Skip to main content

నా జీవితంలో సాధించిన ఫస్ట్‌ర్యాంకు ఇదే

-ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేస్తా; అదే నా లక్ష్యం
-మేనేజ్‌మెంట్ రంగంలో పరిశోధనతో అద్భుత కెరీర్ సాధ్యం
-2012 ఐసెట్ స్టేట్ 1వ ర్యాంకర్ జయప్రకాశ్‌చారితో సాక్షి ఇంటర్వ్యూ

జీవితంలో ఒక్కసారైనా ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలవాలనేది నా కల. ఎప్పటినుంచో ఎదురుచుస్తున్నా. ఆశించిన ప్రతిసారీ నిరాశే. కాని ఎలాగైనాసరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టిపట్టుదలగా ప్రయత్నించా.. సొంత ప్రిపరేషన్‌తో కష్టపడి చదివి రెండోసారి ఐసెట్ రాశా. ఎట్టకేలకు స్టేట్ ఫస్ట్‌ర్యాంకు సాధించా. జీవితంలో ఇదే నా అత్యుత్తమ ర్యాంకు.

భవిష్యత్తులో ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనేది నా లక్ష్యం. అందుకోసం ఇప్పటినుంచే ప్రిపేరవుతున్నా. ఐసెట్ ఫలితాల్లో 50లోపు ర్యాంకు వస్తుందనుకున్నా. కాని ఫస్ట్‌ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది అంటున్నారు 2012 ఐసెట్ స్టేట్ 1వ ర్యాంకర్ డి.జయప్రకాశ్‌చారి. ఆయనతో సాక్షి ఇంటర్వ్యూ...

ఐసెట్‌లో ఫస్ట్‌ర్యాంకు సాధించడంపై ఎలా ఫీలవుతున్నారు?
ఐసెట్ పరీక్ష బాగా రాశాను. పలితాల్లో 50వ ర్యాంకులోపల రావచ్చని అనుకున్నా. కాని రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఒకరకంగా కెరీర్లో రాయబోయే ఇతర పరీక్షలకు ఐసెట్ టానిక్‌లా పనికి వస్తుందనుకున్నా. ఇంట్లో అమ్మానాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది.

మీ విద్యా, కుటుంబ నేపథ్యం?
మాది హైదరాబాద్. ప్లస్‌టూ ఏవీ కాలేజ్‌లో చదివాను. ఆ తర్వాత 2004లో బీఎస్సీ పూర్తిచేశాను. అదేవిధంగా
అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీజీ చేశాను. మా నాన్న ఏపీఎస్‌ఆర్‌టీసీలో ఫోర్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఏం చదువుతానన్నా ఇంట్లో ఎప్పుడూ ప్రోత్సహించారు. దీనివల్ల ఏ లక్ష్యాన్నైనా సాధించగల ధైర్యం నాలో పెరిగింది.

ఐసెట్ రాయడానికి కారణం?
మేనేజ్‌మెంట్ కోర్సు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అందుకోసం డిగ్రీ పూర్తై వెంటనే అప్పట్లో ఐసెట్ రాయగా 1,000వ ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది ఐసెట్‌కు మరింత ప్రణాళికతో ప్రామాణిక పుస్తకాలు చదివాను. ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. పూర్తిగా టెక్ట్స్‌బుక్స్‌పై ఆధారపడే ప్రిపరేషన్ చేశాను. దీంతో 172 మార్కులతో రాష్ట్రస్థాయి ఫస్ట్‌ర్యాంకు సాధించగలిగాను. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనేది నా లక్ష్యం. అందుకోసం వచ్చేడాది మ్యాట్ ప్రవేశపరీక్ష కోసం ఇప్పటినుంచే ప్రిపేరవుతున్నా. కష్టపడి టెక్ట్స్‌బుక్స్ ప్రణాళిక బద్థంగా చదివితే ఎవరైనా విజయం సాధించవచ్చు. అందుకే మ్యాట్‌పరీక్షకు సొంతంగానే ప్రిపరేషన్ మొదలుపెట్టాలని భావిస్తున్నా. ఈలోపు ఉస్మానియా యూనివర్సిటీలో టెక్నాలజీ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాలని
నిర్ణయించుకున్నా.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఐఐఎంలో ఏ బ్రాంచ్ ఎంచుకోవాలనుకుంటున్నారు?
హైదరాబాద్‌లోని ఫ్యాక్ట్‌సెట్ కంపెనీలో ప్రస్తుతం ఫైనాన్షియల్ డేటా ప్రొవైడర్‌గా పనిచేస్తున్నా. ఐఐఎం
అహ్మదాబాద్ దేశంలో అత్యుత్తమ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థ. ఇక్కడ ఎంబీఏ చేస్తే కెరీర్లో ఎంతోఎత్తుకు ఎదగవచ్చు. అందుకే ఇప్పటినుంచే అక్కడ సీటుకోసం ప్రిపేరవుతున్నా. ఎంబీఏ ఫైనాన్స్‌లో చేరాలనుకుంటున్నా.

