Skip to main content

పరిశోధన, అభివృద్ధి రంగమే లక్ష్యం... గేట్ మెకానికల్ 5వ ర్యాంకర్

 
ఆటోమొబైల్స్‌పై ఆసక్తితో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రవేశం. అదే విభాగంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడం అత్యున్నత విద్యతోనే సాధ్యం. ఇందుకు సాధనం.. గేట్‌లో మెరుగైన ర్యాంకు. దీన్ని గుర్తించి, ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించి.. ఆశించిన లక్ష్యం సాధించిన గేట్ మెకానికల్ అయిదో ర్యాంకర్, ఆంధ్రా వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ మెకానికల్ చివరి సంవత్సరం విద్యార్థి అల్లూరి సునీల్ వర్మ సక్సెస్ స్టోరీ..

ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌తో మేనేజ్‌మెంట్‌లోనూ ఉన్నతవిద్యను అభ్యసించొచ్చు. కానీ అకడెమిక్స్‌కు అనుగుణమైన విభాగాల్లో ఉన్నత విద్య పూర్తి చేసినప్పుడే సార్థకత. అందుకే మొదట్నుంచీ ఇంజనీరింగ్‌లోనే కెరీర్‌కోసం దృష్టి సారించాను. ఫలితంగా మనం అకడెమిక్స్‌లో చదివిన అంశాలను క్షేత్రస్థాయిలో అన్వయం చేసేందుకు అవకాశం లభిస్తుంది. వృత్తి పరంగానూ సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనికితోడు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ పట్ల నెలకొన్న ఆసక్తి కూడా ఈ విభాగంలో అడుగుపెట్టేందుకు దోహదం చేసింది. అందుకే ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ఇతర బ్రాంచ్‌లలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మెకానికల్ బ్రాంచ్‌లోనే చేరాను.

అకడెమిక్స్.. గేట్ సిలబస్ సమన్వయంతో:
గేట్ ప్రిపరేషన్ కోసం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నుంచి పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. అకడెమిక్ సిలబస్‌ను గేట్ సిలబస్‌తో సమన్వయం చేసుకుని ప్రిపరేషన్ సాగించాను. అభ్యర్థుల కోణంలో గేట్ పరంగా లభించే ప్రయోజనం.. అకడెమిక్ సిలబస్‌లోని అంశాల నుంచే గేట్‌లో ప్రశ్నలు ఉంటాయి. దీంతో అకడెమిక్స్‌లో పట్టు సాధిస్తే గేట్‌లో విజయం సులువైనట్లే. ఇదే వ్యూహం అనుసరించి.. బీటెక్ అకడెమిక్స్‌తో సమాంతరంగా రోజుకు రెండు గంటలు.. పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు చొప్పున చదివాను. గేట్ సిలబస్‌లోని అంశాలపై ముందుగా స్పష్టత ఏర్పరచుకోవాలి. అప్పుడు ప్రిపరేషన్ పరంగా సమయం ఆదా అవడంతోపాటు ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

ఆన్‌లైన్ టెస్ట్‌లు.. అదనపు ప్రయోజనం:
గేట్‌లో విజయానికి ఉపకరించే మరో ముఖ్య సాధనం ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరవ్వడం. ఈ ఏడాది నుంచి గేట్ అన్ని సబ్జెక్ట్‌లకు ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించడం మొదలైంది. ఈ నేపథ్యంలో మాక్-ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరవ్వడం కూడా ఎంతో ఉపయోగపడింది. ఎంట్రన్స్ తేదీకి ముందు నెల రోజుల సమయాన్ని పూర్తిగా రివిజన్‌కు కేటాయించాను. ఇలా ప్రతి దశలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ ర్యాంకు సాధించగలిగాను. వాస్తవానికి వందలోపు ర్యాంకు వస్తుందని ఊహించాను కానీ టాప్-10లో నిలవడం అనిర్వచనీయ ఆనందాన్ని కలిగిస్తోంది.

ఐఐఎస్‌సీ బెంగళూరు లేదా ఐఐటీ-ముంబై:
ప్రస్తుత ర్యాంకుతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) లేదా ఐఐటీ-ముంబైలలో మెషీన్ డిజైన్ స్పెషలైజేషన్‌లో ప్రవేశం పొందాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇదే విభాగంలో ఆర్ అండ్ డీలో కెరీర్ లక్ష్యంగా ఎంచుకున్నాను. ఈ ఆశయంతోనే.. ఎల్ అండ్ టీ, విప్రో సంస్థల్లో క్యాంపస్ సెలక్షన్స్ లభించినా వదులుకుని గేట్ కోసం ఉపక్రమించాను.

కచ్చితత్వంతో చదవాలి:
గేట్ ప్రిపరేషన్ పరంగా ఔత్సాహికులకు ఇచ్చే సలహా.. ఎంత చదివామనే దానికంటే చదివిన అంశాలను ఎంత బాగా ఒంటబట్టించుకున్నామన్నదే ప్రధానమని గుర్తించాలి. ముఖ్యంగా నెగెటివ్ మార్కింగ్ ఉన్న గేట్‌లో ఇది కీలకం. చాలా మంది విద్యార్థులు మొత్తం సిలబస్‌ను పూర్తి చేయాలని.. అప్పుడే సత్ఫలితాలు వస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. దీనివల్ల అందుబాటులో ఉన్న సమయంలో అన్ని అంశాలు పూర్తి చేయలేక చివరి నిమిషంలో మానసిక ఆందోళనకు గురవుతారు. కానీ సిలబస్‌లో 80 నుంచి 85 శాతం అంశాలను కచ్చితత్వంతో పూర్తిచేస్తే సరిపోతుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో బీటెక్‌లో రెండో ఏడాది చివరి నుంచి లేదా మూడో ఏడాది నుంచి గేట్ కోసం ఉపక్రమిస్తే సత్ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా గేట్ ఆన్‌లైన్ స్లాట్ సమయం కూడా ఒక నెలరోజుల ముందే తెలుస్తుంది. ఆ సమయంలోనే మాక్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరైతే మానసికంగా సంసిద్ధత లభిస్తుంది.

అకడమిక్ నేపథ్యం:
2008లో పదో తరగతి (87 శాతం)ఉత్తీర్ణత.
2010లో ఇంటర్మీడియెట్ (95 శాతం) ఉత్తీర్ణత.
2010 ఎంసెట్‌లో 441వ ర్యాంకు.
ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ మెకానికల్‌లో ప్రవేశం.
Published date : 03 Apr 2014 05:58PM

Photo Stories