Skip to main content

కూలీ ఇంట విరిసిన కుసుమం..వీఆర్‌వో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎం.నరేంద్రరెడ్డి

ఇంటికి పెద్దకొడుకు. ఆస్తిపాస్తుల్లేవు... రోజూ కూలికెళితేగానీ కుటుంబం గడవదు. ఏమీ లేకున్నా.. కడుపులో పెట్టుకు చూసుకునే అమ్మ కూడా దూరమైంది. వీటన్నింటినీ దిగమింగుతూ అక్షర సేద్యం సాగించాడు ఆ కుర్రాడు. లక్ష్యసాధనలో పలకరించే అపజయాలు, ఇతరుల విమర్శలకూ కుంగిపోలేదు. వీటన్నింటినీ అధిగమించి అవహేళనలకు ‘వంద’ శాతం సమాధానమిచ్చాడు మార్తాల నరేంద్రరెడ్డి. వీఆర్‌వో (గ్రామ రెవెన్యూ అధికారి) పరీక్షలో లక్షలాది మందితో పోటీపడి విజయదుందుభి మోగించాడు. 100/100 మార్కులతో చరిత్ర సృష్టించాడు. నరేంద్రరెడ్డి స్ఫూర్తిదాయక విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..

చదువంటే ప్రాణం..
మాది చిత్తూరు జిల్లా గంగన్నగారిపల్లె. నాన్న వెంకటసుబ్బారెడ్డి, అమ్మ సుమిత్రమ్మ. తమ్ముడు హరిశంకర్‌రెడ్డి. అమ్మానాన్నలిద్దరూ నిరక్షరాస్యులే. రోజూ కూలికి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. కానీ నాకు చదువంటే ప్రాణం. పదోతరగతి వరకు జిల్లా పరిషత్ స్కూల్‌లో చదివా. ఇంటర్, డిగ్రీ, పీజీ మదనపల్లెలో పూర్తిచేశా. పదోతరగతిలో 500/600. ఇంటర్‌లో 87శాతం, డిగ్రీలో 91 శాతం మార్కులు సాధించా. నా విజయంలో కీలకపాత్ర తమ్ముడిదే. ప్రస్తుతం తాను ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్నాడు. ఇల్లు గడవటమే కష్టంగా మారిన సమయంలో నేనున్నానంటూ పోటీపరీక్షలకు ప్రోత్సహించాడు. నా లక్ష్యాన్ని చేరేందుకు ఊతమిచ్చాడు.

చదివితే వస్తాయా! అన్నారు..
డబ్బుల్లేకపోయినా ఏ నాడూ బడి మానలేదు. పైగా ఉన్నతస్థాయికి చేరాలనే కసి పెరిగింది. డిగ్రీలో ఉన్నప్పుడు అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. దహన ఖర్చులకూ స్థోమతలేని దుస్థితి. ఆ మనోవ్యథ మరింత కుంగదీసింది. కానీ.. కష్టాలు అందరికీ వస్తాయి. నిలదొక్కుకుని నిలిచేవాడే.. ధీరుడంటూ అమ్మ చెప్పిన మాటలు స్ఫూర్తి నింపేవి. ఎవరిపై ఆధారపడకుండా.. స్వశక్తితో సంపాదన మార్గం ఎంచుకున్నా. పదో తరగతి వరకూ పనికెళ్లినా.. ఇంటర్ నుంచి ఇంటివద్దనే ట్యూషన్లు చెప్పేవాడిని. వచ్చిన డబ్బులను పొదుపుగా వాడుకుంటూ చదువు కొనసాగించా. ఇరుగుపొరుగు ‘అమ్మ లేదుగా.. ఇంటికి పెద్ద కొడుకువి.. పెళ్లి చేసుకోరాదా’ అనేవాళ్లు. ఎంత చదివినా.. ఏ పరీక్షలు రాస్తున్నా.. ఏం రాసినా ఉద్యోగాలు వస్తాయా! అంటూ విమర్శలూ వినిపించేవి. నా లక్ష్యం నాకు తెలుసు కాబట్టి.. ఇవేమీ పట్టించుకునే వాడిని కాదు.

చేతిదాకా వచ్చి..
గ్రూప్-4, 2012లో వీఆర్‌వో రెండు ఉద్యోగాలు చేతి దాకా వచ్చి జారిపోయాయి. అక్కడ ఎదురైన అపజయాలకు కారణాలను తెలుసుకున్నా. పొరపాట్లను సరిదిద్దుకున్నా. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల నిరాశ ఆవహించేది. 2012లో వీఆర్‌వోలో 84 మార్కులు వచ్చాయి. ఈసారి కనీసం 90కు పైగా మార్కులు సాధించవచ్చనుకున్నా. పరీక్ష రాశాక 95 మార్కులు గ్యారంటీ అనుకున్నా. వంద మార్కులు రావడం ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది.

రోజూ నాలుగు గంటలు..
మనసుపెట్టి ఏకాగ్రతగా చదవడమే నా విజయ రహస్యం. ప్రత్యేకమైన కోచింగ్ అంటూ ఏమీ లేదు. రోజూ లైబ్రరీకి వెళ్లడం అలవాటు. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కావడం వల్ల ఆ విభాగంలో మంచి స్కోరు చేశా. గ్రూప్-2 ప్రిపరేషన్, గత వైఫల్యాలు నా విజయానికి సహకరించాయి. ‘భవిత’లో ఇచ్చిన మెటీరియల్, సాక్షి వీఆర్‌వో బుక్‌లెట్ నా విజయం లో ప్రధానపాత్ర పోషించాయి. సాక్షిలో మూడేళ్ల నుంచి ఇస్తున్న వివిధ మెటీరియల్స్‌ను భద్రం చేసుకున్నా. రోజూ రాత్రి 9 నుంచి 12 గంటల వరకూ చదివేవాడిని. వర్తమాన అంశాలకు ఆలిండియా రేడియోలో వార్తలు వినేవాడిని.

ఏకాగ్రత.. కోడింగ్..
చదివిన కొద్ది సమయమైనా ఏకాగ్రత ముఖ్యం. కీలకమైన విషయాలు, అంశాలు, సంవత్సరాలను కోడింగ్ రూపంలోకి మార్చుకుంటే పరీక్షలో తికమకపెట్టేలా ప్రశ్నలిచ్చినా సరైన జవాబు ఇవ్వగలం. ‘సమస్యలు అందరికీ ఉంటాయి. వాటికి పరిష్కారం చూపడం విజేతల లక్ష్యం. సాకులు వెతకడం సరికాదు’. అంటూ పెద్దలు చెప్పే మాటలు జీవనసత్యం. ఏకాగ్రతతో కష్టించి చదివితే ఎంచుకున్న దారిలో విజేతలుగా నిలవడం కష్టమేమీ కాదు. గ్రూప్స్‌లో విజయం సాధించడమే నా లక్ష్యం.
Published date : 24 Feb 2014 03:27PM

Photo Stories