Skip to main content

మూడుసార్లూ సర్కారు కొలువే..

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నవతకు చిన్న వయస్సులోనే వివాహమైంది.

అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేది. అత్తగారింట్లో తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే భర్త ప్రోత్సాహంతో 2014 నుంచి గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధమవడం మొదలుపెట్టింది. ప్రిపరేషన్‌లో భాగంగా కోచింగ్ సెంటర్‌కు వెళ్లేది. అక్కడ చెప్పిన అంశాలను శ్రద్ధగా విని, ఇంటికొచ్చాక పునశ్చరణ చేసుకునేది. ఒక సబ్జెక్టుకోసం అనేక పుస్తకాలు చదవడానికి బదులు ఒకే పుస్తకాన్ని అనేకసార్లు చదువుకుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాననే  వేదనకు గురయ్యేది. అయినప్పటికీ భర్త సాగర్ ఏనాడూ నిరాశపరచలేదు. రెండేళ్ల తర్వాత 2016లో గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్ష ఆలస్యమవడం, ఎస్సై ఉద్యోగం నోటిఫికేషన్ రావడంతో ఆ పరీక్ష రాసింది. ‘ప్రిలిమ్స్ గట్టెక్కినా మెయిన్‌‌సలో అవకాశం తృటిలో జారిపోయింది.  ఆ సమయంలో  కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహం మరిచిపోలేను.,నీకు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం రాసి ఉంది..అందుకే వేరే జాబ్‌లు రావడంలేదంటూ స్ఫూర్తి కలిగించేవారు. తర్వాత కొద్ది రోజులకు గ్రూపు-2 పరీక్ష రాశా. అయితే అనివార్య కారణాలవల్ల అది కాస్తా కోర్టు కేసుల్లో చిక్కకుంది. ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శికి నోటిఫికేషన్ వస్తే రాశా. అందులో ఉద్యోగం సాధించి రంగారెడ్డి జిల్లా కందూకురు మండలంలో మూడునెలలు పనిచేశా. ఆ తర్వాత ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లో వచ్చి  అందులో చేరా. ఇప్పుడు తాజాగా ప్రకటించిన టీఎస్‌పీఎస్సీలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో వరుసగా మూడోసారి ప్రభుత్వ  ఉద్యోగానికి ఎంపిక కావడం ఆనందం కలిగిస్తోంది’ అని నవత నవ్వుతూ తెలిపింది.

Published date : 07 Sep 2021 05:02PM

Photo Stories