Skip to main content

మహిళా సాధికారతే లక్ష్యం - 2011 గ్రూప్-1 రెండో ర్యాంకర్ హేమలత

సుదీర్ఘ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత భ్యర్థుల ఆశలు సాకారమయ్యాయి. గ్రూప్-1 (2011) నోటిఫికేషన్ రీ-ఎగ్జామినేషన్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. 470 మార్కులతో రెండో స్థానంలో, మహిళా టాపర్‌గా నిలిచిన కనుగుల హేమలత సక్సెస్ స్పీక్స్...
మాది వ్యవసాయ కుటుంబం. అక్క, అన్నయ్య ఇద్దరూ ప్రభుత్వ సర్వీసుల్లో చేరడం.. ఒకరు టీచర్‌గా, మరొకరు ఏఈఈగా ఎంపికవడమే నేను గ్రూప్-1ను ప్రధాన లక్ష్యంగా ఎంపిక చేసుకోవడానికి ప్రేరణ. నా విద్యాభ్యాసం పలు ప్రాంతాల్లో సాగింది. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌లో చేరాలనుకొని ఒక ఏడాది పూర్తిగా ఎంసెట్ ప్రిపరేషన్‌కే కేటాయించాను. అప్పుడు కూడా ఆశించిన ర్యాంకు రాలేదు. దాంతో 2002లో శ్రీకాకుళం జిల్లాలో డైట్ కళాశాలలో చేరి 2004లో పూర్తి చేశాను.

ప్రభుత్వ టీచర్‌గా
నా జీవితంలో అత్యంత ఆనందకరమైన సందర్భం డైట్ కోర్సు పూర్తవుతూనే సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగం లభించడం. నేను డైట్‌లో టీటీసీ ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు డీఎస్సీ-2003 నోటిఫికేషన్ వెలువడింది. ఆ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మహిళా టాపర్‌గా, మా జిల్లాలో మూడో ర్యాంకర్‌గా నిలిచాను. ఫలితంగా.. ఎస్‌జీటీ పోస్ట్ లభించింది. ఆరున్నరేళ్లపాటు ఆ వృత్తిలో కొనసాగాను.

ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ: మరింత ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే.. కనీసం బ్యాచిలర్ డిగ్రీ అర్హత తప్పనిసరి. కానీ.. అప్పటికి చేతిలో డిగ్రీ లేదు. దాంతో డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2004-07 మధ్య కాలంలో దూర విద్య విధానంలో డిగ్రీ పూర్తి చేశాను. ఉన్నత ఉద్యోగం లక్ష్యంగా కృషిచేస్తూనే.. మరోవైపు ఉన్నత విద్య కూడా అభ్యసించాను.

మూడుసార్లు వైఫల్యం: విద్యార్హతలు పెరగడంతో నా లక్ష్యం స్పష్టంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా ముందుకుసాగాను. మూడుసార్లు గ్రూప్-1 ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ.. కొద్దిపాటి మార్కులతో విజయం చేజారింది. గ్రూప్-1కు ప్రిపరేషన్ సాగిస్తూనే నా అర్హతలకు సరిగూతే ఇతర పరీక్షలకు కూడా హాజరయ్యాను. ఫలితంగా.. 2012లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను. 2011 గ్రూప్-1 విషయంలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ప్రిపేర్ అయ్యాను. ఫలితంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ.. పరీక్ష రద్దవడంతో ఎంతో నిరాశకు గురయ్యాను. అయితే మళ్లీ నిర్వహిస్తారు. తప్పక విజయం సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసంతో నిరంతరం అడుగులు వేశాను.

స్వీయ ప్రిపరేషన్: గ్రూప్-1 ప్రిపరేషన్ పరంగా శిక్షణ తీసుకోలేదు. పూర్తిగా స్వీయ ప్రిపరేషన్‌పైనే ఆధారపడ్డాను. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, అకడమిక్ పుస్తకాలు, ఆన్‌లైన్ మెటీరియల్ రిసోర్సెస్‌ను వినియోగించుకున్నాను. తాజాగా విడుదల చేసిన మార్కుల జాబితాలో రెండో స్థానంలో నిలవగలిగాను.

ఇంటర్వ్యూ ఉద్యోగ నేపథ్యంపైనే:
నా ఇంటర్వ్యూ ఎక్కువగా ప్రస్తుతం పని చేస్తున్న డీఏఓ ఉద్యోగ నేపథ్యంపైనే జరిగింది. అవినీతి గురించి.. ఒక అధికారిగా మీకున్న విచక్షణాదికారాలను ఎలా వినియోగిస్తారు? తాజా కేంద్ర బడ్జెట్‌పై అభిప్రాయం ఏంటి? వంటి ప్రశ్నలతో దాదాపు 15 నిమిషాలపాటు ఇంటర్వ్యూ సాగింది.

సానుకూల దృక్పథం:
  గ్రూప్స్ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న లక్ష్యం దిశగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. ఒడిదుడుకులు ఎదురైనా నిరుత్సాహానికి గురికాకుండా.. రెట్టించిన ఉత్సాహంతో అడుగులు వేయాలి. ప్రస్తుతం నాకు వచ్చిన మార్కులతో డిప్యూటీ కలెక్టర్ పోస్టు లభిస్తుందనే నమ్మకం ఉంది. ఆ హోదాలో.. నా పరిధిలో మహిళా సాధికారతకు, విద్యాభివృద్ధికి కృషి చేస్తాను!
Published date : 22 Feb 2018 03:33PM

Photo Stories