ఐసెట్‌కు ఎలా ప్రిపేరయ్యారు?
ఐసెట్‌కు, ఐఐఎంల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష అయిన మ్యాట్‌కు చాలా వ్యత్యాసం ఉంది. టెక్ట్స్‌బుక్స్‌ను ప్రణాళికబద్ధంగా చదివితే ఐసెట్‌లో రాణించవచ్చు. అంతేకాకండా ఐసెట్‌కు సిలబస్ పరిధికూడా కొంత తక్కువగా ఉంటుంది. కాని ఐఐఎం ప్రవేశపరీక్ష సిలబస్ పరిధి ఎక్కువ. అంతేకాకుండా పూర్తి విశ్లేషణాత్మకంగా ప్రశ్నలు ఎదురవుతాయి. అందుకే ఐసెట్ పరీక్ష పెద్దగా కష్టంగా అనిపించలేదు. అందుకే ఎక్కడా కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా ప్రిపరేషన్ ప్రారంభించాను. అందుకోసం టెక్ట్స్‌బుక్స్‌తోపాటు టాటామెక్‌గ్రిల్ పుస్తకాలు బాగా ఫాలో అయ్యాను. వీటితోపాటు ఐసెట్ పాత పరీక్ష ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్‌చేశాను. దీనివల్ల పరీక్షవిధానం, పరీక్షలో అడిగే ప్రశ్నళ సరళి, విధానంపై బాగా స్పష్టత వచ్చింది. రోజుకు రెండుగంటల చొప్పున పరీక్షకు
ప్రిపేరయ్యాను.

భవిష్యత్తు లక్ష్యం?
ఐఐఎంలో ఎంబీఏ పూర్తయ్యాక పరిశోధనరంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నా. ప్రధానంగా ఎఫ్‌బీఎంలో రీసెర్చ్ అంటే నాకు చాలా ఇష్టం. మేనేజ్‌మెంట్ విద్యారంగంలో ఉన్నత చదువుల ద్వారా కెరీర్‌వృద్ధి బాగున్నపటికీ.. ఇదే రంగంలో పరిశోధన చేస్తే భవిష్యత్తులో అనేక అద్భుత అవకాశాలు దక్కించుకోవచ్చు. అందుకే ఆదిశగా కెరీర్‌ను
మలుపుతిప్పాలనుకుంటున్నా.

ఐసెట్ రాయాలనుకునే వారికి మీ సలహా?
పరీక్ష ప్రిపరేషన్‌కు ముందు అసలు పరీక్ష విధానంపై పూర్తిఅవగాహన ఉండాలి. ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు?
వాటి లోతు వంటివాటిని విశ్లేషించుకోవాలి. ప్రధానంగా లెవల్1 ప్రశ్నలేకాకుండా లెవల్2 ప్రశ్నలపైనా దృష్టిసారించాలి. అలాఅయితేనే పరీక్ష బాగా అటెంప్ట్‌చేయడంతోపాటు మంచి స్కోర్ సాధించవచ్చు. ప్రధానంగా
గ్రామీణప్రాంత విద్యార్థులు తాము ఐసెట్‌లో మంచి ర్యాంకు సాధించలేము..అనే నిరుత్సాహాన్ని విడనాడాలి. కనీసస్థాయి ఇంగ్లీషు పరిజ్ఞానం, లోతుగా చదవగలిగే నేర్పు ఉంటే సులువుగా విజయం సాధించవచ్చు.

Published date : 11 Jun 2012 07:19PM

Photo Stories