Skip to main content

స్మితాసబర్వాల్ ఆదర్శంతో..స్టేట్ టాపర్‌గా నిలిచానిలా : స్నేహలత

స్నేహలత.. విద్యాకుసుమమై వికసించింది. టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. మెతుకుసీమ ఖ్యాతిని తెలంగాణ వ్యాప్తంగా చాటిచెప్పింది.
పాపన్నపేట మండలం ముద్దాపూర్‌కు చెందిన ఊరడి స్నేహలత టెట్-1పేపర్(డైట్)లో 150 మార్కులకుగానూ 134 మార్కులు సాధించింది. మొదటి ప్రయత్నంలోనే స్టేట్ టాపర్‌గా నిలవడం గమనార్హం.

మెరిసిన ముత్యం..
ముద్దాపూర్ గ్రామానికి చెందిన ఊరడి పోచమ్మ దినసరి కూలీ. రెక్కలు ముక్కలు చేసుకుంటూ కొడుకు నర్సింలును చదివించి టీచర్‌ను చేసింది. నర్సింలు ప్రస్తుతం కొల్చారం ఉన్నతపాఠశాలలో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నర్సింలు-విజయలక్ష్మి దంపతులకు స్నేహలత, సంపత్‌కుమార్ సంతానం. స్నేహలత చిన్నప్పటి నుంచే చదువులో చురుకైన విద్యార్థిని. ఒకటి నుంచి 7వ తరగతి మెదక్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో, 8వ తరగతి కృష్ణవేణి టాలెంట్‌స్కూల్, 9, 10 తరగతులు వర్గల్ నవోదయలో, ఇంటర్ బోడుప్పల్లో చదివి, రంగారెడ్డి జిల్లా సూరారంలో డైట్ పూర్తిచేసింది. ఇంటర్ తరువాత బీవీఆర్‌ఐటీలో ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో డైట్ పూర్తిచేసింది. అనంతరం మొదటిసారిగా అర్హతపరీక్ష రాసి 134 మార్కులు సాధించింది.

స్మితాసబర్వాల్ ఆదర్శంగా..
జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితాసబర్వాల్ నా ఆదర్శం. ఐఏఎస్ లక్ష్యంగా చదువు కొనసాగిస్తా. నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా కలెక్టర్‌గా సేవలందిస్తా. అంత వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సివిల్స్ సాధిస్తా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకం మేరకు ఈరోజు టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచాను.
- స్నేహలత
Published date : 26 Jun 2021 08:29PM

Photo Stories