్కానిలా మారింది. 14 లక్షల కోట్లకు పైగా సంపదతో దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా రికార్డులెక్కింది.  

ఏ కాలేజీకి వెళ్ల‌కుండానే...
ఇటీవల ఫోర్బ్స్‌ సంస్థ ప్రకటించిన ధనవంతులైన మహిళల జాబితాలో సావిత్రి జిందాల్‌  రూ. 13.46 లక్షల కోట్ల  సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఏడాది ఆమె సంపద విలువ 9.72 లక్షల కోట్లు. ఏడాదిలో తన కంపెనీ విలువని 3.34 లక్షల కోట్ల మేరకు పెంచగలిగింది. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థంగా నిర్వ‍్వహిస్తున్న సావిత్రీ ఏ బిజినెస్‌ స్కూల్‌లోనూ చదువుకోలేదు. ఆ మాటకొస్తే పెద్దగా కాలేజీకి వెళ్లింది కూడా లేదు. తొమ్మిది పిల్లల తల్లిగా యాభై ఏళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. ఒక్కసారిగా 55 ఏళ్ల వయస్సులో కార్పొరేట్‌ వరల్డ్‌లోకి అడుగు పెట్టారు. ఎవ్వరూ ఊహించలేని విజయాలను సాధించారు. ఇంతకీ ఎవరీ సావిత్రి. ఆమె వెనుక ఉన్న విజయ రహస్యం ఏంటీ ?

ఈ మహిళ వెనుక..
ప్రతీ మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఈ మహిళ సాధించిన విజయాల వెనుక ఓ పురుషుడు ఉన్నాడు. సావిత్రి విజయపరంపరకు వేదికను నిర్మించింది ఆమె భర్త ఓం ప్రకాశ్‌ జిందాల్‌. అంటే జిందాల్‌ గ్రూపు వ్యవస్థాపకుడు. ఓం ప్రకాశ్‌ జిందాల్‌కి చిన్నతనం నుంచి మెషిన్లంటే వల్ల మానిన అభిమానం. ఏ పరికరం కనిపించినా దాని భాగాలు పరిశీలిస్తూనే ఉండేవాడు. అలా ఓ సారి ఓ పైపుపై మేడ్‌ ఇన్‌ ఇంగ్లండ్‌ అనే అక్షరాలు కనిపించాయి.

ఎలాంటి డిగ్రీ లేకుండానే..22 ఏళ్ల వయస్సులో..

Top Richest Women In India


మేడ్‌ ఇన్‌ ఇండియా ట్యాగ్‌తో కనీసం పైపులయినా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ తపనతోనే ఎలాంటి ఇంజనీరింగ్‌ డిగ్రీ లేకుండానే కేవలం తనకున్న అనుభవంతోనే 22 ఏళ్ల వయస్సులో బకెట్ల తయారీ పరిశ్రమ ఓం ప్రకాశ్‌ జిందాల్‌ స్థాపించాడు. పన్నెండేళ్ల పాటు బకెట్లు తయారు చేస్తూ.. ఆ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పెట్టుబడిగా మార్చి 1962లో కోల్‌కతా దగ్గర పైపుల పరిశ్రమను స్థాపించాడు.  అది క్లిక్‌ కావడంతో 1969లో అక్కడే జిందాల్‌ స్ట్రిప్‌ని నెలకొల్పాడు. అప్పుడే సావిత్రి అతని జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక అ‍క్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. స్టీల్‌, పవర్‌, మైనింగ్‌, గ్యాస్‌, ఆయిల్‌ సెక్టార్లలో జిందాల్‌ గ్రూప్‌ని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు. ఆ తర్వాత రాజకీయాలవైపు మళ్లి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. హర్యాణాలోని హిసార్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పరిశ్రమల మంత్రిగా పని చేశారు. పిల్లల బాగోగులు చూసుకుంటూనే భర్తలోని కార్యదక్షతను దగ్గరగా గమనించారు సావిత్రి. అదే అమెకు బలమయ్యింది. 

మూన్నాళ్ల ముచ్చటే..
తొమ్మిది సంతానంతో ఇంటి పనులకే పరిమితమైన సావిత్రి స్టీలు, పవర్‌ సెక్టార్‌లో ఉన్న జిందాల్‌ గ్రూపుని సమర్థంగా నిర‍్వహించలేదనే విమర్శలు వచ్చాయి. కేవలం ఆయన భార్యగా ఆ హోదాలో కొన్నాళ్ల పాటే ఆమె చైర్‌ పర్సన్‌గా ఉంటారని, తర్వాత స్థానం తమదే అనుకున్న జిందాల్‌ బోర్డు గ్రూపు సభ్యుల పుకార్లు వ్యాపింప చేశారు. ఓం ప్రకాశ్‌తోనే జిందాల్‌ గ్రూపు ప్రభ పోతుందని ఇకపై మార్కెట్‌లో ఆ గ్రూపు కనిపించదని ప్రత్యర్థుల ఆశలు పెట్టుకున్నారు. కానీ ఓం ప్రకాశ్‌ జిందాల్‌ని దగ్గర నుంచి గమనించిన సావిత్రికి భర్త ఆశయాలు బాగా తెలుసు.

వీరి అంచనాలను తారుమారు చేస్తూ..
ఇండస్ట్రియల్ సెక్టార్‌లో మిషన్‌ మ్యాన్‌గా ఓం ప్రకాశ్‌ జిందాల్‌కి పేరుంది. ఎవరికీ కనిపించని అవకాశాలను వెతికి పట్టుకుంటారని పేరు. అచ్చంగా దాన్ని ఆచరణలో చూపించారు సావిత్రి. వంటింట్లో ఉన్న మహిళ కార్పోరేట్‌ ఎత్తులను తట్టుకోలేదని, కూలబడిపోతుందని వేసిన అంచనాలను ఆమె తప్పని నిరూపించారు. తను కంపెనీ చైర్‌పర్సన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిందాల్‌ గ్రూప్‌ సంపదను నాలుగింతలు పెంచి విమర్శకుల చేత ఔరా అనిపించారు. భర్త అడుగు జాడల్లో నడుస్తూ హిసార్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెవిన్యూ మంత్రిగా కూడా సేవలు అందించారు. స్టీల్‌, పవర్‌తో పాటు మైనింగ్‌, గ్యాస్‌, ఆయిల్‌ సెక్టార్లలోకి వ్యాపారాన్ని విస్తరింప చేశారు.

పెద్దగా ఎప్పుడూ గడప దాటని ఈ మహిళ.. 
భర్త చాటు భార్యగా తొమ్మిది మంది పిల్లలకు తల్లిగా పెద్దగా ఎప్పుడూ గడప దాటని ఈ మహిళ ఈ రోజు పురుషాధిక్య ప్రపంచంలో తనదైన వెలుగులు విరజిమ్ముతోంది. ఫలితంగా ఇటీవల ఫోర్బ్స్‌ ప్రకటించిన ధనవంతుల జాబితాలో ఇండియాలోనే అత్యధిక సంపన్నురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. 71 ఏళ్ల వయస్సులో జిందాల్‌ గ్రూపుని  సావిత్రి సమర్థంగా నిర్వహిస్తున్నారు.

Published date : 25 Oct 2021 06:53PM

Photo Stories