Skip to main content

సంకల్పానికి తోడైన నాన్న సహకారం

‘ఐఐటీ-ముంబై నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తిచేసి.. భవిష్యత్తులో రోబోటిక్స్‌లో పరిశోధన చేయడమే నా లక్ష్యం. ఐఐటీలో ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో ఆరో తరగతి నుంచిపడిన శ్రమకు దక్కిన ఫలితమే తాజా విజయం’ అంటున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన రావూరి లోహిత్ సక్సెస్ స్టోరీ...

మా స్వస్థలం చిత్తూరు జిల్లా, పుత్తూరు. నాన్న సురేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో జూనియర్ వారంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ సుధారాణి నగరి మండలం తడుకుపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు కావడంతో ఐఐటీలో సీటు సాధించాలనే నా లక్ష్యానికి ఎంతో తోడ్పాటును అందిచ్చారు.

చిన్నప్పటి నుంచే:
చిన్ననాటి నాకు నుంచే ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉండేది. ఆ సంకల్పానికి నాన్న సహకారం తోడైంది. ఆయన ఉద్యోగ రీత్యా అధికశాతం ఉత్తరాది రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించారు. ఆ క్రమంలో అక్కడ ఉండే ఐఐటీలు, కోచింగ్ సెంటర్ల గురించి సమాచారం సేకరించేవారు. దాని ఆధారంగా ఐఐటీల్లో సీటు సాధించాలంటే..ఏం చదవాలి? ఎలా చదవాలి? వంటి అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించారు.దాంతో పాఠశాల స్థాయిలోనే ఐఐటీల్లో సీటు సాధించే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఐఐటీ లక్ష్యంగా ఆరో తరగతి నుంచే కష్టపడటం ప్రారంభించాను. ఐఐటీ-ఫౌండేషన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్‌లో చేరా. దాంతో జేఈఈకి అవసరమైన బేసిక్స్,ఫండమెంటల్స్‌పై పట్టు లభించింది. ఇది ప్రాథమి కంగా జేఈఈలో విజయానికి ఎంతో దోహదం చేసింది.

పూర్తి స్థాయిలో:
జేఈఈలో ర్యాంకు కోసం ఇంటర్మీడియెట్ నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. ప్రతిరోజు సగటున 10-11 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాను. క్లిష్టమైన అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సందేహాలను ఫ్యాకల్టీల సహాయంతో నివృత్తి చేసుకున్నా. దాంతో సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయగలిగాను. అన్నిటికంటే ఫిజికల్ కెమిస్ట్రీ కొంత కష్టంగా అనిపించేది. ఇందుకోసం పరీక్షకు నెలరోజుల సమయంలో అన్ని సబ్జెక్ట్‌ల కంటే కొద్దిగా ఎక్కువగా దీనికి ప్రాధాన్యతనిచ్చాను. తద్వారా ఈ సమస్యను తేలికగా అధిగమించాను.

రివిజన్ + ప్రాక్టీస్ టెస్ట్స్:
నేను చదివిన కాలేజీలో జేఈఈ కోచింగ్ కోసం ప్రత్యేక స్టడీ ప్లాన్ అమలు చేసేవారు. ఆ స్టడీ ప్లాన్‌ను అనుసరించడం వల్ల ఇంటర్ సిలబస్ ముందుగానే పూర్తయి.. ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల సిలబస్ పునశ్చరణకు తగిన సమయం లభించింది. ఈ సమయంలోనే అన్ని అంశాల రివిజన్‌తోపాటు ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్టులకు హాజరయ్యే వాడిని. వాటి ఫలితాల ఆధారంగా ఎప్పటికప్పుడు లోపాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించాను.

పాక్టికల్ అప్రోచ్‌తో:
సబ్జెక్టులను ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్‌తో చదవాలి. జేఈఈ-అడ్వాన్స్‌డ్ విషయంలో చాలా మంది విద్యార్థులకు కెమిస్ట్రీ క్లిష్టంగా అనిపిస్తుంది. కాబట్టి థియరీ సబ్జెక్ట్‌లనైనా ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో చదవాలి. కేవలం చదవడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. నేను ఇదే ఫార్ములాను అనుసరించి క్లిష్టంగా అనిపించిన ఫిజికల్ కెమిస్ట్రీలోని అంశాలపైనా అవగాహన పెంపొందించుకున్నాను. ప్రిపరేషన్ సమయంలో ఒక అంశాన్ని చదివేటప్పుడు దానికి అనుసంధానంగా ఉండే మిగతా అంశాలపై కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. తద్వారా తదుపరి దశల్లో ప్రిపరేషన్ చాలా సులభమవుతుంది. ముఖ్యంగా ఫిజిక్స్ విషయంలో ఈ తరహా ప్రిపరేషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

షార్ట్‌కట్ మెథడ్స్‌తో:
ప్రిపరేషన్ సమయంలో స్వల్ప కాలంలో సమస్యలను సాధించేలా.. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సొంతంగా షార్ట్‌కట్ మెథడ్స్, మెమరీ టిప్స్ పాటించాను. చదివిన ప్రతి అంశానికి సంబంధించి ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రాసుకోవడం, కీలకమైన కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు గుర్తుండేలా షార్ట్‌కట్ మెథడ్స్‌ను అనుసరించాను.

రోబోటిక్స్‌లో రీసెర్చ్:
ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌లో చేరడమే తక్షణ లక్ష్యం. ఆ కోర్సు పూర్తయ్యాక రోబోటిక్స్‌లో పరిశోధన చేయడమే భవిష్యత్తు ఆశయం. వీలుకాకపోతే ఐఐఎంలో ఎంబీఏ చేస్తా.

కష్టంగా భావించకుండా.. ఇష్టంగా:
ఔత్సాహిక విద్యార్థులు ‘జేఈఈలో ర్యాంకు సాధించడం అంత సులువు కాదు’.. అనే భయాన్ని వీడాలి. కష్టమైన సబ్జెక్ట్‌లపై ఇష్టం పెంచుకుంటే.. తేలికగానే సమస్యను అధిగమించొచ్చు. మొత్తం ప్రిపరేషన్ ప్రక్రియలో ఒత్తిడికి గురయ్యే సందర్భాలు ఎదురవడం సహజం. అలాంటప్పుడు కొద్దిసేపు మానసిక ఉల్లాసాన్ని కలిగించే అంశాలపై దృష్టి సారించాలి. నేను ఒత్తిడికి గురైన సందర్భంలో క్రికెట్ ఆడటం, సైన్స్ ఫిక్షన్ నవలలు చదివాను.

అకడెమిక్ ప్రొఫైల్
  • 2012లో పదో తరగతి ఉత్తీర్ణత (9.8 జీపీఏ)
  • 2014లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (981 మార్కులు)
  • ఎంసెట్-2014లో 127వ ర్యాంకు
  • బిట్‌శాట్-214 స్కోర్: 403
  • జేఈఈ-మెయిన్ మార్కులు: 316
  • జేఈఈ అడ్వాన్స్‌డ్ మార్కులు: 317
  • 2013లో కేవైపీవై ఎస్‌ఏ విభాగంలో మెంటార్‌షిప్‌నకు ఎంపిక
Published date : 28 Jun 2014 11:02AM

Photo Stories